సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకంలో కేంద్రం కొత్త నిబంధన తెచ్చింది. కొత్త పనులకు అనుమతిని క్లిష్టతరం చేసింది. ఈ పథకం ద్వారా ఒక్కో పంచాయతీలో ఒకే సమయంలో 20 పనులకు మాత్రమే వీలు కల్పిస్తూ నిబంధన విధించింది. వాటిలో మాత్రమే కూలీలు, ఇతర కార్యకలాపాలకు, బిల్లులు పెట్టడానికి వీలుంటుంది. ఈ 20 పనుల్లో ఒకటి పూర్తయిన తర్వాతే మరో కొత్త పని మంజూరవుతుంది. ఈ ఏడాది ఆగస్టు 1నుంచి కొత్త నిబంధన అమల్లోకి వస్తుంది. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ ధర్మవీర్ ఝా రెండు రోజుల క్రితం అన్ని రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శులకు లేఖ రాశారు.
దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పనుల నిర్వహణ, పర్యవేక్షణ మొత్తం ఎన్‌ఆర్‌ఈజీఏ సాఫ్ట్ (నరేగా సాఫ్ట్) ద్వారా ఆన్‌లైన్‌లో జరుగుతుంది. గ్రామాల్లో పనులు జరిగిన తర్వాత కూలీల వేతనాలు సహా అన్నిరకాల బిల్లులను సిబ్బంది ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. వీటి ప్రకారం కేంద్రం కూలీలకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో వేతనాల డబ్బు జమ చేస్తుంది. నూతన నిబంధన ప్రకారం ఆన్‌లైన్‌లో ఆ 20 పనులకు మాత్రమే బిల్లుల నమోదుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లోని మొత్తం 2.69 లక్షల గ్రామ పంచాయతీల పరిధిలో 1.64 కోట్ల ఉపాధి హామీ పనులు మంజూరయ్యాయి. వాటిలో 1.44 కోట్ల పనులు పురోగతిలో ఉన్నాయి. అంటే ఒక్కో గ్రామ పంచాయతీలో సరాసరిన 53 పనులు జరుగుతున్నాయి.
మన రాష్ట్రంలోనూ 13,113 గ్రామ పంచాయతీల్లో 9.73 లక్షల పనులు మంజూరవగా, వాటిలో 9.67 లక్షల పనులు పురోగతిలో ఉన్నాయి. అంటే రాష్ట్రంలోనూ ఒక్కో గ్రామ పంచాయతీలో సరాసరిన 73 పనులు జరుగుతున్నాయి. నూతన నిబంధన ప్రకారం ఈ పనులను 20కి పరిమితం చేయడం చాలా కష్టమని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే మంజూరైన పనులకు కొత్త నిబంధన వర్తించకపోవచ్చని భావిస్తున్నారు. రానున్న రోజుల్లో కొత్త పని మంజూరులో ఈ నిబంధన తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు.
పనులు సకాలంలో పూర్తి చేయడానికే
ఉపాధి పథకం పనులు గడువులోగా పూర్తి చేయడంపై కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టింది. ఇందుకోసం క్షేత్రస్థాయిలో ఒత్తిడి తెచ్చేందుకే ఈ నిబంధన తెచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. రెండు మూడేళ్లు కొనసాగే మొక్కల పెంపకం, గృహ నిర్మాణ పథకం వంటి పనులకు కొత్త నిబంధన వర్తించదని కేంద్రం పేర్కొందని వివరించారు. తప్పనిసరి, ప్రత్యేక పరిస్థితుల్లో గ్రామాల్లో స్థానిక ఎంపీడీవో సవివరమైన వివరణ, జిల్లా కలెక్టర్ అనుమతితో 20 పరిమితికి మించి పనులు మంజూరుకు అవకాశం కల్పించిందని తెలిపారు.
‘ఉపాధి’కి పరిమితి
Published Sun, Jul 24 2022 4:37 AM | Last Updated on Sun, Jul 24 2022 7:32 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment