
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జలకళ పథకం ద్వారా మార్చి నెలాఖరు కల్లా రైతుల పొలాల్లో 22,400 ఉచిత బోర్లు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్, వాటర్ షెడ్ డైరెక్టర్ పీవీఆర్‌ఎం రెడ్డి బుధవారం 13 జిల్లాల డ్వామా పీడీలతో సమావేశం నిర్వహించి జిల్లాల వారీగా లక్ష్యాలను నిర్దేశించారు. రాష్ట్రవ్యాప్తంగా జనవరిలో 3,200, ఫిబ్రవరిలో 9,600, మార్చిలో 9,600 చొప్పున ఉచిత బోర్లు తవ్వేందుకు జిల్లాల వారీగా ప్రణాళికలు ఖరారు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.
రెండున్నర ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల దరఖాస్తులు నిబంధనల మేరకు తిరస్కరణకు గురయ్యాయన్నారు. ఆయా రైతులు కనీసం రెండున్నర ఎకరాలుండేలా గ్రూపులుగా ఏర్పడి తిరిగి దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించాలని జిల్లా అధికారులకు సూచించారు.