ఒక్క ఒక్కడు | Peddireddy Ramachandra Reddy won In Punganur | Sakshi
Sakshi News home page

ఒక్క ఒక్కడు

Published Thu, Jun 6 2024 9:17 AM | Last Updated on Thu, Jun 6 2024 9:28 AM

Peddireddy Ramachandra Reddy won In Punganur

ఉత్కంఠగా సాగిన ఫలితాల కౌంటింగ్‌  

ఓట్ల లెక్కింపు ఆఖరున కావాలనే నెపం  

ఎన్ని కుట్రలు చేసినా ఫలితం లేదని తెలిసి చేతులెత్తేసిన కూటమి 

వరుసగా ఆరోసారి ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి   

జిల్లా రాజకీయాలను శాసిస్తూ పెద్దాయనగా పేరొందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వరుసగా నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పటివరకు ఆయన మొత్తం ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ కంచుకోటగా పేరొందిన పుంగనూరు నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు విజేతగా నిలిచారు. అంతకుముందు రెండు సార్లు పీలేరు నుంచి గెలుపొందారు. తండ్రీ తనయులైన వైఎస్‌ రాజశేఖర రెడ్డి, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మంత్రి వర్గాల్లో పలు శాఖలకు ప్రాతినిధ్యం వహించారు. ఈ సారి టీడీపీ సునామీలోనూ తట్టుకుని జిల్లాలో విజయం సాధించిన ఏకైక ఎమ్మెల్యేగా పేరుపొందారు.

చిత్తూరు కలెక్టరేట్‌ : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ నెల 4వ తేదీన ఉత్కంఠగా సాగింది. మొదటి రౌండ్‌ నుంచి 19వ రౌండ్‌ వరకు గెలుపు ఎవరికీ తేలని పరిస్థితి నెలకొంది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మెజారిటీ పెరుగుతూ వచ్చేసరికి చివరి రెండు రౌండ్ల ఓట్ల లెక్కింపు గంటకు పైగా ఆపేశారు. ఓటమి ఖాయం అనుకున్న కూటమి అభ్యర్థి ఆర్‌ఓకు ఆధారం లేని ఫిర్యాదులు చేశారు. ఎలాగైనా రీ కౌంటింగ్‌ చేయించాలని పట్టుబట్టారు. అయితే సరైన ఆధారాలు లేకపోవడంతో రీ కౌంటింగ్‌ చేయడం కుదరదని అధికారులు తేలి్చచెప్పేశారు. దీంతో పుంగనూరు నియోజకవర్గం ఓట్ల లెక్కింపు ముగించి విజేతను ప్రకటించారు.  

సంజీవరెడ్డి పరిచయమే  
1977లో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలను గమనించిన రామచంద్రారెడ్డి ఒక సారి నీలం సంజీవరెడ్డిని కలుసుకున్నారు. ఆయన ప్రోత్సాహంతో 1978లో జనతా పార్టీ పీలేరు అభ్యరి్థగా పోటీ చేసి ఓటమిని చవిచూశారు. ఆ తరువాత కాంగ్రెస్‌ పారీ్టలో చేరిన పెద్దిరెడ్డి 1989లో మొదటి సారిగా పీలేరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 24,636 ఓట్ల మెజారిటీతో చల్లా రామచంద్రారెడ్డిపై విజయం సాధించారు. 1994లో పీలేరు అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందారు. మళ్లీ 1999, 2004 ఎన్నికల్లో పీలేరు ఎమ్మెల్యేగా వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు. ఆ తరువాత 2009, 2014, 2019లో పుంగనూరు ఎమ్మెల్యేగా వరుస విజయాలతో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. తాజా ఎన్నికల్లో 6095 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 

పెద్దాయనకు మంచిపేరే.. 
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బలమైన నాయకుడిగా ఎదిగిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక, ప్రజలతో మమేకం అవుతూ రాష్ట్రంలోనూ, ముఖ్యంగా రాయలసీమలో తిరుగులేని నాయకుడిగా పేరుతెచ్చుకున్నారు. ఎస్వీ యూనివర్సిటీ రాజకీయాల్లో చంద్రబాబుకు సమఉజ్జీగా నిలిచారు. నాటి నుంచి నేటి వరకు చంద్రబాబుతో తలపడుతూనే వస్తున్నారు. పల్లెలో ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే పెద్దాయన తలుపు తడితే చాలు కష్టం తీరిపోతుందని నమ్మేంతగా ప్రజాదరణను చూరగొన్నారు. అందుకే కూటమి నేతలంతా గెలుపొందినా పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బలం ముందు చంద్రబాబు ఎత్తులు, పైఎత్తులు చిత్తయ్యాయి.

పుంగనూరు నుంచి నాలుగోసారి 
రాజకీయాల్లో డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేక స్థానం ఉంది. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజానాయకుడిగా పేరు తెచ్చుకున్న పెద్దాయన వరుసగా నాలుగో సారి పుంగనూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. పుంగనూరు రికార్డును బద్దలు కొట్టారు. రైతు కుటుంబం నుంచి రాజకీయ చదరంగంలో ఆయన రారాజుగా ఎదిగారు. టీడీపీకి కంచుకోటగా ఉన్న పుంగనూరుకు 2004లో నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టారు. 2009లో కాంగ్రెస్‌ పార్టీ తరపున, 2014, 2019, 2024 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరపున బరిలో దిగి ఎమ్మెల్యేగా వరుసగా గెలుపొంది హ్యాట్రిక్‌ సాధించారు. 2009 ఎన్నికల్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా, 2019లో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు.

పెద్దిరెడ్డికి 1,00,793 ఓట్లు  
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 8 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నియోజకవర్గం మొత్తం 2,09,674 ఓట్లు పోల్‌ అవ్వగా      ఈవీఎంలో 2,06,911 ఓట్లు, పోస్టల్‌ బ్యాలెట్‌లో 2,763 ఓట్లు ఎన్నికల్లో పోలయ్యాయి. ఇందులోనే నోటాకు 2,904 మంది ఓట్లు వేశారు. ఆఖరి రౌండ్‌ ముగిసే సరికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి 1,00,793 ఓట్లు, ప్రత్యరి్థకి 94,698 ఓట్లు నమోదయ్యాయి. దీంతో 6,095 మెజారిటీ రావడంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైనట్లు ఆర్‌ఓ ప్రకటించారు. ఆ నియోజకవర్గంలో పోటీ చేసిన ప్రత్యర్థి పార్టీకి చెందిన చల్లా రామచంద్రారెడ్డికి 94,698, భారత చైతన్య యువజన     పారీ్టకి చెందిన బోడె రామచంద్ర యాదవ్‌కు 4559, కాంగ్రెస్‌కు చెందిన మురళిమోహన్‌ యాదవ్‌కు 3571, బహుజన్‌ సమాజ్‌ పారీ్టకి చెందిన సురే‹Ùకు 687, సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి అన్వర్‌ బాషా కు 1906, ఇండెపెండెంట్లుగా పోటీ చేసిన నాగేశ్వరరావుకు 242, రామయ్యకు 314 ఓట్లు నమోదయ్యాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement