సాక్షి, అమరావతి: రైతుల ప్రయోజనాలకు ప్రతిబంధకంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ నీరు, భూమి, చెట్టు చట్టం (వాల్టా) నిబంధనల్లో స్వల్ప మార్పులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం తీసుకుంది. ఇందుకు గల సాధ్యాసాధ్యాలపై శాస్త్రీయ అధ్యయనం చేసి నివేదిక సమర్పించేందుకు ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. రాష్ట్రంలో ప్రస్తుతం భూగర్భ జలమట్టం ఎలా ఉంది, వాల్టా చట్టంలోని ఏయే నిబంధనలు రైతులకు సమస్యాత్మకంగా మారాయి, వీటిని రైతులకు ప్రయోజనం కలిగించేలా ఎలా మార్చాలి, ఇందుకు ఎలాంటి విధి విధానాలు పాటించాలి అనే అంశాలపై కమిటీ ప్రతినిధులైన నిపుణులు లోతుగా అధ్యయనం చేశారు. రాష్ట్రంలో మొత్తం ఎన్ని వ్యవసాయ బోర్లు ఉన్నాయి, ఏయే ప్రాంతాల్లో ఈ బోర్లలో ఎంత లోతులో నీరు ఉంది, గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు పరిస్థితిలో ఎలాంటి మార్పు వచ్చిందనే సమాచారాన్ని కూడా తెప్పించుకుని శాస్త్రీయంగా విశ్లేషించారు. ఇంకా కొంత అదనపు సమాచారం పంపాలని రాష్ట్ర భూగర్భ జల శాఖను కోరారు. ఈ శాఖ అధికారులు ఈ డేటా సమీకరించి పంపించే పనిలో ఉన్నారు.
27, 28 తేదీల్లో సెమినార్
ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీలో పంచాయతీరాజ్ కమిషనర్ చైర్మన్‌గా, భూగర్భ జల శాఖ సంచాలకులు కన్వీనర్‌గా, ఆయా రంగాల/సంస్థల ప్రతినిధులైన నిపుణులు సభ్యులుగా ఉన్నారు. జాతీయ భూగర్భ జల శాఖ ఉప సంచాలకులు, జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) వాటర్ షెడ్ విభాగం డైరెక్టర్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ (ఎన్‌ఐహెచ్), నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌జీఆర్‌ఐ) ప్రతినిధులు, రాష్ట్ర గ్రామీణ నీటి సరఫరా (ఆర్‌డబ్ల్యూఎస్) ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ), ఆంధ్ర విశ్వవిద్యాలయం జియో ఫిజిక్స్ విభాగం ప్రొఫెసర్ తదితరులు ఈ కమిటీ సభ్యులుగా ఉన్నారు. వీరంతా ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెండుసార్లు సమావేశమయ్యారు. ఈ నెల 28, 29 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల భూగర్భ జల శాఖ ఉప సంచాలకులు, డ్వామా పీడీలు, జల వనరుల శాఖ ఎస్‌ఈలు, ఇతర జిల్లా అధికారులతో ప్రత్యక్షంగా సెమినార్ నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది. కమిటీ ప్రతినిధులంతా ఈ సెమినార్‌కు హాజరై చర్చలు జరుపుతారు. అనంతరం చట్టంలోని నిబంధనల మార్పునకు సంబంధించి ఈ కమిటీ త్వరలో మధ్యంతర నివేదిక సమర్పించే దిశగా కసరత్తు చేస్తోంది. అనంతరం ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోనుంది.
అసలు చిక్కు ఇదీ!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జీవో–227 జారీ చేసింది. భూగర్భం నుంచి నీటిని ఎక్కువగా తోడేసిన (ఓవర్ ఎక్స్‌ప్లాయిటేషన్) ప్రాంతాల్లో కొత్తగా బోర్లు వేయరాదనేది ఇందులో ఒక నిబంధన. రాష్ట్రంలో ప్రస్తుతం 1,094 గ్రామాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ గ్రామాల్లో ‘వైఎస్సార్ జలకళ’ పథకం కింద కూడా బోర్లు వేయడానికి లేదు. అలాగే హార్డ్ రాక్ ప్రాంతంలో 120 మీటర్ల లోతుకు మించి బోరు వేయరాదనేది మరో నిబంధన. ఒక బోరు ఇంత దూరంలో ఉంటే ఆ పరిధిలో మరో బోరు వేయరాదనేది ఇంకో నిబంధన జీవోలో ఉన్నాయి. రాయలసీమ, పల్నాడు ప్రాంతాల్లో రాతి నేలలే ఉన్నాయి. ఇక్కడ 120 మీటర్ల లోతున మాత్రమే బోరు వేయాలన్న నిబంధన ఉంది. ఇంత లోతు మాత్రమే బోరు వేస్తే నీరు రాదు.
అందువల్ల బోరు వేసినా ప్రయోజనం శూన్యం. అలాగే 200–300 మీటర్ల పరిధిలో బోరు ఉంటే మరో బోరు వేయకూడదనే నిబంధన వల్ల పక్క రైతు పొలంలో బోరు ఉంటే మరో రైతు వేసుకోవడానికి వీలుకాదు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉచితంగా బోర్లు వేసి మోటర్లు అమర్చాలనే సమున్నత ఆశయంతో ప్రవేశపెట్టిన వైఎస్సార్ జలకళకూ ఇవే నిబంధనలు వర్తిస్తున్నాయి. దీనివల్ల తమకు ఈ పథకం కింద లబ్ధి పొందే అవకాశం లేకుండా పోయిందని, ఈ నిబంధనలను సవరించాలని రైతుల, రైతు సంఘాల నుంచి ప్రభుత్వానికి పెద్దఎత్తున వినతులు అందాయి. దీంతో రైతుల ప్రయోజనార్థం ఈ నిబంధనలు మార్చడానికి తీసుకోవాల్సిన చర్యలపై సిఫార్సులు సమర్పించే బాధ్యతను ఉన్నత స్థాయి కమిటీకి ప్రభుత్వం అప్పగించింది.
Comments
Please login to add a commentAdd a comment