ఉపాధి హామీ పనుల బాధ్యత ఇకపై ఎంపీడీవోలదే
నందివాడ : గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులుగా ఎంపీడీవోలను పంతొమ్మిది నెలల విరామం తర్వాత మళ్లీ ప్రభుత్వం తిరిగి నియమించింది. ఆర్థిక కార్యకలాపాల నిర్వహణకు కీలకమైన డిజిటల్ సిగ్నేచర్ ‘కీ’ని (నిధుల తాళం) ప్రభుత్వం అప్పగించింది. ఇక నుంచి మండల స్థాయిలో ఎంపీడీవో కీలకం కానున్నారు. వీరి పర్యవేక్షణంలోనే ఉపాధి పనులు, బిల్లులు చెల్లింపు, ఇతరత్రా వ్యవహారాలు సాగనున్నాయి. ఈ పథకం ఆరంభం తర్వాత 2007 జూన్‌లో పీవో బాధ్యతలను ఎంపీడీవోలకు అప్పగించారు. అప్పట్లో ఉపాధి పనుల్లో ఎంపీడీవోలపై అవినీతి అభియోగాలు వచ్చాయి. దీంతో ఆ పథకం అమలు బాధ్యతల నుంచి తమను తప్పించాలని ఎంపీడీవోలు ప్రభుత్వనికి తెగేసి చెప్పారు.
తాము పీవోలుగా ఉండలేమని స్పష్టం చేశారు. దీంతో ప్రభుత్వం ఎంపీడీవోల స్థానంలో ఆగమేఘాలపై 2013 మార్చి ఒకటోతేదీ నుండి ఏపీవోలకే పీవోలుగా అదనపు బాధ్యతలు అప్పగించింది. గత 19 నెలల్లో ఏపీవోలే మండల స్థాయిలో ఉపాధి పనులను నడిపించారు. రాష్ర్టంలో ప్రభుత్వం మారిన తర్వాత మళ్లీ ఎంపీడీవోలకే బాధ్యతలు అప్పగిస్తూ గత సెప్టెంబర్ 27న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై అక్టోబర్ రెండో తేదీన జీవో నెంబర్ 139 విడుదల చేసింది. ఆ తర్వాత జన్మభూమి ఉండడంతో డీఎస్కే(కీ)లను ఎంపీడీవోలకు ఇవ్వలేదు. ఈ మధ్యనే వారికి వీటిని అప్పగించినట్లు సమాచారం.
కూలి చెల్లింపులకు గ్రామకమిటీ
ఉపాధి పథకం కూలీల బిల్లు చెల్లింపులు ఇక నుంచి గ్రామకమిటీల ద్వారా జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఉపాధిహామీ పథకం సిబ్బంది చెబుతున్నారు. ఇన్నాళ్లు బిల్లుల చెల్లింపు చూసిన పీవో ఏజెన్సీని ప్రభుత్వం తొలగించింది. సాంకేతిక కారణాల వల్ల వచ్చేనెల 15 వరకు కూలీ చెల్లింపు మాన్యువల్‌గా జరుగుతుందని పథకం సిబ్బంది చెబుతున్నారు.
ఇందుకు గ్రామకమిటీని నియమించారు. ఈ కమిటీ కన్వీనర్‌గా గ్రామ కార్యదర్శి, సభ్యులుగా సర్పంచ్, క్షేత్ర సహాయకుడు గ్రామైక్య సంఘం(వీవో) నాయకురాలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వీఆర్‌పీ ప్రతినిధి ఉంటారు. అక్రమాలు జరిగినట్లు తేలితే వీరిదే పూర్తి బాధ్యత అని ప్రభుత్వం స్పష్టంగా చెబుతోంది.