కృష్ణాజిల్లా విజయవాడ రూరల్ కుందావారికండ్రిక మార్గంలో ఓ చెరువులో శుక్రవారం ఉపాధి హామీ పనులు జరుగుతున్న దృశ్యం
గ్రామాల్లో ఎక్కడా మంచి నీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి. రానున్న 45 రోజుల పాటు ఎక్కడ నీటి ఎద్దడి గుర్తించినా,ఆ ప్రాంతానికి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలి. అవసరమైన చోట పశువులకు అవసరమయ్యే తాగునీటిని కూడా ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేందుకు వెనుకాడొద్దు.
సాక్షి, అమరావతి: ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో గ్రామీణ పేద కూలీలకు ఉపాధి హామీ పథకం ద్వారా వీలైనన్ని ఎక్కువ పని దినాలు కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో పలు కార్యక్రమాల అమలు తీరుపై శుక్రవారం ఆయన సమీక్షించారు. కరోనా కారణంగా గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనులు కొంత మందగించాయని, ఇప్పుడిప్పుడే పనులు వేగం పుంజుకుంటున్నాయని అధికారులు వివరించారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. వర్షాలు వచ్చే లోపు వీలైనన్ని పని దినాలు కల్పించాలని సూచించారు. పని కోసం వచ్చే కూలీలకు కరోనా వైరస్ సోకకుండా క్షేత్ర స్థాయిలో తగిన జాగ్రత్తలు కచ్చితంగా పాటించేలా చూడాలని ఆదేశించారు.
వివిధ పనుల పూర్తికి నిర్దిష్ట గడువు
► గ్రామాల్లో చేపట్టే సచివాలయ భవనాల నిర్మాణం, విలేజ్ క్లినిక్స్, రైతు భరోసా కేంద్రాల భవనాలతో పాటు పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిపై సమావేశంలో అధికారులు సీఎం జగన్‌కు వివరించారు.
► అత్యంత ప్రాధాన్యతగా గుర్తించిన నిర్మాణ పనులను నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో నాడు–నేడు కార్యక్రమాలు జూలై 31, గ్రామ సచివాలయాల నిర్మాణం ఆగస్టు 31, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాల నిర్మాణాలను వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేయడానికి ప్రణాళికా బద్ధంగా పని చేస్తున్నట్టు అధికారులు వివరించారు.
► గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి పరీక్షల నిర్వహణ గురించి సమావేశంలో చర్చకు వచ్చింది. కరోనా పరిస్థితులు మెరుగు పడగానే పరీక్షల నిర్వహణకు తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు సీఎంకు వివరించారు.
► ట్యాంకర్ల ద్వారా సరఫరాకు వీలుగా ముందుగానే ప్రైవే ట్ నీటి వనరులను గుర్తించి అధికారులందరూ సిద్ధంగా ఉండాలని సీఎం సూచించారు. ప్రస్తుతం 2,847 గ్రామీణ నివాసిత ప్రాంతాలకు 14,113 ట్రిప్పులు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసినట్టు అధికారులు వివరించారు.
► ఈ సమీక్షలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment