ఉపాధి హామీ కూలీ కింద కాస్త బియ్యం ఇచ్చే యోచనలో కేంద్రం
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు ఆహార మంత్రిత్వ శాఖ నుంచి ప్రతిపాదనలు
దేశంలో పేరుకుపోయిన బియ్యం నిల్వలను తగ్గించుకోవడం కోసమే..
సాక్షి, హైదరాబాద్: మళ్లీ కొత్త పద్ధతుల్లో ‘పనికి ఆహార పథకం’ అమలు కానుందా? జాతీయ స్థాయిలో బియ్యం నిల్వలు పేరుకుపోవడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో ఆహార సమస్య ల పెరుగుదలతో కొత్త రూపంలో ఈ పథకాన్ని తీసుకొచ్చే అవకాశాలున్నాయనే చర్చ అధికార వర్గాల్లో జరుగు తోంది. మహాత్మాగాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈఎస్) కింద చేసే ఉపాధి పనులకు ఇచ్చే కూలీలో కొంత (పార్ట్ పేమెంట్) బియ్యం ఇచ్చే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు ఊహాగానాలు సాగుతున్నాయి.
దీనికి సంబంధించి కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ నుంచి కేంద్ర గ్రామీణభివృద్ధి శాఖకు ప్రతిపాదనలు చేరినట్లు తెలుస్తోంది. భారీగా పెరిగిన నిల్వలు..: గతేడాది బియ్యం ధరలను అదుపు చేసేందుకు కేంద్రం బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై నిషే ధం, పారాబాయిల్డ్ రైస్‌పై 20 శాతం ఎక్స్‌పోర్ట్ డ్యూటీ వంటి చర్యలు చేపట్టింది.
ఈ పరిణామాలతో దేశంలో బియ్యం నిల్వలు 1.4 కోట్ల టన్నులకు చేరుకోవడంతో గిడ్డంగి ఖర్చులు పెరిగిపోయాయి. దీంతో ‘పనికి ఆహార పథకం’కింద గ్రామీణభివృద్ధి శాఖకు బియ్యం కేటాయింపును ఒక మార్గాంతరంగా కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదనలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాక వివిధ కాంబినేషన్లు, రూపాల్లో దీన్ని ఇచ్చే అవకాశముందని అధికారులు అంటున్నారు.
ప్రయోజనం ఉండదంటున్న నిపుణులు
కూలీ మొత్తంలో కొంత భాగాన్ని బియ్యంగా ఇవ్వడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని, కూలీలు ఈ బియ్యాన్ని బహిరంగ మార్కెట్‌లో అమ్ముకొనే ఆస్కారం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉపాధి హామీ పథకం అమల్లోకి రావడానికి ముందు ‘పనికి ఆహార పథకం’కింద అనేక అక్రమాలు, కుంభకోణాలు జరిగిన తీరును గుర్తుచేస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ‘ఫుడ్ ఫర్‌వర్క్ స్కీం’లో పెద్ద ఎత్తున అవినీతి, కుంభకోణాలు చోటుచేసుకోవడం, ఈ పథకం కింద కేటాయించిన బియ్యం నేరుగా బహిరంగ మార్కెట్‌కు చేరుకోవడం వంటివి జరిగిన వైనాన్ని గుర్తుచేస్తున్నారు. అదీగాకుండా ఉపాధి హామీ పథకం కింద కూలీని నగదు రూపంలో ఇవ్వాల్సి ఉండటం, ఇచ్చే బియ్యానికి లెక్క కట్టడం, ఇతర సమస్యలు ఉత్పన్నమౌతాయని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment