Andhra Pradesh: గ్రామీణ 'ఉపాధి' పుష్కలం | AP Govt strengthening measures for poor people about their livelihood | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: గ్రామీణ 'ఉపాధి' పుష్కలం

Published Sun, May 16 2021 2:31 AM | Last Updated on Sun, May 16 2021 12:50 PM

AP Govt strengthening measures for poor people about their livelihood during corona - Sakshi

సాక్షి, అమరావతి:  రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటూనే, ఈ విపత్తు సమయంలో జీవనోపాధి కోల్పోయి పేదలెవరూ ఇబ్బంది పడకుండా అన్ని విధాలా ఆదుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో అనేక భయాందోళనల మధ్య స్థానికంగా పేదలెవరూ పనులు లేక పస్తులు ఉండే పరిస్థితి రాకుండా ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా పెద్ద ఎత్తున పనులు కల్పిస్తోంది.

ఏప్రిల్‌ ఒకటవ తేదీ నుంచి ఇప్పటి వరకు.. 45 రోజుల వ్యవధిలో దేశ వ్యాప్తంగా ప్రజలందరూ కరోనా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. మన రాష్ట్రంలో అలాంటి ఇబ్బందుల మధ్య కూడా గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద కూలీలకు రూ.1,216.58 కోట్ల మేర పనులు కల్పించింది. పని చేసిన వారం రోజుల వ్యవధిలో క్రమం తప్పుకుండా కూలీ డబ్బులు చెల్లించింది. రాష్ట్ర వ్యాప్తంగా 31,35,231 కుటుంబాలు ఈ పథకం కింద పని చేసి.. ఈ 45 రోజుల వ్యవధిలో ప్రతి కుటుంబం సరాసరి రూ.3,880 చొప్పున ఉపాధి సొమ్ము పొందారు. ఒక వ్యక్తి ఒక రోజు పని చేస్తే రూ.220 చొప్పున వేతనం ఇస్తున్నారు.  
(చదవండి: ప్రాణ వాయువుకు ఫుల్‌‘పవర్‌’)

సీఎం, మంత్రి ప్రతి వారం సమీక్ష  
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, పంచాయతీ రాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతి వారం జిల్లా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ గ్రామాల్లో పని అడిగిన ప్రతి ఒక్కరికీ లేదనకుండా పనులు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితులలో పేదలకు పనుల కల్పనలో జిల్లా, మండల స్థాయిలో అధికారులెవరూ నిర్లక్ష్యం వహించకుండా లక్ష్యాలను నిర్దేశించారు.

ఎండల కారణంగా పనులు చేయడానికి ఇబ్బంది పడకుండా ఉదయం 11 గంటల లోపు, సాయంత్రం 3 గంటల తర్వాతనే పనులు కల్పిస్తున్నారు. సొంత ఊరిలో ఉపాధి పనుల కోసం ఇంటి నుంచి ఎక్కువ దూరం వెళ్లే అవసరం లేకుండా వీలైనంత వరకు ఇంటికి సమీపంలో పనులు కల్పించాలని సీఎం జగన్‌ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు చేశారు. పని సమయంలో కూలీలు ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవడానికి ప్రభుత్వం సబ్బులు అందజేయడంతో పాటు పని జరిగే అన్ని చోట్ల మెడికల్‌ కిట్లను అందుబాటులో ఉంచింది. 

 
అత్యధికులు ఎస్సీ, ఎస్టీ, బీసీలే.. 
ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న వారిలో 85 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారేనని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో రెండో విడత కరోనా తీవ్రత పెరిగిన తర్వాత ప్రభుత్వం 5.55 కోట్ల పని దినాలతో ఉపాధి పథకం కింద పేదలకు పనులు కల్పిస్తే.. అందులో 52 శాతం మేర బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారికి 2.89 కోట్ల పని దినాలు దక్కాయి. దాదాపు రూ.635 కోట్ల మేర లబ్ధి పొందారు. ఎస్సీలు 22.95 శాతం పనులు పొందగా, 10.17 శాతం మేర ఎస్టీలు ఉపాధి పొందారు. దాదాపు 15 శాతం ఇతర వర్గాల పేదలు కూడా ఉపాధి హామీ పనుల ద్వారా లబ్ధిపొందారు. 
 
కొత్తగా ఎన్నికైన సర్పంచులకు చెక్‌ పవర్‌.. 
గ్రామ పంచాయతీల ఖాతాల్లో దాదాపు రూ.1,800 కోట్ల మేర 15వ ఆర్థిక సంఘం నిధులు అందుబాటులో ఉన్నట్టు పంచాయతీరాజ్‌ అధికారులు వెల్లడించారు. ఈ విపత్తులో గ్రామ పంచాయతీలలో అందుబాటులో ఉన్న డబ్బులను స్థానిక అవసరాలకు ఉపయోగించుకునేలా కొత్తగా ఎన్నికైన సర్పంచులకు ప్రభుత్వం తాజాగా చెక్‌ పవర్‌ సౌకర్యాన్ని కూడా యుద్ధ ప్రాతిపదికన బదలాయింపునకు చర్యలు చేపట్టింది.  
 
అవ్వాతాతలకు అండగా.. 

ఇంతటి విపత్తులో వృద్ధాప్యంలో ఉండే అవ్వాతాతలు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడే వారు సైతం ఎటువంటి ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా కొత్తగా అర్హత ఉన్న 59,062 మందికి ప్రభుత్వం మే నెల ఒకటవ తేదీన  పింఛన్లు పంపిణీ చేసింది. మే 1–3 తేదీల మధ్య ప్రభుత్వం 61.40 లక్షల మందికి రూ.1,480 కోట్ల మొత్తాన్ని పింఛన్ల రూపంలో పంపిణీ చేసింది.  
 
రైతు భరోసా కింద మూడో ఏడాదీ సాయం 
రైతులకు పంట పెట్టుబడి సాయంగా వరుసగా మూడో ఏడాది వైఎస్సార్‌ రైతు భరోసా కింద తొలి విడతగా 52.38 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.7,500 చొప్పున గురువారం సీఎం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి రూ.3,928 కోట్లు జమ చేశారు. కోవిడ్‌ సంక్షోభంలో ప్రభుత్వ కష్టం కంటే రైతుల కష్టమే ఎక్కువ అని భావించానని ఈ సందర్భంగా సీఎం అన్నారు. ఆదాయ వనరులు తగ్గినప్పటికీ రైతులకు ఇచ్చిన మాట మేరకు వరుసగా మూడో ఏడాది రైతు భరోసా కింద ఆయా రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేశామని చెప్పారు. 2019–20 నుంచి ఇప్పటి వరకు రైతు భరోసా కింద రూ.13,101 కోట్లు రైతుల ఖాతాల్లో వేశారు. తాజా మొత్తం కూడా కలుపుకుంటే ఒక్క రైతు భరోసా కింద రూ.17,029 కోట్లు ఇచ్చారు. 
(చదవండి: మిగులు జలాలపై ఇద్దరికీ హక్కు)

కరోనా కట్టడికీ పట్టిష్ట చర్యలు  
కరోనా కట్టడికీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో పట్టిష్ట చర్యలను అమలు చేస్తోంది. రాష్ట్రంలో 13,371 గ్రామ పంచాయతీలు ఉండగా, 9704 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌ల నేతృత్వంలో కరోనా కట్టడి కమిటీలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులను పూర్తి స్థాయిలో భాగస్వామ్యం చేసింది. శుక్రవారం 6,042 గ్రామాల్లో వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రభుత్వం సోడియం హైపో క్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారి చేసింది. 2,690 గ్రామాల్లో రాత్రి వేళ ఫాగింగ్‌ చేసింది. 7,355 గ్రామాల్లో ప్రధాన వీధులన్నింటిలో శుక్రవారం బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లారు. 

స్పష్టమైన లక్ష్యాలతో పనులు 
కరోనాకు తోడు వ్యవసాయ పనులన్నీ ముగిసిన ఈ సమయంలో గ్రామాల్లో పేదలకు పనులు దొరకని ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద ఎత్తున పనులు కల్పించేందుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జూన్‌ నెలాఖరు వరకు పెద్ద ఎత్తున పనులు కల్పించేందుకు జిల్లాల వారీగా స్పష్టమైన లక్ష్యాలను నిర్ధేశించాం. ఇప్పుడు కూడా ప్రతి రోజూ 30 లక్షల మంది ఉపాధి పథకంలో పనులకు హాజరవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 90 లక్షల కుటుంబాలు ఉంటే ఈ విపత్తులో మూడో వంతు కుటుంబాలకు గత 45 రోజులుగా పనులు కల్పిస్తున్నాం. పనికి వచ్చిన వారికి వెంటనే వారి బ్యాంకు ఖాతాలలో నేరుగా కూలి డబ్బులను జమ చేస్తున్నాం. 
– గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement