వయసుతో పాటు పోరాడే సత్తా నాకుంది: వైఎస్‌ జగన్‌ | YSRCP Key Meeting Amid Assembly Session 2024 June Updates In Telugu | Sakshi
Sakshi News home page

శిశుపాలుడి పాపాలు పండినట్టు ఇప్పుడే బాబు మోసాలు పండుతున్నాయి: వైఎస్‌ జగన్‌

Published Thu, Jun 20 2024 10:10 AM | Last Updated on Fri, Jun 21 2024 9:16 AM

YSRCP Key Meeting Amid Assembly Session 2024 June Updates

సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో ప్రతీ కుటుంబానికి, ప్రతీ గడపకు మనం చేసిన మంచి ఏమిటో తెలుసు. ఈరోజుకీ వైఎస్‌ జగన్‌ అంటే అబద్దాలు చెప్పడు.. మోసం చేయడు అని వారికి తెలుసు. వైఎస్సార్‌సీపీ అందించిన పాలనను ప్రజలు మరిచిపోరు. ఇదే ప్రజలు 2029 నాటికి చంద్రబాబు మోసాలు, ప్రలోభాలను గుర్తించి రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ వైఎస్సార్‌సీపీని అధికారంలోకి తెచ్చుకుంటారు అని వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు.

గురువారం తాడేపల్లిలోని తన కార్యాలయంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన వైఎస్సార్‌సీపీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. 

‘‘ఎన్నికల్లో మనకు 40 శాతం ఓట్లు పోల్‌ అయ్యాయని మనం మర్చిపోకూడదు. 2019లో పోలిస్తే కేవలం 10 శాతం ఓట్లు తగ్గాయి. ఈ పది శాతం ప్రజలు చంద్రబాబు మోసాలను, ప్రలోభాలను ఇట్టే గుర్తిస్తారు. ప్రతీ కుటుంబానికి మనం చేసిన మ​ంచి ఏంటో తెలుసు. విశ్వసనీయతకు మన చిరునామా. మనం చేసిన మంచే మనకు శ్రీరామరక్ష. మనం అందించిన పాలనను ప్రజలు మరిచిపోరు.

.. ఈరోజుకీ జగన్‌ అబద్ధాలు చెప్పడు. జగన్‌ మోసం చేయడు అని వారికి తెలుసు. చంద్రబాబుకన్నా.. ఎక్కువ హామీలు ఇచ్చి ఉంటే బాగుండేదని అనిపించొచ్చు కూడా. రాజకీయాల్లో ఇంత నిజాయితీగా జగన్‌ ఉండడం అవసరమా? అనుకునేవాళ్లు కూడా ఉండొచ్చు. అధికారం కోసం అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం న్యాయం కాదనే జగన్‌ ఎప్పుడూ చెప్తాడు. 2014లో కూడా ఇదే చెప్పాను. 2019లో అది నిజం అయ్యింది. ప్రజలు మనకు గొప్ప విజయంతో అధికారం ఇచ్చారు. ఇప్పుడు కూడా ప్రజలు అదే చేస్తారు. విశ్వసనీయతతో మనం చేసిన రాజకీయాలు ఎక్కడికీ పోలేదు.

జగన్‌కు వయసు, వయసుతోపాటు సత్తువ కూడా ఉంది. చంద్రబాబు పాపాలు పండే కొద్దీ, ప్రజలతో కలిసి చేసే పోరాటాల్లో వైఎస్సార్‌సీపీకి, జగన్‌కు ఎవ్వరూ సాటిరారు. ప్రజలకు మరింత దగ్గరయ్యే కార్యక్రమాలు, ప్రజల తరఫున పోరాటాలు కూడా చేస్తాం. మనకు వచ్చిన సంఖ్యాబలం తక్కువే కాబట్టి, అసెంబ్లీలో మనం చేసేది తక్కువే. ఏకంగా స్పీకర్‌ పదవికి తీసుకుపోయే వ్యక్తి మాట్లాడుతున్న మాటలు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం..

జగన్‌ ఓడిపోయాడు.. చనిపోలేదు అని ఒకరు అంటారు. చచ్చేదాకా కొట్టాలి అని ఇంకొకరు అంటారు. ఇలాంటి కౌరవులు ఉండే సభకు మనం వెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి వ్యక్తుల మధ్య అసెంబ్లీలో మనం ఏదో చేయగలుగుతామనే నమ్మకం లేదు. పాపాలు పండే కొద్దీ ప్రజలతో కలిసి, ప్రజలతో నిలబడి చేసే కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఊపందుకుంటున్నాయి. శిశుపాలుడి పాపాలు పండినట్టుగా ఇప్పటికే చంద్రబాబు పాపాలు పండుతూనే ఉన్నాయి.

.. కులం, మతం, ప్రాంతం చూడకుండా.. ఏ పార్టీకి ఓటు వేశారని చూడకుండా.. జగన్‌ డోర్‌డెలివరీ చేశారు. ఇవాళ వారి పార్టీకి ఓటు వేయలేదని మనుషులపై దాడులు చేస్తున్నారు, అవమానిస్తున్నారు. వారి ఆస్తులను దాడులు చేస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ అన్యాయంగా వ్యవహరిస్తున్నారు. శిశుపాలుడి పాపాలు చాలా వేగంగా పండుతున్నాయి. మనం ఎప్పుడూ కూడా ఇలాంటివి చూడలేదు. మన ప్రభుత్వంలో మేనిఫెస్టో అన్నది ప్రభుత్వ కార్యాలయాల్లో కనిపించే పాలన అయితే, ఇప్పుడు రెడ్‌ బుక్స్‌ అని హోర్డింగులు పెడుతున్నారు. అందులో ఏ అధికారిపై కక్ష సాధించాలి. ఎవరిపై దాడులు చేయాలి, ఎవరిపై కక్షసాధించాలి.. అని రాసుకుంటున్నారు. కొడతాం, చంపుతాం అంటున్నారు.

.. మొట్టమొదటి సారిగా కేంద్రంలో 272 స్థానాలు కావాల్సి ఉండగా, బీజేపీ 240 దగ్గర ఆగిపోయింది.మరోవైపు చంద్రబాబుకు 16 స్థానాలు ఉన్నాయి. మోదీ పక్కన ఉండి చంద్రబాబు చక్రం తిప్పుతున్నట్టుగా చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను అడగకపోవడం, అడిగి సాధించుకునే దిశగా అడుగులు వేయకపోవడం శిశుపాలుడి పాపాల్లో ఒకటి. అలాంటి చంద్రబాబు రాష్ట్రానికి, యువతకు ఏం సమాధానం చెప్తాడు.

.. అదే జగన్‌ ఉండి ఉంటే.. ఈపాటికే విద్యాదీవెనకు బటన్‌ నొక్కే వాళ్లం. వసతి దీవెన బటన్‌ నొక్కేవాళ్లం.. ఇవి పెండింగులో ఉన్నాయి. రైతు భరోసా పెండింగ్‌, అమ్మ ఒడి పెండింగ్‌. చిన్న అమౌంట్‌ అయిన మత్స్యకార భరోసా కూడా పెండింగ్‌లో ఉంది. వైఎస్సార్‌సీపీ పాలన లేకపోవడంతో వీరికి ఏమీ రావడం లేదు. వీటిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో 4.12 కోట్ల మంది ఓటర్లు ఏపీలో ఉన్నారు. దాదాపు సగానికిపైగా అక్కచెల్లెమ్మలు ఉన్నారు. రూ. 1500లు ప్రతీ ఒక్కరికీ ఇస్తానని చెప్పాడు. ఇందులో పెన్షన్లు తీసుకునేవాళ్లని పక్కనిపెట్టినా సరే.. మిగిలిన 1.8 కోట్లమంది ఎదురుచూస్తున్నారు. పెట్టుబడి సహాయంకోసం రైతులు ఎదురుచూస్తున్నారు. అమ్మ ఒడిగా కింద వచ్చే డబ్బులు కోసం వారు ఎదురుచూస్తున్నారు. ఏవీ కూడా అడుగులు ముందుకుపడని పరిస్థితి. కాలం గడుస్తున్నకొద్దీ.. హనీమూన్‌ పీరియడ్‌ ముగిస్తుంది.

ఓడిపోయామన్న భావనను మనసులోనుంచి తీసేయండి. మనం ఓడిపోలేదు.. అన్న విషయాన్ని గుర్తించండి. న్యాయంగా, ధర్మంగా మనం ఓడిపోలేదు. ప్రతీ ఇంట్లో కూడా మనం చేసిన మంచి ఉంది. ప్రతీ ఇంటికీ కూడా మనం తలెత్తుకుని పోగలం. చెప్పిన పని చేశాం కాబట్టి.. ప్రజల మధ్యకి గౌరవంగా వెళ్లగలుగుతాం. కాలం గడుస్తున్న కొద్దీ మన పట్ట అభిమానం వ్యక్తమవుతుంది. మళ్లీ మనం రికార్డు మెజార్టీలో గెలుస్తాం. మోసపోతున్నవారికి మనం అండగా నిలవాలి. మనకార్యకర్తలకు మనం తోడుగా ఉండాలి. ఎప్పుడూ చూడని విధంగా కార్యకర్తలమీద, సానుభూతి పరులమీద దాడులు చేస్తున్నారు. కొన్ని చోట్ల అవమానాలు, ఆస్తుల నష్టాలు చేస్తున్నారు. వీళ్లందరికీ కూడా భరోసా ఇవ్వాలి.

.. మీ నియోజకవర్గంలో కార్యకర్తలకు తోడుగా ఉండండి. వారిని పరామర్శించండి. ఇప్పటికే పార్టీ తరఫున ఆదుకునే కార్యక్రమాలు చేస్తున్నాం. పార్టీ ఇస్తే సహాయాన్ని మీరు స్వయంగా అందించండి. రాబోయే రోజుల్లో నేను కార్యకర్తలను కలుసుకుంటాను. నష్టపోయిన ప్రతీ కార్యకర్తనూ కలిసి వారికి భరోసానిచ్చే కార్యక్రమం చేస్తాను. మా ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యే కేండిడేట్‌ మా వద్దకు రాలేదనే మాట అనిపించుకోవచ్చు. కార్యకర్తలు కష్టాల్లోనూ మనతోనూ ఉన్నారు. జెండాలు మోసి కష్టాలు పడ్డారు. వారికి తోడుగా నిలవాలి. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అందరికీ భరోసా ఇవ్వండి. వీరిని బెదిరించే కార్యక్రమాలు, జోరుగా ప్రలోభాలు జరుగుతున్నాయి. రాజీనామాలు చేయాలని బెదిరిస్తున్నారు. మీ నియోజకవర్గాల్లో కార్యకర్తలను, నాయకులను పిలిచి మాట్లాడండి.

.. నాలుగేళ్లవరకూ కూడా అవిశ్వాసం పెట్టే అవకాశం లేదు. చట్టం దీన్ని నిరోధిస్తుంది. ఈ చట్టాన్ని మార్చి ఏదో చేయాలనుకుంటే.. చేయలేరు. కోర్టులు దీనికి ఒప్పుకోవు. అందువల్ల ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. ఈ విషయాలన్నీకూడా మనవాళ్లకు మనం చెప్పాలి. వారికి తోడుగా ఉన్నామనే ధీమా ఇవ్వాలి. అప్పుడు వారికి కూడా ధైర్యం వస్తుంది. సోషల్ మీడియా కార్యకర్తలను, మన కోసం నిలబడ్డ వాలంటీర్లను వీరందర్నీ కూడా కాపాడుకోవాలి. మన పార్టీ జెండా పెట్టుకున్న ప్రతి ఒక్కరినీ మనం కాపాడుకోవాలి.

.. మనల్ని నమ్ముకుని కొన్ని కోట్ల మంది ఉన్నారు. మనం పక్కకు తప్పుకుంటే వారంతా నష్టపోతారు. లక్షల మంది కార్యకర్తలు, వేల మంది నాయకులు, వందల మంది పోటీచేసిన అభ్యర్థులు కూడా నష్టపోతారు. మనల్ని నమ్ముకున్న ప్రజలు, నాయకులు అంతా కూడా నష్టపోతారు.మనలో నిరాశకు ఎట్టి పరిస్థితుల్లోనూ చోటివ్వకూడదు. ధైర్యంగా మనం అడుగులు ముందుకు వేయాల్సిందే. ప్రతీ అభిమానికీ, కార్యకర్తకూ భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మనది. 

ఇప్పుడు కేవలం ఇంటర్వెల్‌ మాత్రమే. శకుని పాచికలు అనే సబ్జెక్ట్‌ కేవలం ఇంటర్వెలే. శ్రీకృష్ణుడు తోడు ఉన్నా.. పాండవులు ఓడిపోతారు. ధర్మం, విశ్వసనీయత, నిజాయితీ తప్పక గెలుస్తాయి. మనం తలెత్తుకునేలా రాజకీయాలు చేశాం. ప్రతీ ఒక్కరూ ఒక అర్జునుడు మాదిరిగా తిరిగి విజయం సాధిస్తారు. ఎన్నికల ఫలితాలపై చాలామంది ఫీడ్‌ బ్యాక్‌ ఇస్తున్నారు. అవన్నీ నా దృష్టికి తీసుకువస్తున్నారు.

.. ఈ ఎన్నికల్లో మీరంతా గట్టి పోరాటం చేశారు. ఎన్నికల ఫలితాలు ఎందుకు ఇలా జరగాయన్నది ఇవ్వాళ్టికీ ఆశ్చర్యకరం. మనం తలెత్తుకునే విధంగా పాలన చేశాం. మేనిఫెస్టోలో 99శాతం హామీలను అమలు చేశాం. అమలుచేసిన మేనిఫెస్టోను ప్రజల వద్దకు తీసుకెళ్లాం. వారి ఆశీస్సులు తీసుకుని ఎన్నికలకు వెళ్లాం. ప్రతీ గడపకూ తిరిగాం. రాష్ట్ర చరిత్రలో మేనిఫెస్టోను ఇంత సీరియస్‌గా ఎవ్వరూ ఎప్పుడూ తీసుకోలేదు. ఎన్నికల్లో మాటలు చెప్పి.. ఆతర్వాత చెత్తబుట్టలో వేసిన పరిస్థితులు మనం చూశాం. సీఎం కార్యాలయం నుంచి కలెక్టర్‌ కార్యాలయాల వరకూ కూడా మేనిఫెస్టోలు పెట్టుకుని ఆ దిశగా పనులు చేశాం.

ప్రతీ డిపార్ట్‌మెంట్‌లో కూడా మేనిఫెస్టో పెట్టి అదే అజెండాగా పాలన చేశాం. మొట్టమొదటి రోజునుంచీ అమలు చేసుకుంటూ ముందుకు వెళ్లాం. తలెత్తుకుని సగర్వంగా ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగాం. కానీ, ఫలితాలు చూస్తే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. రూ.2.7 లక్షల కోట్లు ప్రజలకు డీబీటీ ద్వారా ఇచ్చాం. క్యాలెండర్‌ ఇచ్చి.. తేదీల వారీగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమచేశాం. ఎప్పుడూ ఇలా జరగలేదు. మనం అధికారంలోకి రావడానికి రెండు నెలల ముందు కేవలం రూ.వేయి, దాన్ని రూ.3వేలకు పెంచాం. అప్పట్లో 39 లక్షలు మాత్రమే పెన్షనర్లు.. దాన్ని 66 పెన్షన్లకు పెంచాం. ఎవ్వరినీ కూడా పక్కనపెట్టలేదు. ఇంటివద్దకే వెళ్లి వారి చేతికే అందించాం. మరి ఆ 66 లక్షల మంది అవ్వాతాతలు, వికలాంగులు.. వారి ఆప్యాయత, ప్రేమలు ఏమయ్యాయి?.

54 లక్షల మంది తల్లులకు అమ్మ ఒడి అందించాం. 
53 లక్షల మంది రైతన్నలకు పెట్టుబడి సహాయం కింద రైతు భరోసా ఇచ్చాం. 
ఇవి ఎప్పుడూ చూడని విప్లవాత్మక మార్పులు. మరి వారి ప్రేమలు, ఆప్యాయతలు ఏమయ్యాయో తెలియదు. 
కోటిమందికి పైగా అక్క చెల్లెమ్మలకు సున్నావడ్డీ ఇచ్చాం. 
79 లక్షలమంది అక్క చెల్లెమ్మలకు ఆసరా కార్యాక్రమం ఇచ్చాం
27 లక్షలమంది అక్క చెల్లెమ్మలకు చేయూత క్రమం తప్పకుండా ప్రతి ఏటా ఇచ్చాం
30 లక్షల మంది పిల్లలకు మంచి చేస్తూ విద్యా, వసతిదీవెన వారి తల్లులకు ఇచ్చాం
31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్లపట్టాలు ఇచ్చాం
ఇలా చాలామందికి చాలా రకాలుగా సహాయపడ్డాం.
మరి వారిప్రేమలు, ఆప్యాయతలు ఏమయ్యాయో తెలియదు.
కోవిడ్‌ సమస్యలున్నా సాకులు చూపలేదు, మంచే చేశాం.
ఎప్పుడూ చూడని విధంగా, జరగని విధంగా పేదరికం నుంచి బయటకు తీసుకురావడానికి అడుగులు పడ్డాయి.

క్వాలిటీ చదువులకోసం విద్యారంగంలో సంస్కరణలు తెచ్చాం.
ఎప్పుడూ ఇలాంటి మార్పులు జరగలేదు
వైద్య రంగంలో కూడా సమూల మార్పులు తీసుకువచ్చాం
25 లక్షల వరకూ ఆరోగ్య శ్రీ ఉచితమని చెప్పాం
ఆరోగ్య ఆసరా నుంచి విలేజ్‌ క్లినిక్‌ ద్వారా ప్రతి పేదవాడికి తోడుగా ఉన్నాం
54 వేలమంది వైద్య సిబ్బందిని నియమించాం
వ్యవసాయంలో కూడా విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చాం
ఆర్బీకేల ద్వారా పేదలకు తోడుగా ఉన్నాం
విద్య, వైద్యం, వ్యవసాయం, సామాజిక న్యాయం, సుపరిపాలనలో ఎన్నో మార్పులు తీసుకు వచ్చాం
గ్రామ స్వరాజ్యానికి అర్థం తీసుకు వచ్చాం
లంచాలు, వివక్షలేని పాలనను అందించాం
ఇంటివద్దకే పాలన అన్న దానికి అర్థం తీసుకు వచ్చాం
మహిళా సాధికారితకు ఏం చేయొచ్చో అన్నీ చేశాం
15వేల మంది సర్వేయర్లను పెట్టి.. ల్యాండ్‌ సంస్కరణలు తీసుకువచ్చాం
భూ రికార్డులన్నీ కూడా స్వచ్చీకరణకు చర్యలు తీసుకున్నాం
వివాదాల్లేకుండా అడుగులు ముందుకేశాం
ల్యాండ్‌ టైటిల్‌కు ప్రభుత్వమే గ్యారెంట్‌ ఇచ్చే చర్యలు తీసుకున్నాం
టైటిల్‌కు ఇన్సూరెన్స్‌ కల్పించాం
గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు.
దిశ యాప్‌ ద్వారా మహిళల భద్రత దిశగా గట్టి చర్యలు తీసుకున్నాం.
గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటి మార్పులు జరగలేదు.

ఇన్ని చేశాక వచ్చిన ఫలితాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఫలితాలు చూసిన తర్వాత శకుని పాచికల కథ గుర్తుకు వచ్చింది. శకుని పాచికల మాదిరిగా ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కానీ ఆధారాలు లేకుండా మాట్లాడలేం అని వ్యాఖ్యలు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement