సాక్షి, అమరావతి: మహిళా సాధికారత దిశగా రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తున్న నేపథ్యంలో వైఎస్సార్ చేయూత, ఆసరా, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, సున్నా వడ్డీ ద్వారా జీవనోపాధి మార్గాలను మరింత విస్తృతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. చేయూత లబ్ధిదారులకు వరుసగా నాలుగేళ్ల పాటు క్రమం తప్పకుండా ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్లు గుర్తు చేశారు. ఆసరా, సున్నా వడ్డీ, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం పథకాల కింద కూడా నిర్దేశిత వ్యవధి ప్రకారం ఆర్థిక సాయాన్ని అందిస్తున్నామన్నారు.
ఒకవైపు ఆర్థిక సాయంతో పాటు మరోవైపు బ్యాంకుల ద్వారా స్వయం ఉపాధి కోసం తోడ్పాటు అందిస్తున్నట్లు చెప్పారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై ముఖ్యమంత్రి జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఉపాధి హామీ అమలు, గ్రామీణ రహదారులపై కూడా సమీక్షించి పలు సూచనలు చేశారు. ఆ వివరాలివీ..
సుస్థిర ఆర్థిక ప్రగతి దిశగా..
లబ్ధిదారులు పథకాన్ని అందుకున్న మొదటి ఏడాది నుంచే స్వయం ఉపాధి మార్గాలవైపు మళ్లించే కార్యక్రమాలను పెంచడం వల్ల గ్రామ స్థాయిలో సుస్థిర ఆర్థిక ప్రగతి దిశగా వేగంగా అడుగులు పడతాయని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. అర్హులైన మహిళలకు అవగాహన పెంపొందించి బ్యాంకు రుణాలు కూడా ఇప్పించి ఉపాధి మార్గాలను సమర్థంగా కొనసాగించాలన్నారు. మహిళలు తయారు చేసే వస్తువులు, ఉత్పాదనలకు సంబంధించి మంచి మార్కెట్ వ్యవస్ధ ఉండాలని, దీనికోసం బహుళజాతి కంపెనీలతో అనుసంధానం కావాలని సూచించారు.
చేయూతతో 9 లక్షల మందికి స్వయం ఉపాధి
45 – 60 సంవత్సరాల వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల సాధికారతే లక్ష్యంగా అమలు చేస్తున్న వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఇప్పటివరకూ 9 లక్షల మంది స్వయం ఉపాధి పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు. హిందుస్తాన్ యూనీ లీవర్, ఐటీసీ లిమిటెడ్, రిలయెన్స్, అజియో, జీవీకే, మహీంద్ర, కాలాగుడి, ఇర్మా, నైనా, పీ అండ్ జీ లాంటి అంతర్జాతీయ సంస్థలతో ఇప్పటికే ఒప్పందాలు జరిగినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా చేయూత మహిళా మార్టులు, వస్త్ర, చింతపండు ప్రాసెసింగ్ యూనిట్, లేస్ పార్కు, ఇ–కామర్స్, ఇ–మిర్చ, బ్యాక్ యార్డు పౌల్ట్రీ, ఆనియన్ సోలార్ డ్రయ్యర్ల లాంటివి చేపడుతున్నట్లు అధికారులు వివరించారు.
ఈ ఏడాది ‘ఉపాధి’ వ్యయం రూ.8,800 కోట్లు
ఉపాధి హామీపై సమీక్ష సందర్భంగా ఈ ఏడాది 1,500 లక్షల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ 215.17 లక్షల పనిదినాలు కల్పించారు. ఉపాధి హామీ పనిదినాల రూపంలో రూ.5,280 కోట్లు ఖర్చు చేయనున్నారు. మెటీరియల్ రూపంలో రూ.3,520 కోట్లు ఖర్చు చేయనున్నారు. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.8,800 కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు.
గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఉపాధి హామీ నిధులు సుమారు రూ.880 కోట్లు రావాల్సి ఉందని అధికారులు వెల్లడించగా దీనిపై వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్ భవన నిర్మాణాలు గడువులోగా పూర్తి కావాలన్నారు.
మన్నికగా నాణ్యమైన రోడ్లు..
రహదారుల నాణ్యతపై మరింత దృష్టి పెట్టాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. కనీసం ఐదేళ్లపాటు నిలిచేలా నాణ్యతా ప్రమాణాలను పాటించాలని స్పష్టం చేశారు. రహదారుల పనులు చేసిన మరుసటి ఏడాదే మళ్లీ మరమ్మతులు చేపట్టాల్సిన పరిస్థితి తలెత్తకూడదన్నారు. ఆ మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఇంజనీర్లు రోడ్ల నాణ్యతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు.
సమావేశంలో ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాల నాయుడు, సీఎస్ డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ సూర్యకుమారి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ పి.బసంత్ కుమార్, సెర్ప్ సీఈవో ఎండీ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాకు రెండు మహిళా సూపర్ మార్కెట్లు
గ్రామీణ ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులను మార్కెట్ ధర కంటే తక్కువకే అందించాలన్న లక్ష్యంతో స్వయం సహాయక సంఘాల మహిళల ఆధ్వర్యంలో సూపర్ మార్కెట్లను నెలకొల్పుతున్నట్లు సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. జిల్లాకు కనీసం రెండు సూపర్ మార్కెట్లను ఏర్పాటు కానున్నట్లు చెప్పారు. ఇప్పటికే 27 చేయూత మహిళా మార్టులు ఏర్పాటయ్యాయని వివరించారు. ఒక్కో సూపర్ మార్టును నెలకు కనీసం రూ.30 లక్షలు టర్నోవర్ లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
వ్యాపారాన్ని అభివృద్ధి చేసేందుకు డోర్ డెలివరీ, ఆన్‌లైన్ బుకింగ్, వాట్సాప్ బుకింగ్ సౌకర్యాలను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. మల్టీ నేషనల్ కంపెనీల భాగస్వామ్యంతో ఉత్పత్తుల్లో కనీసం 8 నుంచి 25 శాతం మార్జిన్ ఉండేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో ‘వస్త్ర’ పేరుతో ఏర్పాటైన దుస్తుల తయారీ యూనిట్‌లో 200 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారని, ట్రెండ్స్, అజియో లాంటి కంపెనీలతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. చిత్తూరు జిల్లా కురుబలకోటలో చింతపండు ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా సుమారు 3 వేల కుటుంబాలకు చేయూత లభిస్తున్నట్లు వివరించారు.
Andhra Pradesh: సాధికారత సుస్థిరం
Published Fri, Apr 28 2023 3:19 AM | Last Updated on Fri, Apr 28 2023 9:26 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment