అభిప్రాయం
భారతదేశ ఆర్థిక సంక్షోభానికి కారణం వ్యవసాయదారులపైన, వ్యవసాయ సంస్కృతి పైన చూపిన నిర్లక్ష్యం. దానికి విరుగుడుగా దేశంలో కోట్ల మందిగా ఉన్న గ్రామీణ కూలీలకు కనీస బతుకుదెరువు కల్పించడం కోసం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వచ్చింది. ఈ పథకం అమలు కావడం వల్ల పేదల కడుపులోకి నాలుగు మెతుకులు పోవడంతో పాటు ఆత్మ గౌరవం పెరిగింది. ఈ పథకం రూపకల్పనలో మానవతా స్ఫూర్తి ఉంది. కరుణాభావం ఉంది. రాజ్యాంగ అధ్యయనం ఉంది. అయితే ఈ పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేసే ప్రయత్నం చేయడం బాధాకరమైన విషయం. సామాజిక న్యాయంతో కూడిన రాజ్యాధికారమే ఈ యుగ ధర్మం అని గుర్తించాలి.
భారతదేశంలో ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం పెరుగుతున్నాయని అనేక నివేదికలు చెబుతున్నాయి. ప్రధానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రామిక వర్గానికి, అందునా దళిత బహుజన వర్గాలకు ఆచారణాత్మక విరో ధాన్ని ప్రకటిస్తున్నాయి. దానికి రుజువు ఏమిటంటే, పేద ప్రజలకు మేలు కలిగించి వారి పొట్ట నింపుతూ వారికి గ్రామాల్లో నివసించే పరిస్థితిని కల్పించిన ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ’ పథకాన్ని(ఎంజీ–ఎన్‌ఆర్‌ఈజీఎస్) నీరు గార్చడం. ఇది పేద లను గ్రామాల నుంచి తరిమేసి, గ్రామాలను కార్పొరేట్లకు అప్పజెప్పే దుష్ట యత్నం.
దేశంలో కోట్ల మందిగా వున్న గ్రామీణ కూలీలకు ఉపాధి హామీ ఇవ్వడం కోసం స్వాతంత్య్రానంతరం వచ్చిన ఒకే ఒక్క పథకం – గ్రామీణ ఉపాధి హామీ. మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వానికి నాడు వామపక్షాల మద్దతు అనివార్యమైంది. దాంతో వామపక్షాలు డిమాండ్ చేసినట్టుగా గ్రామీణ పేదలకు ఉపాధి హామీ పథకాన్ని చట్టబద్ధంగా అమలు చేయాల్సి వచ్చింది.
2005 ఆగస్ట్ 23న దేశ పార్లమెంట్ చారిత్రాత్మకమైన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఆమోదించింది. ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని అత్యంత వెనుకబడిన అనంతపురం జిల్లాలోని నార్పల మండలం బండమీదపల్లి గ్రామంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ 2006 ఫిబ్రవరి 2న ప్రారంభించారు. ఈ పథకం అమలు కావడం వల్ల పేదల కడుపులోకి నాలుగు మెతుకులు పోవడంతో పాటు ఆత్మ గౌరవం పెరిగింది.
నిజానికి మన్మోహన్ భారతదేశానికి ఉపకరించే అనేక ఉపయో గకరమైన పనులు నిర్వర్తించారు. ఉపాధి హామీ పథకం రూపకల్ప నలో ఆంధ్ర క్యాడర్‌కు సంబంధించి ఢిల్లీలో పనిచేసిన కొప్పుల రాజు ప్రభావం ఉంది. ఆయన మీద ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ పోరా టాల ఫలితం ఉంది. ఈ పథకం రూపకల్పనలో మానవతా స్ఫూర్తి ఉంది. కరుణాభావం ఉంది. రాజ్యాంగపు అధ్యయనం ఉంది. అయితే ఈ పథకాన్ని కేంద్ర, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేసే ప్రయత్నం చేయడం బాధాకరమైన విషయం.
అంతర్జాతీయస్థాయిలో మానవాభివృద్ధిని గణించినట్లు, భారత దేశంలో కూడా లెక్కించడానికి ప్రణాళికాసంఘం ఆధ్వర్యంలో ప్రయ త్నాలు జరిగాయి. ఆర్థికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు మానవాభి వృద్ధిలో మెరుగైన పనితీరును ప్రదర్శించాయి. కానీ ఆర్థికాభివృద్ధికీ, మానవాభివృద్ధికీ మధ్య ఉండే ధనాత్మక సహసంబంధం మధ్యంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు అన్వయించడం లేదు. అయితే కేరళ రాష్ట్రం మానవాభివృద్ధిలోనూ, ఆర్థికాభివృద్ధిలోనూ సమాన మెరుగుదల కనబరుస్తోంది.
బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒరిస్సా మొదలైనవాటి పనితీరుతో కేరళ రెండింతల మెరుగుదల కన బరిచింది. పంజాబ్, తమిళనాడు, మహారాష్ట్ర, హరియాణా మొదలైన రాష్ట్రాలు చెప్పుకోతగ్గ పురోగతిని సాధించాయి. క్లుప్తంగా చెప్పాలంటే చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మానవాభివృద్ధిలో మంచి ఫలితాలను సాధించాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మానవాభివృద్ధిలో గణనీయమైన పురోగతి కనిపిస్తున్నప్పటికీ, వాటి మధ్య అంతరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
నిజానికి భారతదేశ ఆర్థిక సంక్షోభానికి కారణం వ్యవసాయ దారులపైన, వ్యవసాయ సంస్కృతిపైన చూపిన నిర్లక్ష్యం. భారతదేశంలో కుల కార్పొరేట్ దోపిడీ వ్యవస్థ రూపొందడానికి కారణాలను అంబేడ్కర్ ఆనాడే పసిగట్టారు. పేద ప్రజలను కులం ద్వారా విభజించి వారికి రాజ్యాధికారం రాకుండా చేయడానికే ప్రయత్నాలు జరి గాయి. అంబేడ్కర్ 1942లోనే మహరాష్ట్ర ‘కొలాబా’ జిల్లాలో అణ గారిన వర్గాల సభలో మాట్లాడుతూ, అగ్రవర్ణ రాజకీయ పార్టీలు, ఆర్థిక పెత్తందారులు, భూస్వాములు కలిసి శ్రామిక వర్గాలను ఏకం కాకుండా చేసి రాజ్యాధికారానికి దూరం చేస్తున్నారన్నారు.
‘‘అణగారిన వర్గాల వారి ఉద్యమం ఇతర శ్రామికజనంతో కలిసి ముందుకు సాగాలని నేను ఆత్రుత పడుతున్నాను. ఈ లక్ష్యాన్నిదృష్టిలో ఉంచుకునే, బ్రాహ్మణేతర వర్గానికి చెందిన శ్రమజీవులు తమ స్వేచ్ఛకోసం ఎప్పుడో ఒకప్పుడు మహత్తర పోరాటం చేస్తారన్న ఆశ తోనే గత పదేళ్ళుగా బ్రాహ్మణేతర పార్టీలో కొనసాగుతున్నారు. మా పార్టీకి తన అంతరాంతరాలలో ప్రజాస్వామ్య బీజాలు ఉన్నాయి. దుర దృష్టవశాత్తు ఈ పార్టీ నాయకులు తమ బాధ్యతలను గుర్తించకుండా ఒకవైపున ప్రభుత్వం, మరోవైపున కాంగ్రెస్ ప్రభావం వల్ల ఈ పార్టీ ఛిన్నాభిన్నం కావడానికి దోహదం చేశారు.
ఇప్పటికైనా ఈ విషయంలో వారు ఏమైనా చేయగలిగితే నేను ఆహ్వానిస్తాను. బ్రాహ్మణే తరులైన శ్రమజీవులు మా పార్టీలో చేరాలని నేను పట్టబట్టడం లేదు. కావాలనుకుంటే వారు వేరే పార్టీ పెట్టుకోనివ్వండి. అయినా బ్రాహ్మ ణులకు, పెట్టుబడిదారులకు, భూస్వాములకు వ్యతిరేకంగా మనందరం కలిసి ఉమ్మడి పోరాటం చేయవచ్చు.
అణగారిన వర్గాల వారు విడిగా ఒక రాజకీయ పార్టీ నడిపితే శ్రామికజన ప్రయోజనాలు దెబ్బతింటాయని కొందరు అంటున్నారు. దానివల్ల అలాంటిది ఏమీ జరగదు. అట్టడుగున ఉన్న మన పోరాటం నిజానికి ఇతర శ్రామిక వర్గాల వారి కష్టాలను దూరం చేయడానికి ఉపయోగపడుతుంది. భవనంలోని అట్టడుగున ఉన్న పునాదిరాయి కదిలితే, పైన ఉన్నవి పట్టు సడలుతాయి.
కేవలం సవర్ణ హిందు వులతో మాత్రమే కూడిన కార్మిక సంస్థ ఉంటే హిందువులకు మేలు కలుగుతుందని ఏమీ లేదు. ఒకవేళ ఆ కార్మిక సంస్థకు సరైన మార్గ దర్శనం లేకపోతే ఆ అణగారిన వర్గాల హిందువులకు మేలు కలుగు తుందని గ్యారెంటీ కూడా ఏమీ లేదు. పైగా హాని కూడా జరగొచ్చు. అనేక సందర్భాలలో జరిగినట్టు వారి హక్కులను కాలరాయడానికి ఉపయోగపడవచ్చు.’’
అంబేడ్కర్ ఆలోచనలు విశాలమైనవి. దీర్ఘ దర్శనంతో కూడు కున్నవి. ఇకపోతే ఉపాధి చట్టం కింద పని చేసిన కూలీలకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. రోజూ పని చేస్తే తప్ప పూట గడవని కూలీలకు ఆరేడు నెలలుగా బిల్లులు ఎందుకు బకాయి ఉంటున్నాయి? కూలీలకు సకాలంలో డబ్బులు అందకపోతే అనివార్యంగా ఈ పని నుండి తప్పు కొంటారు. పని దినాలు కల్పించాలనే డిమాండ్ చేయడం తగ్గిపోతుంది. తిరిగి మరలా గ్రామీణ వేతన దోపిడీకి గురికావలసి వస్తుంది.
ఎన్నికల ముందు అనేక పథకాలు ప్రకటించి గద్దెనెక్కే పాలకులు చట్టబద్ధంగా అమలు చేయాల్సిన గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయకపోవడం వెనుక గ్రామీణ ప్రాంతాల నుండి పేదలను తరిమివేసే కుట్రలేదని భావించగలమా? ఈ కూలీలు ఇతర రాష్ట్రాల వ్యవసాయ పనులకు, మహా నగరాలకు పెద్ద ఎత్తున వలస వెళితే తప్ప అక్కడ చౌకగా శ్రమను అమ్ముకునే కార్మికులు దొరకరని సామా జిక విశ్లేషకులు చెబుతున్నారు.
రాజ్యాంగం కార్మిక, శ్రామిక పక్షపాతంతో కూడుకుని ఉన్నదని పాలకులు గుర్తించలేకపోతున్నారు. పేద ప్రజలు తమ గ్రామంలో బతికితే ఆ గ్రామానికి వెలుగు, ఆ గ్రామానికి జీవం. ఈ పథకం వల్ల దళిత స్త్రీలు సూర్యోదయాన్నే కొంత కూలీని సంపాదించుకున్నారు. ఈ పథకం వల్ల గ్రామీణ రోడ్ల పక్కన కాలువలు తీయబడ్డాయి.
ఈ పథకం వల్ల గ్రామీణ స్కూళ్లు బలపడ్డాయి. పిల్లలను చదివించు కోగలిగారు. ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడంలో రాజ్యాంగ నిరాకరణ ఉంది. మానవతా స్ఫూర్తికి విరుద్ధమైన ఆచరణ ఉంది. సామాజిక న్యాయంతో కూడిన రాజ్యాధికారమే ఈ యుగ ధర్మం. అంబేడ్కర్ మార్గంలో నడుద్దాం. బలమైన గ్రామీణ భారతదేశాన్ని నిర్మిద్దాం.
డా‘‘ కత్తి పద్మారావు
వ్యాసకర్త దళితోద్యమ నాయకులు
మొబైల్: 98497 41695
Comments
Please login to add a commentAdd a comment