విశ్లేషణ
ఆర్థిక మాంద్యం నేపథ్యంలో 1933లో అమెరికాలో గద్దెనెక్కిన రూజ్‌వెల్ట్ ప్రభుత్వం తొలి వంద రోజుల్లో కొన్ని మేలైన నిర్ణయాలు తీసుకుంది. అప్పటి నుంచీ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తొలి వంద రోజుల్లో ఏం చేస్తుందనే ఆసక్తి మొదలైంది. కేంద్రంలో కొలువుదీరిన ఎన్డీఏ ప్రభుత్వం ముందున్న అతి పెద్ద సవాలు ఉపాధి! దేశవ్యాప్తంగా అప్రెంటిస్‌షిప్ కార్యక్రమం ఒకదాన్ని మొదలుపెట్టడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. చిన్న, సన్నకారు రైతులతోపాటు కౌలు రైతులకూ రుణాలు అందుబాటులోకి తేవాలి. వంద కోట్ల కంటే ఆర్థిక సంపద ఎక్కువగా ఉన్న వారిపై ఒక శాతం పన్ను విధించాలి. దేశంలో పెరిగిపోతున్న ఆర్థిక అంతరాన్ని తగ్గించేందుకు ఈ చర్య ఉపయోగపడుతుంది.
కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ప్రతిసారి మాదిరిగానే ఈసారి కూడా తొలి వంద రోజుల్లో ఏం జరుగుతుందన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొత్త ప్రభుత్వపు ప్రాథమ్యాలు అర్థమయ్యేదిప్పుడే మరి. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో కొన్నింటినైనా అమలు చేసేందుకు ఇదే మంచి తరుణం కూడా. తద్వారా కొత్త ప్రభుత్వ కార్యకలాపాలు వేగం పుంజుకుంటాయి. ప్రజల్లో విశ్వాసమూ నెలకొంటుంది. అలాగే దేశీ, విదేశీ పెట్టుబడిదారుల నమ్మకం చూరగొనడమూ సాధ్యమవుతుంది. స్పష్టమైన మెజారిటీతో గద్దెనెక్కిన ప్రభుత్వం కూడా కొంత సమయం తరువాత ప్రజా విశ్వాసం కోల్పోవచ్చు. కాబట్టి ఈ తొలి రోజులను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
నిజానికి ఈ తొలి వంద రోజుల భావన ఎప్పుడో 1933లో అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి.రూజ్‌వెల్ట్ మొదలుపెట్టారు. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో గద్దెనెక్కిన రూజ్‌వెల్ట్ ప్రభుత్వం తొలి వంద రోజుల్లో కొన్ని మేలైన నిర్ణయాలు తీసుకుంది. రైతులతోపాటు నిరుద్యోగులు, యువత, పరిశ్రమలకు ఉపశమనం కలిగించేలా తక్షణ సాయం ప్రకటించడం, ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే ఉద్దీపన కార్యక్రమాలు చేపట్టడం వీటిల్లో ఉన్నాయి. ఇదే సమయంలో బంగారంపై ప్రైవేట్ యాజమాన్యాన్ని తొలగించడం వంటి విప్లవాత్మక నిర్ణయాలు ఈ సమయంలోనే జరిగాయి. మనుగడ సాగించలేని బ్యాంకుల బరువును వదిలించుకునేందుకు బ్యాంకింగ్ హాలిడేను ప్రకటించారు. వాణిజ్య, పెట్టుబడులకు వేర్వేరుగా బ్యాంకింగ్ వ్యవస్థల ఏర్పాటుకు దారితీసిన గ్లాస్–స్టీగాల్ చట్టం ఈ సమయంలోనే అమల్లోకి వచ్చింది.
భారత్‌లో కొత్తగా కొలువైన ప్రభుత్వానికి రూజ్‌వెల్ట్ తరహాలో ఆర్థిక మాంద్య సమస్య లేదు. పైగా ఆర్థిక రంగం పటిష్టంగానే ఉంది. గత ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటు చాలామందిని ఆశ్చర్యపరుస్తూ పైకి ఎగబాకింది. అలాగే ద్రవ్యోల్బణం కూడా ఓ మోస్తరు స్థాయిలో మాత్రమే కొనసాగుతోంది. బ్యాంకింగ్ రంగ ఆరోగ్యం కూడా బాగానే కనబడుతోంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు రికార్డు స్థాయిలో రూ.1.4 లక్షల కోట్ల లాభాలు నమోదు చేశాయి. స్టాక్ మార్కెట్ కూడా మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. ఈ స్థూల ఆర్థికాంశాలన్నీ బాగా ఉన్న నేపథ్యంలో కొత్త ప్రభుత్వం తొలి వంద రోజుల ప్రాథమ్యాలు ఏముంటే బాగుంటుంది? నాలుగు నిర్దిష్టమైన సూచనలు:
కొత్త ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలు ఉపాధి కావచ్చు. అంతర్జాతీయ కార్మిక సంఘం, ఇన్ స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ డెవలప్‌మెంట్ నివేదికల ప్రకారం దేశంలోని నిరుద్యోగుల్లో 83 శాతం మంది 29 ఏళ్ల కంటే తక్కువ వయసు కలిగిన వారు. ఇదే సమయంలో దేశం మొత్తమ్మీద నైపుణ్యమున్న, అర్ధ నైపుణ్యమున్న ఉద్యోగుల కొరత చాలా తీవ్రంగా ఉంది. కాబటి నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు దేశవ్యాప్తంగా అప్రెంటిస్‌షిప్ కార్యక్రమం ఒకదాన్ని మొదలుపెట్టడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఈ రకమైన కార్యక్రమానికి ప్రస్తుతమున్న వాటి కంటే మెరుగైన చట్టపరమైన మద్దతు అవసరమవుతుంది. ప్రస్తుత కార్మిక చట్టాల ప్రకారం.. అప్రెంటిస్ అయినా, ఇతరులైనా ఆరు నెలలపాటు పనిచేస్తే వారిని శాశ్వత ఉద్యోగులుగా చేయాలి.
ఫలితంగా పారిశ్రామిక వేత్తలు అప్రెంటిస్‌లకు కూడా అవకాశాలిచ్చే అవకాశం తక్కువ అవుతోంది. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. అప్రెంటిస్ సర్టిఫికెట్ దేశవ్యాప్తంగా చెల్లుబాటయ్యేలా చేయాలి. కేంద్ర ప్రభుత్వ అధికారిక ముద్ర కూడా ఈ సర్టిఫికెట్‌కు అవసరమవుతుంది. జాతీయ అప్రెంటిస్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టి పై అంశాలన్నింటినీ చేర్చడం ద్వారా నిరుద్యోగ సమస్య, నైపుణ్యాల లోటు, ఉద్యోగార్హతల సమస్యలను పరిష్కరించవచ్చు. దీంతోపాటు అగ్నివీర్ కార్యక్రమాన్ని ప్రస్తుతమున్న నాలుగేళ్ల నుంచి ఏడు లేదా ఎనిమిదేళ్లకు పెంచడం (షార్ట్ సర్వీస్ కమిషన్ కార్యకాలానికి దగ్గరగా) కూడా నిరుద్యోగ సమస్య సమసిపోయేందుకు ఉపయోగపడుతుంది.
ఇక రెండో సూచన... పంట ఉత్పత్తులకిచ్చే కనీస మద్దతు ధరకు చట్టపరమైన రక్షణ కల్పించడం గురించి. కనీస మద్దతు ధర సాఫల్యానికి మార్కెట్ ధరలన్నీ గణనీయంగా తగ్గాలి. అయితే కనీస మద్దతు ధర వల్ల ధరలపై ఒత్తిడి పెరిగే అవకాశమూ ఉంటుంది. కానీ మొత్తమ్మీద అటు రైతుకు, ఇటు ప్రభుత్వానికి ఉభయ తారకం. కొత్త ప్రభుత్వం కనీస మద్దతు ధరతోపాటు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి, దిగుమతులపై నియంత్రణలకు దూరంగా ఉంటామన్న సూచన కూడా చేయాల్సి ఉంటుంది. నియంత్రణలు రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయి.
మూడవ సూచన: చిన్న, సన్నకారు రైతులతోపాటు కౌలు రైతులకూ రుణాలు అందుబాటులోకి తేవాలి. దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల్లో 40 శాతం కౌలు రైతులే పండిస్తున్నారు. భూ యజమానులతో వీరికి నామమాత్రపు ఒప్పందం మాత్రమే ఉంటుంది. ఈ కారణంగా రుణ సౌకర్యం లభించడం కష్టమవుతుంది. కొన్ని రాష్ట్రాల్లో ఈ సమస్యను అధిగమించేందుకు కొన్ని వినూత్న పద్ధతుల ఆవిష్కరణ జరిగింది. ఇలాంటి ప్రయత్నాల మదింపు జరిపి జాతీయ స్థాయి విధానాన్ని రూపొందించి అమలు చేయాల్సిన అవసరముంది. సాధారణంగా పంట రుణాలన్నవి నాలుగు నుంచి ఆరు నెలల కాలానికి అవసరమవుతుంటాయి.
ఇంత చిన్న కాలావధి అనేది నిరర్థక ఆస్తుల నిర్వచనం కిందకు రాదు. దీనికి తగిన నమూనా రూపొందించాలి. అలాగే చిన్న, సన్నకారు రైతులు, ఔత్సాహిక చిన్నస్థాయి పారిశ్రామిక వేత్తలకూ రుణ సౌకర్యం పెద్దగా ఉండటం లేదు. అకౌంట్ అగ్రిగేటర్స్ వంటివి అందుబాటులో ఉన్న ఈ కాలంలో కేవలం కొలాటరల్ ఆధారంగా కాకుండా... క్యాష్ ఫ్లో ఆధారంగా రుణాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలి. పైగా... చాలామంది చిన్నస్థాయి పారిశ్రామిక వేత్తలకు ఆర్థికాంశాలపై అవగాహన తక్కువే. ఈ అంతరాన్ని భర్తీ చేసేందుకు గట్టి ప్రయత్నమే జరగాలి. అంతేకాకుండా... చిన్న చిన్న పారిశ్రామికవేత్తలకు వర్కింగ్ క్యాపిటల్ లభ్యత పెరిగేందుకు 2006 నాటి చిన్న, మధ్యతరహా పరిశ్రమల చట్టంలోని 45 రోజుల నిబంధనను కఠినంగా అమలు చేసే ప్రయత్నం జరగాలి.
నాలుగో సూచన... ఫైనాన్షియల్ వెల్త్ (స్టాక్స్, బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్ వంటివి– అన్నీ ‘పాన్’తో అనుసంధానించి ఉంటాయి) విలువ రూ.వంద కోట్ల కంటే ఎక్కువగా ఉన్న వారిపై కొద్దిగా ఒక శాతం పన్ను విధించడం. దేశంలో పెరిగిపోతున్న ఆర్థిక అంతరాన్ని తగ్గించేందుకు ఈ చర్య ఉపయోగపడుతుంది. ఈ పన్ను ద్వారా సేకరించిన మొత్తాలను గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక విద్యాభివృద్ధికి కేటాయించవచ్చు. ఈ నిధులు రాష్ట ప్రభుత్వాలకు కాకుండా... నేరుగా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు చేరాలి. ఫైనాన్స్ కమిషన్ ఇప్పటికే ఇలా నేరుగా ఆర్థిక వనరులను అందిస్తున్న విషయం తెలిసిందే.
ప్రొ‘‘ అజీత్ రానాడే
వ్యాసకర్త పుణెలోని ‘గోఖలే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్’ వైస్ ఛాన్స్‌లర్ (‘ద మింట్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment