ఉపాధిహామీలో అవినీతి మట్టి | Corruption In MGNREGA Scheme In Prakasam | Sakshi
Sakshi News home page

ఉపాధిహామీలో అవినీతి మట్టి

Published Sat, Mar 16 2019 12:04 PM | Last Updated on Sat, Mar 16 2019 12:05 PM

Corruption In MGNREGA Scheme In Prakasam - Sakshi

వలస బతుకుల్లో వెలుగులు నింపాలని, వాళ్లకి పట్టెడు అన్నం పెట్టాలని ప్రారంభించిన ఉపాధిహామీ పథకం అధికార పార్టీ నాయకుల ధనదాహానికి బలవుతుంది. కోట్లు కొల్లకొడతూ కూడు లేక అలమటించే బతుకుల్లో నిర్వేదం నింపుతున్నారు. కూలీలది బతుకుపోరాటం అయితే నాయకులది కాసుల ఆరాటం. ఉపాధి పనుల్లో 18 కోట్లు దోచుకుని 22 మంది ఉద్యోగుల కొలువులు పోగొట్టుకోవడానికి కారణం అయ్యారు పచ్చనేతలు.

సాక్షి, త్రిపురాంతకం(ప్రకాశం): మహాత్మా గాంధీ జాతీయ ఉపాధిహామీ పథకాన్ని సొంతానికి వాడేసుకున్నారు అధికారపార్టీ నాయకులు. ఈ అక్రమాలు సామాజిక తనిఖీల్లో బయటపడటంతో  22 మంది ఉపాధిహామీ ఉద్యోగాలను విధుల నుంచి తొలగించారు. రైతుల కోసం వ్యవసాయ క్షేత్రాల్లో మంజూరైన నీటి సంజీవని కుంటల్లో జరిగిన అక్రమాలకు ఇది నిదర్శనం. త్రిపురాంతకం మండలంలో 2016–2017 సంవత్సరంలో జరిగిన ఉపాధిహామీ పనుల్లో భారీగా అవినీతి జరిగినట్లు 9వ విడత సామాజిక తనిఖీ బృందాలు నిర్దారించాయి. ఈ అక్రమాలన్నీ ఫారం పాండ్‌ నీటి కుంటలు తీసేందుకు చేపట్టిన పనుల్లోనే జరిగాయి. 600 నీటి కుంటల్లో ఈ అక్రమాలు జరిగినట్లు తెలుస్తుంది. దీంట్లో 18 కోట్ల రూపాయల మేర అవినీతి జరిగిందని సామాజిక తనిఖీ బృందాలు తేల్చాయి.

25లక్షల రూపాయలను ఉపాధి సిబ్బంది నుంచి రికవరీ చేశారు. నీటి కుంటలను కూలీలతో తీయించాల్సి ఉండగా మిషన్‌లు వినియోగించి తీయడం, కొన్ని నామమాత్రంగా చూపించారు, కొన్ని అసలు తీయకుండానే నిధులు స్వాహా చేశారు.అప్పట్లో పనిచేసిన సిబ్బందిపై అధికారపార్టీ నాయకులు ఒత్తిడి తెచ్చి బిల్లులు చేయించుకున్నట్లు ఉపాధిసిబ్బంది నెత్తీనోరుబాదుకున్నారు. రాజకీయ ఒత్తిల్లకు తలొగ్గి పనిచేసినందుకు వాళ్లు భారీగా మూల్యం చెల్లించకతప్పలేదు. 14 మంది ఎఫ్‌ఏలు, 4 టిఏలు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, ఇద్దరు ఏపిఒ, ఈసి ఒక్కొక్కరు చొప్పున విధుల నుంచి తాత్కాలికంగా తప్పించగా, గత నెల నుంచి పూర్తిగా తొలగిస్తున్నట్లు ఆదేశాలు అందాయి. ఇదే జాతీయ ఉపాదిహామీ పథకంలో చేసిన అక్రమాలకు నగదు తీసుకుంటుండగా త్రిపురాంతకం ఎంపిడిఓను ఏసిబి అధికారులు పట్టుకున్నారు.దీనిని బట్టి చూస్తే అధికారపార్టీ వారు జాతీయ ఉపాధి హామి పథకాన్ని ఎంత  దుర్వినియోగం చేశారో అర్థం చేసుకోవచ్చు.

అవినీతి పెరిగిపోయింది
ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పనుల్లో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయి. ఈ శాఖలో పనిచేసిన పనిచేసిన సిబ్బంది అధికారపార్టీ ఆగడాలకు బలైపోయారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అక్రమాలు చోటుచేసుకున్నాయి.
- ఆర్‌ పిచ్చయ్య, ఎండూరివారిపాలెం

రూ.కోట్లల్లో అవినీతి
జాతీయ ఉపాధిహామీ పథకంలో కోట్లాదిరూపాయల అవినీతి చోటు చేసుకుంది. 2016–2017 సంవత్సరంలోనే 18 కోట్ల రూపాయల మేర అవినీతి జరిగిందంటే అధికారపార్టీ చేసిన అక్రమాలు ఎలా ఉన్నాయో తెలుస్తోంది. వలస కూలీలకు పనులు కల్పించాల్సిన నిధులను ఈవిధంగా దుర్వినియోగం చేయడం చూస్తే అధికారపార్టీ ఎవరి కోసం పనిచేసిందో అర్థంచేసుకోవచ్చు.
- పి చంద్రమౌళిరెడ్డి , వైఎస్సార్‌ సీపీ కన్వీనర్‌,  త్రిపురాంతకం 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

ఎంపీడీఓ కార్యాలయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement