Water shortages prevention
-
కూలీలకు ఎక్కువ ‘ఉపాధి’
గ్రామాల్లో ఎక్కడా మంచి నీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి. రానున్న 45 రోజుల పాటు ఎక్కడ నీటి ఎద్దడి గుర్తించినా,ఆ ప్రాంతానికి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలి. అవసరమైన చోట పశువులకు అవసరమయ్యే తాగునీటిని కూడా ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేందుకు వెనుకాడొద్దు. సాక్షి, అమరావతి: ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో గ్రామీణ పేద కూలీలకు ఉపాధి హామీ పథకం ద్వారా వీలైనన్ని ఎక్కువ పని దినాలు కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో పలు కార్యక్రమాల అమలు తీరుపై శుక్రవారం ఆయన సమీక్షించారు. కరోనా కారణంగా గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనులు కొంత మందగించాయని, ఇప్పుడిప్పుడే పనులు వేగం పుంజుకుంటున్నాయని అధికారులు వివరించారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. వర్షాలు వచ్చే లోపు వీలైనన్ని పని దినాలు కల్పించాలని సూచించారు. పని కోసం వచ్చే కూలీలకు కరోనా వైరస్ సోకకుండా క్షేత్ర స్థాయిలో తగిన జాగ్రత్తలు కచ్చితంగా పాటించేలా చూడాలని ఆదేశించారు. వివిధ పనుల పూర్తికి నిర్దిష్ట గడువు ► గ్రామాల్లో చేపట్టే సచివాలయ భవనాల నిర్మాణం, విలేజ్ క్లినిక్స్, రైతు భరోసా కేంద్రాల భవనాలతో పాటు పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిపై సమావేశంలో అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. ► అత్యంత ప్రాధాన్యతగా గుర్తించిన నిర్మాణ పనులను నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో నాడు–నేడు కార్యక్రమాలు జూలై 31, గ్రామ సచివాలయాల నిర్మాణం ఆగస్టు 31, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాల నిర్మాణాలను వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేయడానికి ప్రణాళికా బద్ధంగా పని చేస్తున్నట్టు అధికారులు వివరించారు. ► గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి పరీక్షల నిర్వహణ గురించి సమావేశంలో చర్చకు వచ్చింది. కరోనా పరిస్థితులు మెరుగు పడగానే పరీక్షల నిర్వహణకు తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు సీఎంకు వివరించారు. ► ట్యాంకర్ల ద్వారా సరఫరాకు వీలుగా ముందుగానే ప్రైవే ట్ నీటి వనరులను గుర్తించి అధికారులందరూ సిద్ధంగా ఉండాలని సీఎం సూచించారు. ప్రస్తుతం 2,847 గ్రామీణ నివాసిత ప్రాంతాలకు 14,113 ట్రిప్పులు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసినట్టు అధికారులు వివరించారు. ► ఈ సమీక్షలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
కందకాల వల్లే పుష్కలంగా నీరు
మెదక్ జిల్లా శివంపేట్ మండలం రత్నాపూర్‌కు చెందిన పట్నూరి నింబాద్రిరావు గత వేసవిలో తన 9 ఎకరాల పొలంలో మామిడి, జామ, టేకు మొక్కలు నాటడానికి ముందు బోరు వేయించారు. నీరు పడింది. కానీ, నీరు చాలా తక్కువగా పోస్తోంది. భవిష్యత్తులో నీటి ఎద్దడి వస్తుందని భయపడిన దశలో ‘సాక్షి’ ద్వారా కందకాల ద్వారా నీటి భద్రత సాధించవచ్చని నింబాద్రిరావు తెలుసుకున్నారు. తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సంగెం చంద్రమౌళి(98495 66009), మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి (99638 19074)లను సంప్రదించి.. వారి సలహా మేరకు కందకాలు తవ్వించారు. మీటరు లోతు, మీటరు వెడల్పున వాలుకు అడ్డంగా గత మేలో కందకాలు తవ్వించారు. కందకాలు తవ్విన వారంలోనే తొలి వర్షం పడి, కందకాలు నిండాయి. ఆ తర్వాత వర్షాలకు కందకాలు ఐదారు సార్లు నిండాయి. రెండు వర్షాల తర్వాత బోరు 70 అడుగుల్లోనే నీరు అందుబాటులోకి వచ్చేంతగా భూగర్భ జలాలు పెరిగాయి. బోరు ఒకటిన్నర ఇంచుల నీరు పోస్తోంది. ఇటీవల కాలంలో మా ప్రాంతంలో భూగర్భ జల మట్టం బాగా తగ్గిపోయింది. కొందరి బోర్లు నీటి కొరత వల్ల ఆగి ఆగి పోస్తున్నాయి. కానీ, మా బోరు నిరంతరాయంగా ఇంచున్నర నీరు పోస్తోంది. ఇదంతా కందకాల వల్ల భూమిలోకి వర్షం నీరు ఇంకడమే కారణమని తాను భావిస్తున్నానని నింబాద్రిరావు (95150 21387) తెలిపారు. -
తాగునీటి ఎద్దడిపై దృష్టి పెట్టండి
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నివారణపై జిల్లా కలెక్టర్లు దృష్టిసారించాలని మంత్రి కె.తారక రామారావు ఆదేశించారు. గ్రామీణ తాగునీటి సరఫరాపై జిల్లా అధికార యంత్రాంగం మరింత క్రియాశీలంగా పనిచేయాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో కొత్త బోరుబావులపై ఎక్కువ ఖర్చు చేయకుండా పాత బోరుబావులను మరింత లోతుగా తవ్వాలని ఆదేశించారు. పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల పనితీరుపై గురువారం ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో వీధి దీపాలకు విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేక తీగ (మూడో తీగ)ను ఏర్పాటు చేయాలని సూచించారు. 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి విద్యుత్ బిల్లులు చెల్లించాలని కలెక్టర్లను ఆదేశించారు. గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం గ్రామ పంచాయతీల్లో ఆస్తి పన్నుల వసూళ్లు పెరగాలని... స్వచ్ఛందంగా పన్నులు చెల్లించే విధంగా ప్రజలను చైతన్యవంతులు చేయాలని పేర్కొన్నారు. 100 రోజుల ప్రణాళికను విజయవంతం చేయండి పురపాలక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన 100 రోజుల ప్రణాళికలను విజయవంతం చేయాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. నిర్దేశించిన గడువులోగా 21 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలను బహిరంగ మలమూత్ర విసర్జన రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు 11 వేల మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు. జూన్ 2 నాటికి ఈ లక్ష్యాన్ని అందుకోవాలని భావించినప్పటికీ ఏప్రిల్ నాటికి పూర్తిచేస్తే స్వచ్ఛ భారత్ అభియాన్ కింద కేంద్రం నుంచి మున్సిపాలిటీలకు మరిన్ని ప్రోత్సాహక నిధులు అందుతాయన్నారు. ప్రతి ఇంటికి రెండు 9 వాట్ల బల్బుల చొప్పున ఎంపిక చేసిన 25 పురపాలికల్లో మొత్తం 2.7 లక్షల బల్బులను పంపిణీ చేస్తామన్నారు. ఇక ఘన వ్యర్థాల నిర్వహణ కోసం కేంద్రం పురపాలికలకు నిధులు విడుదల చేస్తున్న నేపథ్యంలో... ప్రతి మున్సిపాలిటీ, నగర పంచాయతీలో డంప్ యార్డుల ఏర్పాటు కోసం 5 నుంచి 7 ఎకరాల స్థలాన్ని సేకరించి మున్సిపల్ శాఖకు అప్పగించాలని మంత్రి ఆదేశించారు.