ఉద్యోగాలు ఊడుతున్నాయ్..!
గ్రామీణాభివృద్ధి శాఖలో ఉద్యోగాలు ఊడుతున్నాయ్.
ఇంటిగ్రేటెడ్ వాటర్‌షెడ్ ప్రోగ్రామ్‌ను రద్దు చేసిన కేంద్రం
సాక్షి, హైదరాబాద్: గ్రామీణాభివృద్ధి శాఖలో ఉద్యోగాలు ఊడుతున్నాయ్. గత రెండున్నరేళ్లుగా ఈ విభాగంలో కొత్తగా ఎటువంటి ఉద్యోగ నియామకాలు చేపట్టని ఉన్నతాధికారులు.. వివిధ ప్రాజెక్ట్‌ల కింద పనిచేస్తున్న చిరుద్యోగులను తొలగించుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఇంటిగ్రేటెడ్ వాటర్‌షెడ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ కింద గత ఏడేళ్లుగా సేవలందిస్తున్న 1,125 మంది చిరుద్యోగులకు గత ఏడాది మార్చినుంచి అధికారులు వేతనాలను చెల్లించడం లేదు. వారికి ఇస్తున్న వేతనం నెలకు రూ.2,200 మాత్రమే. వేతనం తక్కువ, ఉద్యోగ భద్రత లేకున్నా సొంత గ్రామంలోనే ఉండి నీటి సంరక్షణ పనుల్లో వారంతా సేవలందిస్తుండడం విశేషం.
ఏడాదిగా జీతాలు లేవు: ఏడేళ్ల కిందట ఉపాధి హామీలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకానికి వర్తించే నిబంధనల మేరకు వాటర్‌షెడ్ అసిస్టెంట్లను కూడా ప్రభుత్వం నియమించింది. గతేడాది వాటర్‌షెడ్ ప్రోగ్రామ్‌కు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో ఆ ప్రోగ్రామ్‌లో పనిచేస్తున్న అసిస్టెంట్లకు కష్టాలు మొదలయ్యాయి. కేంద్రం నుంచి నిధులు నిలిచిపోవడంతో గ్రామీణాభివృద్ధి అధికారులు చిరుద్యోగులకు వేతనాలను నిలిపివేశారు. అయితే.. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన (పీఎంకేఎస్‌వై) పథకం పేరిట వాటర్‌షెడ్ కార్యక్రమాలను చేయాలని తలపెట్టింది. అయితే, పీఎంకేఎస్‌వై పనులను ఉపాధి హామీలోని ఫీల్డ్ అసిస్టెంట్ల ద్వారా చేయించాలని గ్రామీణాభివృద్ధి అధికారులు నిర్ణయించడంతో వాటర్‌షెడ్ అసిస్టెంట్ల ఉద్యోగాల పునరుద్ధరణపై నీళ్లు చల్లినట్లైంది.