
గుంటూరు, సాక్షి: ఎన్నికల ఓటమి తర్వాత ఢీలా పడ్డ పార్టీ కేడర్‌లో ధైర్యం నింపేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఫలితాలను సమీక్షిస్తూనే.. పార్టీ కీలక నేతలతో వరుస చర్చలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఎల్లుండి కీలక సమావేశం నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు.
అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులతో ఈ నెల 19వ తేదీన తన కార్యాలయంలో వైఎస్‌జగన్ భేటీ కానున్నారు. భవిష్యత్ కార్యాచరణ, టీడీపీ దాడులే ప్రధానాంశాలుగా ఈ భేటీలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో.. ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై సమగ్రంగా చర్చించి పలు కీలక సూచనలతో వాళ్లకు ఆయన దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు ఇప్పటికే ఎమ్మెల్సీలు, ఎంపీలతో ఆయన భేటీ నిర్వహించారు. ఇప్పుడే ఏం అయిపోలేదని.. అధైర్య పడొద్దని, పార్టీ చేసిన మంచిని ప్రజలు అంత సులువుగా మరిచిపోరని, త్వరలోనే పార్టీ పుంజుకుంటుందని వాళ్లందరికీ ధైర్యం చెప్పారాయన. అలాగే.. ప్రతిపక్షాలకు కాస్త టైం ఇద్దామని, ఆ తర్వాత ప్రజల తరఫున గట్టిగా పోరాటం చేద్దామని సూచించారు. మరోవైపు.. టీడీపీ శ్రేణుల్లో గాయపడ్డ వాళ్లను పరామర్శించేందుకు త్వరలోనే రాష్ట్రవ్యాప్త పర్యటన చేస్తారని ప్రకటించారు కూడా.

Comments
Please login to add a commentAdd a comment