సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకం కింద ఈ ఏడాది 24 కోట్ల పనిదినాలు కల్పించాలని, పనులపై కలెక్టర్లు పర్యవేక్షణ చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. పేదల గృహ నిర్మాణాలకు సంబంధించి ఇప్పటివరకూ సుమారు 3.9 లక్షల ఇళ్లు పూర్తి కాగా రూఫ్ లెవల్, ఆపై దశల్లో ఉన్న 5.27 లక్షల నివాసాలను కూడా త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్లకు సూచించారు.
సీఆర్‌డీఏ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు చేసి జూలై 8 నుంచి పనులు ప్రారంభించాలని నిర్దేశించారు. ఖరీఫ్ పనులు ప్రారంభమైనందున విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కొరత తలెత్తకుండా చూడాలన్నారు. ఎక్కడైనా కల్తీలు కనిపిస్తే సంబంధిత కలెక్టర్లు, ఎస్పీలను బాధ్యులుగా చేస్తామని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు.
అక్రమాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. రెండో దశ సమగ్ర భూ సర్వేలో భాగంగా మరో 2 వేల గ్రామాల్లో సెప్టెంబర్ 30 నాటికి భూపత్రాలు అందించాలని, అక్టోబరు 15 నుంచి అక్కడ రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు కూడా ప్రారంభం కావాలని నిర్దేశించారు.
స్పందనలో భాగంగా సీఎం జగన్ బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపాధి పనులు, గృహ నిర్మాణం, వ్యవసాయం, సాగునీటి విడుదల, జగనన్న భూహక్కు–భూరక్ష, విద్యా కానుక కిట్ల పంపిణీపై అధికార యంత్రాంగానికి సీఎం మార్గ నిర్దేశం చేశారు.
ప్రతి జిల్లాలో రోజూ 75 వేల పనిదినాలు
ఉపాధిహామీ పనులపై కలెక్టర్ల పర్యవేక్షణ అవసరం. ఈ ఏడాదిలో 24 కోట్ల పనిదినాలు కల్పించాలి. అందులో 60 శాతం అంటే 14.4 కోట్ల పనిదినాలు ఈ నెలాఖరులోగా పూర్తికావాలి. ప్రతి రోజూ ప్రతి జిల్లాలో కనీసం 75 వేల పనిదినాలు కల్పించాలి. అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలం. పనిచేస్తున్న ప్రాంతాల్లో షెడ్లు, తాగునీరు, ఫస్ట్‌ఎయిడ్ కిట్లు సమకూర్చాలి. ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ ఎలాంటి పనులు చేపట్టవద్దు. ఈ విషయాలన్ని తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోవాలి. రోజుకు కనీసం రూ.272 వేతనం వచ్చేలా చూడాలి.
డిసెంబర్‌కు డిజిటల్ లైబ్రరీలు..
ఉపాధిహామీకి సంబంధించిన బిల్లులన్నీ పూర్తిగా చెల్లించాలి. సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్, డిజిటల్ గ్రంథాలయాలను వేగంగా పూర్తి చేయాలి. ప్రతి గ్రామానికీ ఇంటర్నెట్, డిజిటల్ లైబ్రరీలు వస్తున్నాయి. వర్క్ ఫ్రం హోం కోసం అవి చాలా ఉపయోగపడతాయి. గ్రామంలో చదువుకున్న ఏ వ్యక్తి అయినా అక్కడకు వెళ్లి కంప్యూటర్‌లో పని చేసుకోవచ్చు. మంచి బ్యాండ్‌విడ్త్ అందించడం చాలా ముఖ్యం. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్స్ అన్నీ సెప్టెంబరు కల్లా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి. డిజిటల్ లైబ్రరీలు డిసెంబర్ చివరికల్లా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలి.
ఇళ్ల నిర్మాణాలకు రూ.1,475 కోట్లు
రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఇళ్లు కడుతున్నాం. వీటిని కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. వివిధ దశల్లో ఉన్న ఇళ్ల వేగం పెరగాలి. ఎప్పటికప్పుడు చెల్లింపులు చేస్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయిన తర్వాత సుమారు రూ.1,475 కోట్లు ఇచ్చాం. ప్రతి శనివారం హౌసింగ్‌డేగా నిర్వహించాలి. అధికారులు తప్పనిసరిగా లే అవుట్లలో పర్యటించాలి.
సీఆర్‌డీఏలో 8 నుంచి పనులు
సీఆర్‌డీఏ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు చేసి జూలై 8 నుంచి పనులు ప్రారంభించాలి. ఆప్షన్–3 ఎంపిక చేసుకున్న వారి ఇళ్ల నిర్మాణం వెంటనే మొదలు కావాలి. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కలెక్టర్లు ఈమేరకు చర్యలు తీసుకోవాలి. జగనన్న కాలనీల్లో విద్యుత్, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలను కల్పించాలి. ఇళ్ల నిర్మాణాల్లో వాడే సామగ్రి నాణ్యతతో ఉండాలి. క్రమం తప్పకుండా క్వాలిటీ పరీక్షలు చేయాలి.
వేగంగా టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ
టిడ్కో ఇళ్లలో 300 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న 1,43,600 ఇళ్లను ఉచితంగా పేదలకు ఇస్తున్నాం. ఇప్పటికే 61 వేల ఇళ్లను అందించాం. మరో 89,216 ఇళ్లను ఆగస్టులోగా అందచేస్తాం. రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలి. మిగిలిన కేటగిరీ ఇళ్లకు ప్రభుత్వం ఇన్సెంటివ్ ఇచ్చింది. ఆ కేటగిరీ లబ్ధిదారులకు బ్యాంకులతో అనుసంధానించాలి. ఇప్పటికే రూ.1,962.15 కోట్లు బ్యాంకుల ద్వారా అందించాం. మిగిలిన వారికి కూడా రుణాలు టైఅప్ చేసేలా చర్యలు తీసుకోవాలి.
విత్తనాలు, ఎరువులు, మందులకు కొరత రాకూడదు
ఖరీఫ్ పనులు ప్రారంభం అయ్యాయి. 9 జిల్లాల పరిధిలోని 19 మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిధిలో నీటి విడుదల ప్రారంభమైంది. మిగిలిన 29 మేజర్ ప్రాజెక్టుల పరిధిలో జూన్ 15 నుంచి జూలై 20 వరకు నీటి విడుదల షెడ్యూల్ ఖరారైంది. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కొరత రాకుండా చూడాలి. నాణ్యత చాలా ముఖ్యం. నకిలీల కారణంగా రైతులు ఎక్కడా నష్టపోయిన సందర్భాలు కనిపించకూడదు. క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలి. ఆర్బీకేల ద్వారా నాణ్యమైన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు అందించేలా చర్యలు తీసుకోవాలి.
1 నుంచి ఈ–క్రాప్ బుకింగ్
ఖరీఫ్ 2023 సంబంధించి జూలై 1 నుంచి ఈ–క్రాప్ బుకింగ్ ప్రారంభించాలి. సెప్టెంబరు మొదటి వారంలోగా పూర్తి చేయాలి. సోషల్ ఆడిట్ చేపట్టి సెప్టెంబరు నెలాఖరులోగా తుది జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలి. సీసీఆర్సీ కార్డులపై అవగాహన కల్పించి కౌలు రైతులకు మేలు చేసేలా చర్యలు తీసుకోవాలి.
సీసీఆర్సీ కార్డులు కేవలం 11 నెలల పాటు మాత్రమే చెల్లుబాటు అవుతాయని, భూ యజమానుల హక్కులకు ఎలాంటి భంగం కలగదనే విషయాన్ని వివరించాలి. కౌలు రైతులకు రుణాలు అందేలా జిల్లా బ్యాంకర్ల కమిటీ సమావేశాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆర్బీకేల స్థాయిలో గ్రామ సభలు నిర్వహించాలి.
రైతులు అక్కడకు వెళ్లాల్సిన అవసరం రాకూడదు
17 వేల రెవెన్యూ గ్రామాలకుగాను మొదటి ఫేజ్‌లో 2 వేల గ్రామాల్లో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల ఏర్పాటు సహా జగనన్న భూహక్కు, భూరక్ష కార్యక్రమం పూర్తైంది. 7.86 లక్షల భూహక్కు పత్రాలు పంపిణీ చేశాం. 25.7 లక్షల సరిహద్దు రాళ్లు పాతాం. సచివాలయాల స్థాయిలోనే రిజిస్ట్రేషన్లు సహా అన్నిరకాల సేవలు వీరికి అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. ఆయా గ్రామ సచివాలయాల్లో కనీసం ఒక్క రిజిస్ట్రేషన్ పూర్తి చేయడం ద్వారా ఏవైనా సమస్యలుంటే సరిదిద్దే అవకాశం ఉంటుంది. జూలై 1 నాటికి ఇది పూర్తి కావాలి.
ఆ గ్రామాల నుంచి రైతులు ఎవరూ తహశీల్దార్, రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం రాకూడదు. ప్రతి పని గ్రామ సచివాలయాల స్థాయిలోనే జరగాలి. సబ్‌డివిజన్, మ్యుటేషన్, ల్యాండ్ కన్వర్షన్ తదితరాలన్నీ గ్రామ సచివాలయాల్లోనే జరగాలి. రెండో దశ కింద మరో 2 వేల గ్రామాల్లో తుది ఆర్వోఆర్ ఆగస్టు 31 కల్లా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి. సెప్టెంబర్ 30 కల్లా రాళ్లు పాతడం పూర్తి చేసి భూ పత్రాలు అందించాలి. అక్టోబరు 15 నుంచి అక్కడ రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు ప్రారంభం కావాలి.
విద్యాకానుక కిట్ల పంపిణీని కలెక్టర్లు సమీక్షించాలి
జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీపై కలెక్టర్లు సమీక్ష చేయాలి. ఎక్కడైనా సరిపడా లేకున్నా, ఇచ్చిన వస్తువులు బాగా లేకున్నా వెంటనే సమాచారం తెప్పించుకోవాలి. హెచ్‌ఎంల నుంచి సమాచారాన్ని సేకరించి వెంటనే చర్యలు చేపట్టాలి. నాణ్యత విషయంలో ఎక్కడా సమస్య ఉన్నా వెంటనే చర్యలు తీసుకోవాలి.
నాడు– నేడు తొలిదశ పనులు పూర్తైన 15,750 పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి 30,249 తరగతి గదుల్లో జూలై 12 కల్లా ఐఎఫ్‌పీ ప్యానెళ్లు ఏర్పాటు కావాలి. వాటిని చక్కగా వినియోగించుకోవడంపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి. మానిటర్లను వినియోగించుకుంటూ పిల్లలకు చక్కటి బోధన అందించాలి. ఆమేరకు టీచర్ల సామర్థ్యాన్ని పెంచాలి.
Spandana Review Meeting: ఉధృతంగా ‘ఉపాధి’
Published Thu, Jun 15 2023 6:24 AM | Last Updated on Thu, Jun 15 2023 9:48 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment