హరితహారం.. ఓ ఉద్యమం
ఈ సారి 40 కోట్ల మొక్కలు నాటుతాం: జోగు రామన్న
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ఓ ఉద్యమంలా చేపడుతోందని, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తరహాలోనే ప్రజలంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అటవీ శాఖ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. బుధవారం మూడో విడత హరితహారం కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ కరీంనగర్‌లో ప్రారంభిస్తారని చెప్పారు.
సోమవారం సచివాలయంలో తన చాంబర్‌లో మంత్రి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా గత రెండేళ్లలో 49 కోట్ల మొక్కలను నాటామని, మూడో విడతలో 40 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించామన్నారు. వచ్చే నాలుగేళ్లలో రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలు నాటాలని సంకల్పించామని, ఇందులో 120 కోట్ల మొక్కలు ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో, 100 కోట్ల మొక్కలు అటవీ ప్రాంతం (డీ గ్రేడ్ ఫారెస్ట్)లో, మరో 10 కోట్ల మొక్కలు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలో నాటాలని నిర్ణయించామని మంత్రి వివరించారు.