సాక్షి, అమరావతి: గ్రామీణ పేదలకు పనులు కల్పించే ఉపాధి హామీ పథకానికి భారీగా కోతలు విధించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ఏడాది ఏప్రిల్ 1వతేదీ నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రాలవారీగా కేటాయించే లేబర్ బడ్జెట్‌కు భారీ కోతలు పెట్టింది. ఇక రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్రానికి 23.68 కోట్ల పనిదినాల పాటు పనులు కల్పించగా 2022–23లో ప్రాథమికంగా కేవలం 14 కోట్ల పనిదినాలనే కేటాయిస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంగళవారం నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 14.27 కోట్ల పనిదినాలు కల్పించగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రాథమికంగా 10 కోట్ల పనిదినాలే కేటాయించారు. తెలుగు రాష్ట్రాల తరహాలోనే మిగిలిన రాష్ట్రాలకూ లేబర్ బడ్జెట్ కేటాయింపుల్లో భారీగా కోతలు విధించినట్లు గ్రామీణాభివృద్ధి శాఖ వర్గాలు పేర్కొన్నాయి.
రాష్ట్రం కోరిన దాంట్లో సగమే..
రాష్ట్రంలో వచ్చే ఆర్థిక ఏడాదికి సంబంధించి 30 కోట్ల పనిదినాల పాటు పేదలకు పనులు కల్పించేందుకు జిల్లాలవారీగా లేబర్ బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించి కేంద్రానికి పంపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 15 తేదీన జరిగిన వార్షిక కార్యాచరణ ప్రణాళిక సమీక్షలో కనీసం 26 కోట్ల పనిదినాలను రాష్ట్రానికి కేటాయించాలని అధికారులు కోరారు. తెలంగాణ కూడా తమకు 15 కోట్ల పనిదినాలు కేటాయించాలని కేంద్రాన్ని కోరింది. అయితే రాష్ట్రాలు కోరిన దాంట్లో దాదాపు సగం రోజులు కోతలు విధించి కేంద్రం లేబర్ బడ్జెట్ కేటాయింపులు చేయడంపై అధికారులు విస్తుపోతున్నారు.
జూన్‌లో మళ్లీ సమీక్ష...
లేబర్ బడ్జెట్‌లో భారీగా కోతలు విధించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అవసరమైతే జూన్ చివరిలో మరోసారి రాష్ట్రాలవారీగా సమావేశాలు నిర్వహించి అదనపు కేటాయింపులపై నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్రానికి మొదట 20 కోట్ల పనిదినాలు కేటాయించి తర్వాత 23.50 కోట్లకు పెంచారు. తెలంగాణ రాష్ట్రానికి కూడా తొలుత 13 కోట్ల పనిదినాలు కేటాయించి తర్వాత 14.25 కోట్లకు పెంచారు. ఈ లెక్కన 20 – 25 శాతానికి మించి లేబర్ బడ్జెట్‌లో అదనపు కేటాయింపులు ఉండవని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలా చూసినా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే కేటాయింపులు తగ్గుతున్నట్లు పరిశీలకులు పేర్కొంటున్నారు. ఏడాది చివరకు అదనపు నిధుల కేటాయింపు అవసరం లేకుండా కేంద్రం ముందస్తుగా రాష్ట్రాలకు లేబర్ బడ్జెట్‌లో కోతలు విధిస్తూ వస్తోందని భావిస్తున్నారు.
రాష్ట్రంలో కోటి మంది పేదలపై ప్రభావం..
రాష్ట్రంలో 97.76 లక్షల కుటుంబాలకు చెందిన 1.95 కోట్ల మంది ఉపాధి కూలీలు పథకంలో పేర్లు నమోదు చేసుకున్నారు. అందులో 57.49 లక్షల కుటుంబాలకు చెందిన 99.48 లక్షల మంది యాక్టివ్ కూలీలు.గత మూడేళ్లలో కనీసం ఒక్క రోజైనా ఉపాధి పనులకు హాజరైతే యాక్టివ్ కూలీలుగా పరిగణిస్తారు. 2020–21లో రాష్ట్రంలో 47.71 లక్షల కుటుంబాలకు చెందిన 80 లక్షల మంది ఉపాధిహామీ ద్వారా ప్రయోజనం పొందగా 2021–22లో 46.60 లక్షల కుటుంబాలకు చెందిన 77 లక్షల మందికి లబ్ధి చేకూరింది. ఉపాధి పథకానికి బడ్జెట్‌లో కోతలతో దాదాపు కోటి మంది కూలీలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
ఉపాధిలో కేంద్రం భారీ కోత
Published Wed, Mar 30 2022 4:29 AM | Last Updated on Wed, Mar 30 2022 4:29 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment