పూర్తి స్థాయిలో చెల్లింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బాబు సర్కారు
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు చేపట్టిన పనులకు సంబంధించి వందల కోట్ల రూపాయల బిల్లులు చెల్లించేందుకు బుధవారం మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గత టీడీపీ ప్రభుత్వంలో నిబంధనలను పక్కన పెట్టి, ఇష్టారాజ్యంగా చేసిన ఈ పనుల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయి.
గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయా పనులపై విజిలెన్స్ విచారణ జరిపించింది. అనంతరం విజిలెన్స్ సిఫార్సులకు అనుగుణంగా ఒక్కో పనికి చెల్లించాల్సిన మొత్తంలో 6.33 శాతం నుంచి 21.2 శాతం చొప్పున కోత పెట్టి బిల్లులు చెల్లించింది. ప్రస్తుతం ఆ పనుల్లో చాలా వరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆన్‌లైన్ రికార్డుల ప్రకారం మూసివేశారు. అంటే ఆయా పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపు సహా అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయని అధికారులు నిర్ధారించారు.
నిబంధనల ప్రకారం ఒకసారి క్లోజ్డ్ జాబితాలో చేర్చిన పనులకు ఎలాంటి బిల్లుల చెల్లింపులకు తావు ఉండదు. కానీ, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం అప్పట్లో మూసి వేసిన పనులు ఇంకా పురోగతిలో ఉన్నట్టు పేర్కొంటున్న పనులను కలిపి.. అప్పట్లో కోత పెట్టిన బిల్లులు కూడా చెల్లించేందుకు సిద్ధమైంది. మొత్తంగా రూ.331 కోట్లు చెల్లించనుంది.
అవకతవకలు ఇలా..
⇒ 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నిధులు అందుబాటులో లేకపోయినా టీడీపీ కార్యకర్తలకు నామినేషన్ పద్దతిన పనులు కల్పించింది. రూ.1,795.31 కోట్ల విలువ చేసే సిమెంట్ రోడ్ల నిర్మాణం జరిగినట్టు అంచనా.
⇒ 2020–21లో కరోనా సమయంలో విజిలెన్స్ తనిఖీలు నిర్వహించారు. 11,573 సిమెంట్ రోడ్డు పనులపై మాత్రమే తనిఖీలు చేయగలిగారు. వాటిలోనే 7,326 పనుల్లో అక్రమాలు జరిగినట్టు నిర్ధారణ అయింది. 1,644 పనులు నాసి రకమైనవిగా గుర్తించారు.
⇒ నూజెండ్ల మండలంలోని వివిధ గ్రామాల్లో రూ.25.62 కోట్లతో 253 సిమెంట్ రోడ్ల నిర్మాణం జరిగితే, అందులో 213 రోడ్లను పరిశీలించి.. 196 రోడ్లు నాసిరకమైనవి తేల్చారు. అన్ని పనులపై విజిలెన్స్ విచారణ సాధ్యం కాని పరిస్థితుల్లో పనులు చేసిన వారు బిల్లుల చెల్లింపుల కోసం హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా అప్పటి ప్రభుత్వం బిల్లుల చెల్లింపుల ప్రక్రియను చేపట్టింది.
⇒ మొత్తం 4.41 లక్షల ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించి రూ.331 కోట్ల మొత్తం చెల్లింపులు జరపాలని బుధవారం నాటి మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పనులన్నీ క్లోజ్ అయినట్లు కేంద్రం స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ఆ పనులన్నింటినీ తిరిగి తెరిచి.. బిల్లుల చెల్లింపులకు అనుమతి ఇవ్వాలని రాష్ట్రం కోరనున్నట్లు అధికార వర్గాల సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment