
గ్రామపంచాయతీలకు మహర్దశ
♦ తొలిదశలో 1,000 పంచాయతీలకు సొంత భవనాలు
♦ ఈ ఏడాది రూ.120 కోట్లు వెచ్చించనున్న గ్రామీణాభివృద్ధి శాఖ
♦ అక్టోబరులో పనుల ప్రారంభానికి సన్నాహాలు
సాక్షి, హైదరాబాద్: గ్రామపంచాయతీ కార్యాలయాలకు మహర్దశ పట్టనుంది. శిథిల, అద్దె భవనాల్లో నడుస్తున్న పంచాయతీలకు సొంత భవనాల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. పల్లెప్రగతి, గ్రామజ్యోతి తదితర పథకాల ద్వారా పౌర సేవలు, ఉపాధిహామీ, ఆసరా పింఛన్ తదితర ఆర్థిక చెల్లింపులు, విద్య, వైద్య, పారిశుధ్య తదితర కార్యక్రమాలపట్ల అవగాహన సదస్సులు, గ్రామ కమిటీల సమావేశాలు ఇకపై పంచాయతీ కార్యాలయాల నుంచే నిర్వహించాల్సి ఉన్నందున విశాలమైన భవనాలు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో హైదరాబాద్ మినహా తొమ్మిది జిల్లాల్లో మొత్తం 8695 గ్రామ పంచాయతీలు ఉండగా వీటిలో 375 పంచాయతీలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి.
దశాబ్దాల క్రితం నిర్మించిన మరో 4500 గ్రామపంచాయతీల భవనాలు శిథిలావస్థకు చేరినట్లు అధికారుల పరిశీలనలో తేలింది. గ్రామ పంచాయతీలకు సొంత భవనాల నిర్మాణాన్ని మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) కింద చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మెటీరియల్ కాంపొనెంట్ కింద ఈ ఏడాది రూ.120 కోట్లు పంచాయతీ భవనాల నిర్మాణానికి కేటాయించారు. తొలిదశలో ఒక్కో గ్రామపంచాయతీ భవనానికి రూ.12 లక్షల చొప్పున 1,000 గ్రామ పంచాయతీలకు కొత్త/ సొంత భవనాలు నిర్మించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు.
దశలవారీగా వచ్చే మూడేళ్లలో మరో నాలుగు వేల భవనాలు నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు. ఈ మేరకు జిల్లాలవారీగా భవనాల ఆవశ్యకత ఉన్న గ్రామాలను ఎంపిక చేసి నెలాఖరు కల్లా నివేదిక సమర్పించాలని తొమ్మిది జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. అక్టోబర్‌లో కొత్త భవనాల నిర్మాణాన్ని ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.