వర్చువల్ సమీక్షలో పాల్గొన్న అధికారులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం అమలు తీరును కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్–జూన్ నెలల మధ్య దేశవ్యాప్తంగా పథకం అమలు తీరుపై కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ నాగేంద్రనాథ్ సిన్హా బుధవారం అన్ని రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో వర్చువల్ విధానంలో సమీక్ష నిర్వహించారు. విజయవాడ నుంచి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్, ఉపాధి హామీ పథకం డైరెక్టర్ చినతాతయ్య తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
ఉపాధి హామీ పథకం అమలులో నాలుగు సూచీలలో దేశంలో మన రాష్ట్రమే మొదటి స్థానంలో నిలవగా.. మిగిలిన ఇతర సూచీలలోనూ రాష్ట్రం మొదటి ఐదు స్థానాల్లో నిలిచింది. దీంతో కేంద్ర కార్యదర్శి నాగేంద్రనాథ్ సిన్హా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. మూడు నెలల్లో దేశంలోనే అత్యధికంగా 17.29 కోట్ల పని దినాల పాటు పేదలకు పనులు కల్పించడం.. పనులు పారదర్శకంగా జరిగాయా లేదా అన్న దానిపై సోషల్ ఆడిట్ నిర్వహించడంలో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రం ఎంతో ముందు ఉందని అధికారులు వెల్లడించారు. పని చేపట్టే ప్రాంతాలను అన్‌లైన్ జియో ట్యాగింగ్‌లో గుర్తించే జీఐఎస్ ప్రణాళికల రూపకల్పనలోను, సీఎఫ్‌పీ సూచీలోను రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. చేపట్టిన పనులలో 96 శాతం పూర్తి చేస్తుండటంపై కేంద్ర కార్యదర్శి రాష్ట్రాన్ని అభినందించారు.
‘వ్యవసాయ’ పనులే 70 శాతం
రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల్లోనే 70 శాతం పనులు చేపడుతుండటంపై కేంద్రం అభినందించింది. పథకం అమలుకు దేశం మొత్తం మీద ఖర్చు చేస్తున్న వ్యయంలో 60 శాతం ఈ రంగంలో పనులు వెచ్చిస్తుండగా.. రాష్ట్రంలో 70 శాతం ఖర్చు పెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment