
సాక్షి, హైదరాబాద్: వానాకాలం సాగు ఏర్పాట్లతో పాటు గ్రామీణ ఉపాధి హామీ పథకం, హరితహారం కార్యక్రమం అమలుపై సమీక్షించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం ఉదయం 11.30 గంటలకు ప్రగతి భవన్‌లో జిల్లా కలెక్టర్లతో సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు), జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి, జిల్లా పరిషత్ సీఈవో, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా అటవీ అధికారి, జిల్లా వ్యవసాయ అధికారి సైతం పాల్గొననున్నారు. జిల్లా వ్యవసాయ కార్డులు, సాగు విస్తీర్ణం, ఎరువులు, విత్తనాల సరఫరా, రుణ మాఫీ, రైతుబంధు, రైతు వేదికల నిర్మాణం తదితర అంశాలపై ఈ సదస్సులో కలెక్టర్లకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
ఉపాధి హామీతో నీటి పారుదల, పంచాయతీరాజ్ శాఖలను అనుసంధానం చేసినందున.. ఈ పనులను మరింత విస్తృతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి నగరాలు విడిచి పల్లెబాట పట్టిన శ్రమజీవులకు ఉపాధి హామీ అండగా నిలుస్తుందని అంచనా వేస్తున్న ప్రభుత్వం ఈ పనులను విరివిగా చేపట్టాలని నిర్ణయించింది. మరోవైపు గ్రామ పంచాయతీల పనితీరును కూడా ఈ సమావేశంలో సీఎం సమీక్షించనున్నారు. ట్రాక్టర్లు, ట్యాంకర్ల కొనుగోలు, ఈ నెల 20 నుంచి నిర్వహించ తలపెట్టిన హరితహారం, డంపింగ్ యార్డులు, వైకుంఠధామం, సీజనల్ వ్యాధులపైనా అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే కరోనా వైరస్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, వైరస్ వ్యాప్తి తీరు, రోగులకు చికిత్సకు సంబంధించిన సంసిద్ధతను సైతం ఈ సదస్సులో సీఎం కేసీఆర్ సమీక్షించే అవకాశాలున్నాయి.