Economic depression
-
మొదటి నూరు రోజులు కీలకం
ఆర్థిక మాంద్యం నేపథ్యంలో 1933లో అమెరికాలో గద్దెనెక్కిన రూజ్వెల్ట్ ప్రభుత్వం తొలి వంద రోజుల్లో కొన్ని మేలైన నిర్ణయాలు తీసుకుంది. అప్పటి నుంచీ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తొలి వంద రోజుల్లో ఏం చేస్తుందనే ఆసక్తి మొదలైంది. కేంద్రంలో కొలువుదీరిన ఎన్డీఏ ప్రభుత్వం ముందున్న అతి పెద్ద సవాలు ఉపాధి! దేశవ్యాప్తంగా అప్రెంటిస్‌షిప్ కార్యక్రమం ఒకదాన్ని మొదలుపెట్టడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. చిన్న, సన్నకారు రైతులతోపాటు కౌలు రైతులకూ రుణాలు అందుబాటులోకి తేవాలి. వంద కోట్ల కంటే ఆర్థిక సంపద ఎక్కువగా ఉన్న వారిపై ఒక శాతం పన్ను విధించాలి. దేశంలో పెరిగిపోతున్న ఆర్థిక అంతరాన్ని తగ్గించేందుకు ఈ చర్య ఉపయోగపడుతుంది.కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ప్రతిసారి మాదిరిగానే ఈసారి కూడా తొలి వంద రోజుల్లో ఏం జరుగుతుందన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొత్త ప్రభుత్వపు ప్రాథమ్యాలు అర్థమయ్యేదిప్పుడే మరి. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో కొన్నింటినైనా అమలు చేసేందుకు ఇదే మంచి తరుణం కూడా. తద్వారా కొత్త ప్రభుత్వ కార్యకలాపాలు వేగం పుంజుకుంటాయి. ప్రజల్లో విశ్వాసమూ నెలకొంటుంది. అలాగే దేశీ, విదేశీ పెట్టుబడిదారుల నమ్మకం చూరగొనడమూ సాధ్యమవుతుంది. స్పష్టమైన మెజారిటీతో గద్దెనెక్కిన ప్రభుత్వం కూడా కొంత సమయం తరువాత ప్రజా విశ్వాసం కోల్పోవచ్చు. కాబట్టి ఈ తొలి రోజులను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిజానికి ఈ తొలి వంద రోజుల భావన ఎప్పుడో 1933లో అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి.రూజ్వెల్ట్ మొదలుపెట్టారు. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో గద్దెనెక్కిన రూజ్వెల్ట్ ప్రభుత్వం తొలి వంద రోజుల్లో కొన్ని మేలైన నిర్ణయాలు తీసుకుంది. రైతులతోపాటు నిరుద్యోగులు, యువత, పరిశ్రమలకు ఉపశమనం కలిగించేలా తక్షణ సాయం ప్రకటించడం, ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే ఉద్దీపన కార్యక్రమాలు చేపట్టడం వీటిల్లో ఉన్నాయి. ఇదే సమయంలో బంగారంపై ప్రైవేట్ యాజమాన్యాన్ని తొలగించడం వంటి విప్లవాత్మక నిర్ణయాలు ఈ సమయంలోనే జరిగాయి. మనుగడ సాగించలేని బ్యాంకుల బరువును వదిలించుకునేందుకు బ్యాంకింగ్ హాలిడేను ప్రకటించారు. వాణిజ్య, పెట్టుబడులకు వేర్వేరుగా బ్యాంకింగ్ వ్యవస్థల ఏర్పాటుకు దారితీసిన గ్లాస్–స్టీగాల్ చట్టం ఈ సమయంలోనే అమల్లోకి వచ్చింది. భారత్‌లో కొత్తగా కొలువైన ప్రభుత్వానికి రూజ్వెల్ట్ తరహాలో ఆర్థిక మాంద్య సమస్య లేదు. పైగా ఆర్థిక రంగం పటిష్టంగానే ఉంది. గత ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటు చాలామందిని ఆశ్చర్యపరుస్తూ పైకి ఎగబాకింది. అలాగే ద్రవ్యోల్బణం కూడా ఓ మోస్తరు స్థాయిలో మాత్రమే కొనసాగుతోంది. బ్యాంకింగ్ రంగ ఆరోగ్యం కూడా బాగానే కనబడుతోంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు రికార్డు స్థాయిలో రూ.1.4 లక్షల కోట్ల లాభాలు నమోదు చేశాయి. స్టాక్ మార్కెట్ కూడా మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. ఈ స్థూల ఆర్థికాంశాలన్నీ బాగా ఉన్న నేపథ్యంలో కొత్త ప్రభుత్వం తొలి వంద రోజుల ప్రాథమ్యాలు ఏముంటే బాగుంటుంది? నాలుగు నిర్దిష్టమైన సూచనలు:కొత్త ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలు ఉపాధి కావచ్చు. అంతర్జాతీయ కార్మిక సంఘం, ఇన్ స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ డెవలప్మెంట్ నివేదికల ప్రకారం దేశంలోని నిరుద్యోగుల్లో 83 శాతం మంది 29 ఏళ్ల కంటే తక్కువ వయసు కలిగిన వారు. ఇదే సమయంలో దేశం మొత్తమ్మీద నైపుణ్యమున్న, అర్ధ నైపుణ్యమున్న ఉద్యోగుల కొరత చాలా తీవ్రంగా ఉంది. కాబటి నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు దేశవ్యాప్తంగా అప్రెంటిస్‌షిప్ కార్యక్రమం ఒకదాన్ని మొదలుపెట్టడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఈ రకమైన కార్యక్రమానికి ప్రస్తుతమున్న వాటి కంటే మెరుగైన చట్టపరమైన మద్దతు అవసరమవుతుంది. ప్రస్తుత కార్మిక చట్టాల ప్రకారం.. అప్రెంటిస్ అయినా, ఇతరులైనా ఆరు నెలలపాటు పనిచేస్తే వారిని శాశ్వత ఉద్యోగులుగా చేయాలి. ఫలితంగా పారిశ్రామిక వేత్తలు అప్రెంటిస్‌లకు కూడా అవకాశాలిచ్చే అవకాశం తక్కువ అవుతోంది. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. అప్రెంటిస్ సర్టిఫికెట్ దేశవ్యాప్తంగా చెల్లుబాటయ్యేలా చేయాలి. కేంద్ర ప్రభుత్వ అధికారిక ముద్ర కూడా ఈ సర్టిఫికెట్‌కు అవసరమవుతుంది. జాతీయ అప్రెంటిస్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టి పై అంశాలన్నింటినీ చేర్చడం ద్వారా నిరుద్యోగ సమస్య, నైపుణ్యాల లోటు, ఉద్యోగార్హతల సమస్యలను పరిష్కరించవచ్చు. దీంతోపాటు అగ్నివీర్ కార్యక్రమాన్ని ప్రస్తుతమున్న నాలుగేళ్ల నుంచి ఏడు లేదా ఎనిమిదేళ్లకు పెంచడం (షార్ట్ సర్వీస్ కమిషన్ కార్యకాలానికి దగ్గరగా) కూడా నిరుద్యోగ సమస్య సమసిపోయేందుకు ఉపయోగపడుతుంది. ఇక రెండో సూచన... పంట ఉత్పత్తులకిచ్చే కనీస మద్దతు ధరకు చట్టపరమైన రక్షణ కల్పించడం గురించి. కనీస మద్దతు ధర సాఫల్యానికి మార్కెట్ ధరలన్నీ గణనీయంగా తగ్గాలి. అయితే కనీస మద్దతు ధర వల్ల ధరలపై ఒత్తిడి పెరిగే అవకాశమూ ఉంటుంది. కానీ మొత్తమ్మీద అటు రైతుకు, ఇటు ప్రభుత్వానికి ఉభయ తారకం. కొత్త ప్రభుత్వం కనీస మద్దతు ధరతోపాటు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి, దిగుమతులపై నియంత్రణలకు దూరంగా ఉంటామన్న సూచన కూడా చేయాల్సి ఉంటుంది. నియంత్రణలు రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయి.మూడవ సూచన: చిన్న, సన్నకారు రైతులతోపాటు కౌలు రైతులకూ రుణాలు అందుబాటులోకి తేవాలి. దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల్లో 40 శాతం కౌలు రైతులే పండిస్తున్నారు. భూ యజమానులతో వీరికి నామమాత్రపు ఒప్పందం మాత్రమే ఉంటుంది. ఈ కారణంగా రుణ సౌకర్యం లభించడం కష్టమవుతుంది. కొన్ని రాష్ట్రాల్లో ఈ సమస్యను అధిగమించేందుకు కొన్ని వినూత్న పద్ధతుల ఆవిష్కరణ జరిగింది. ఇలాంటి ప్రయత్నాల మదింపు జరిపి జాతీయ స్థాయి విధానాన్ని రూపొందించి అమలు చేయాల్సిన అవసరముంది. సాధారణంగా పంట రుణాలన్నవి నాలుగు నుంచి ఆరు నెలల కాలానికి అవసరమవుతుంటాయి. ఇంత చిన్న కాలావధి అనేది నిరర్థక ఆస్తుల నిర్వచనం కిందకు రాదు. దీనికి తగిన నమూనా రూపొందించాలి. అలాగే చిన్న, సన్నకారు రైతులు, ఔత్సాహిక చిన్నస్థాయి పారిశ్రామిక వేత్తలకూ రుణ సౌకర్యం పెద్దగా ఉండటం లేదు. అకౌంట్ అగ్రిగేటర్స్ వంటివి అందుబాటులో ఉన్న ఈ కాలంలో కేవలం కొలాటరల్ ఆధారంగా కాకుండా... క్యాష్ ఫ్లో ఆధారంగా రుణాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలి. పైగా... చాలామంది చిన్నస్థాయి పారిశ్రామిక వేత్తలకు ఆర్థికాంశాలపై అవగాహన తక్కువే. ఈ అంతరాన్ని భర్తీ చేసేందుకు గట్టి ప్రయత్నమే జరగాలి. అంతేకాకుండా... చిన్న చిన్న పారిశ్రామికవేత్తలకు వర్కింగ్ క్యాపిటల్ లభ్యత పెరిగేందుకు 2006 నాటి చిన్న, మధ్యతరహా పరిశ్రమల చట్టంలోని 45 రోజుల నిబంధనను కఠినంగా అమలు చేసే ప్రయత్నం జరగాలి. నాలుగో సూచన... ఫైనాన్షియల్ వెల్త్ (స్టాక్స్, బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్ వంటివి– అన్నీ ‘పాన్’తో అనుసంధానించి ఉంటాయి) విలువ రూ.వంద కోట్ల కంటే ఎక్కువగా ఉన్న వారిపై కొద్దిగా ఒక శాతం పన్ను విధించడం. దేశంలో పెరిగిపోతున్న ఆర్థిక అంతరాన్ని తగ్గించేందుకు ఈ చర్య ఉపయోగపడుతుంది. ఈ పన్ను ద్వారా సేకరించిన మొత్తాలను గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక విద్యాభివృద్ధికి కేటాయించవచ్చు. ఈ నిధులు రాష్ట ప్రభుత్వాలకు కాకుండా... నేరుగా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు చేరాలి. ఫైనాన్స్ కమిషన్ ఇప్పటికే ఇలా నేరుగా ఆర్థిక వనరులను అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రొ‘‘ అజీత్ రానాడే వ్యాసకర్త పుణెలోని ‘గోఖలే ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్’ వైస్ ఛాన్స్లర్ (‘ద మింట్’ సౌజన్యంతో) -
Ned Davis Research: ముంచుకొస్తున్న మాంద్యం
ప్రపంచాన్ని మాంద్యం మేఘాలు కమ్ముకుంటున్నాయి. వచ్చే ఏడాదికల్లా ఆర్థిక మాంద్యం అతలాకుతలం చేసేలా కన్పిస్తోంది. కరోనా దెబ్బ నుంచి కోలుకోకముందే వచ్చిపడ్డ రష్యా–ఉక్రెయిన్ యుద్ధం తదితరాలతో ఆర్థిక వృద్ధి క్రమంగా కుంటుపడుతూ ప్రధాన దేశాలన్నీ మాంద్యం వైపు అడుగులేస్తున్నాయి.... (డి.శ్రీనివాసరెడ్డి) ప్రపంచం ఆర్థిక మాంద్యం బారిన పడటం ఖాయమని ఫ్లోరిడాకు చెందిన నెడ్ డేవిస్ రీసెర్చ్ చెబుతోంది. మాంద్యాన్ని అంచనా వేయడంలో ఈ సంస్థ అందెవేసిన చేయి. దాని లెక్క ప్రకారం వచ్చే ఏడాదికల్లా ప్రపంచం మాంద్యం గుప్పెట్లో చిక్కేందుకు 98.1 శాతం ఆస్కారముంది. వాల్‌స్ట్రీట్ జర్నల్ జూలైలో చేసిన సర్వేలో మాంద్యం తప్పదని 49 శాతం ఆర్థికవేత్తలు పేర్కొనగా అక్టోబర్‌లో వారి సంఖ్య 63 శాతానికి పెరిగింది! 12 నెలల్లోపే అమెరికా మాంద్యం కోరల్లో చిక్కడం ఖాయమని సర్వే తేల్చింది. వర్ధమాన దేశాలపై ఇది సుదీర్ఘ ప్రభావమే చూపవచ్చని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ మాల్ఫాస్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా, యుద్ధం, వాతావరణ విపరణామాలు ప్రపంచాన్ని అంధకారంలోకి నెడుతున్నాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి ఎండీ క్రిస్టలినా జార్జివా హెచ్చరించారు. కుంటినడకన ఆర్థికం... చాలా దేశాల్లో జీడీపీ వృద్ధిరేటు నానాటికీ పడిపోతోంది. 2022లో ప్రపంచ ఆర్థిక పురోగతి రేటు 6.1 శాతముంటే 2023 నాటికి ఏకంగా సగానికి సగం పడిపోయి 3.2 శాతానికి పరిమితం కావచ్చని ఐఎంఎఫ్ అంచనా వేసింది. సంపన్న దేశాల ఆర్థిక వృద్ధి కూడా నేల చూపులే చూస్తోంది. యూరప్ జీడీపీ 1.2 శాతానికి, బ్రిటన్ కేవలం 0.3, ఫ్రాన్స్ 0.7కు పరిమితం కావచ్చని అంచనా. సవరించిన వృద్ధి రేట్ల ప్రకారం చూసినా అమెరికా 1 శాతం, చైనా 3.2 శాతంతో సరిపెట్టుకునేలా ఉన్నాయి. 2016తో పోలిస్తే ప్రపంచ జీడీపీ 23 శాతం పెరగాలన్నది అంచనా కాగా కరోనా, యుద్ధం తదితరాల దెబ్బకు 17 శాతానికే పరిమితమైంది. ఇలా పడిపోయిన ఉత్పాదకత విలువ ఏకంగా 17 లక్షల కోట్ల డాలర్లు. అంటే ప్రపంచ ఆదాయంలో ఏకంగా 20 శాతం! ఎందుకీ దుస్థితి...? కరోనా, యుద్ధం నేపథ్యంలో విపరీతంగా పెరిగిపోయిన ధరలకు కళ్లెం వేసేందుకు ఈ ఏడాది ఏకంగా 90 దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచేశాయి. ఈ దెబ్బకు ఉత్పాదకత తగ్గడంతో పెట్టుబడులు, వినియోగం పడిపోయి మాంద్యం ముంచుకొస్తోంది. ధరల అదుపు కోసమని పదేపదే వడ్డీ రేట్లు పెంచితే మాంద్యం బారిన పడక తప్పదని జార్జ్ వాషింగ్టన్ వర్సిటీ ప్రొఫెసర్ పావ్లిన్ టియెన్ అన్నారు. అమెరికా ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్ల పెంపుతో 90 దేశాల కరెన్సీ విలువలు పతనమయ్యాయి. గతేడాది 125.7గా ఉన్న ఆహారోత్పత్తుల ధరల సూచీ ఈ ఏడాది 146.94 పాయింట్లకు పెరిగింది. మాంద్యం దెబ్బకు కంపెనీలు నియామకాలకు కత్తెర వేస్తున్నాయి. అమెరికాలో నిరుద్యోగిత వచ్చే డిసెంబర్ నాటికి 3.7 శాతానికి, 2023 జూన్‌కల్లా 4.7కు పెరుగుతుందని అంచనా. మాంద్యమంటే... మామూలు పరిభాషలో వరుసగా రెండు త్రైమాసికాలు గనక జీడీపీ తిరోగమనంలో సాగితే ఆ దేశంలో మాంద్యంలోకి జారుకున్నట్టు పరిగణిస్తారు. ఇవీ సంకేతాలు... ► సుదీర్ఘంగా సాగేలా కన్పిస్తున్న రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ► డాలర్ ముందు కుదేలవుతున్న అన్ని దేశాల కరెన్సీలు ► చుక్కలనంటుతున్న ద్రవ్యోల్బణం ► వడ్డీరేట్లను పెంచేస్తున్న అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు ► నియామకాలు బాగా తగ్గిస్తున్న కార్పొరేట్ సంస్థలు ► నానాటికీ మందగిస్తున్న ప్రపంచ ఆర్థిక వృద్ధి మనకూ తిప్పలే... మన జీడీపీ వృద్ధి రేటు ఈ ఏడాది 6.8 శాతం ఉంటుందని, 2023లో 6.1 శాతానికి తగ్గుతుందని ఐఎంఎఫ్ నివేదిక పేర్కొంది. ఇతర దేశాలతో పోలిస్తే ఇది మెరుగేనని కితాబిచ్చింది. కానీ మాంద్యం ఎఫెక్ట్ భారత్‌పైనా గట్టిగానే ఉంటుందని అంచనా. అమెరికాకు మన ఎగుమతులు 2011 10.1 శాతముంటే ఇప్పుడు 18.1 శాతానికి పెరిగాయి. మన సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో ఏకంగా 54.8 శాతం అమెరికాకే వెళ్తున్నాయి. అగ్రరాజ్యం మాంద్యంలో చిక్కితే వీటిపై గట్టి ప్రభావమే పడుతుంది. మన విదేశీ మారక నిల్వలు వరుసగా తొమ్మిదో వారమూ తిరోగమన దిశలో ఉన్నట్టు అక్టోబర్ 7నాటి నివేదికలో రిజర్వ్ బ్యాంకే పేర్కొంది. అమెరికాతో భారత వాణిజ్య లోటు 3.8 శాతానికి ఎగబాకుతుందని అంచనా! -
మార్కెట్లో మాంద్యం భయాలు
ముంబై: ఆర్థిక మాంద్యం తలెత్తవచ్చనే భయాలతో శుక్రవారం దలాల్ స్ట్రీట్‌లో అమ్మకాలు పోటెత్తాయి. ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల సంకేతాలు సెంటిమెంట్‌పై మరింత ఒత్తిడిని పెంచాయి. ట్రేడింగ్ ఆద్యంతం అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో స్టాక్ సూచీలు రెండుశాతం క్షీణించాయి. సెన్సెక్స్ 1,093 పాయింట్లు క్షీణించి 58,840 వద్ద ముగిసింది. ఈ సూచీలో మొత్తం నాలుగు మాత్రమే లాభపడ్డాయి. నిఫ్టీ 347 పాయింట్లను కోల్పోయి 17,531 వద్ద నిలిచింది. నిఫ్టీ 50 షేర్లలో సిప్లా, ఇండస్ ఇండ్ షేర్లు మాత్రమే లాభంతో గట్టెక్కాయి. ఐటీ, ఆటో, రియల్టీ షేర్లు భారీగా నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ మూడు శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ రెండుశాతం చొప్పున క్షీణించాయి. ట్రెజరీ బాండ్లపై రాబడులు, డాలర్ ఇండెక్స్ పెరగడంతో పెరుగుదలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. గడిచిన మూడు నెలల్లో సూచీలు ఒకవారంలో అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. ఈ వారం మొత్తంగా సెన్సెక్స్ 952 పాయింట్లు, నిఫ్టీ 303 పాయింట్లను కోల్పోయాయి. ట్రేడింగ్ ఆద్యంత అమ్మకాలే... ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్ ఉదయం నష్టంతో మొదలైంది. సెన్సెక్స్ 349 పాయింట్లు పతనమై 59,585 వద్ద, నిఫ్టీ 80 పాయింట్లు క్షీణించి 17,797 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. జాతీయ, అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉండటంతో ఇన్వెస్టర్లు ట్రేడింగ్ ఆద్యంతం అమ్మకాలకే మొగ్గుచూపారు. ఒక దశలో సెన్సెక్స్ 1247 పాయింట్లను కోల్పోయి 58,687 వద్ద, నిఫ్టీ 380 పాయింట్ల నష్టాన్ని చవిచూసి 17,497 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. కాగా, సెన్సెక్స్ భారీ నష్టంతో శుక్రవారం ఒక్క రోజే ఇన్వెస్టర్లకు రూ.6.18 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. ఇదే సూచీ గడిచిన మూడు రోజుల్లో 1,730 పాయింట్లను కోల్పోవడంతో మొత్తం రూ.7 లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది. వెరసి బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.285.90 లక్షల కోట్ల నుంచి రూ.279.80 లక్షల కోట్లకు దిగివచ్చింది. నష్టాలు ఎందుకంటే అంతర్జాతీయంగా మాంద్యం వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ హెచ్చరించడంతో భారత్‌తో సహా ప్రపంచ మార్కెట్లన్నీ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ద్రవ్యోల్బణ కట్టడికి కేంద్ర బ్యాంకులు కఠిన ద్రవ్య విధాన అమలుకు సిద్ధమతున్న వేళ.., వడ్డీరేట్ల పెంపుతో ఆర్థిక మాంద్యం ముంచుకురావచ్చనే ఆందోళనలు ఇన్వెస్టర్లను కలవరపెట్టాయి. దేశీయంగా ఆగస్టులో ద్రవ్యోల్బణం మళ్లీ ఎగువబాట పట్టడం ఆందోళన కలిగించింది -
తైవాన్‌పై జోక్యం చేసుకోవద్దు
బీజింగ్: తైవాన్‌తో తమ సంబంధాల విషయంలో జోక్యం చేసుకోవద్దని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను చైనా అధినేత జిన్‌పింగ్ గట్టిగా హెచ్చరించారు. వ్యూహాత్మక కారణాలతో ప్రపంచంలోని రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య విభేదాలు మంచిది కాదని కూడా జిన్ పింగ్ పేర్కొన్నట్లు చైనా వెల్లడించింది. ఇలాంటి వైఖరి ప్రపంచ ఆర్థిక పురోగతిపై పెను ప్రభావం చూపుతుందన్నారు. ‘చైనా ప్రధాన భూభాగం నుంచి వేరుపడేలా తైవాన్ను ప్రేరేపించే వెలుపలి శక్తులను ఎదుర్కొంటాం. 140 కోట్ల చైనా ప్రజల అభీష్టమైన సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకుంటాం. నిప్పుతో ఆడాలనుకుంటే భస్మం అవుతారు’అంటూ గట్టి హెచ్చరికలు పంపింది. ఒకే చైనా విధానాన్ని అమెరికా గౌరవించాలని పేర్కొంది. ఆర్థిక మాంద్యం ప్రమాదాన్ని తగ్గించడం, స్థూల ఆర్థిక విధానాలను సమన్వయం చేయడం, కోవిడ్‌తో పోరాటం, ప్రాంతీయ ఉద్రిక్తలను తగ్గించుకోవడం వంటి వాటిపై సహకరించాలని అమెరికాను జిన్‌పింగ్ కోరారని చైనా ఒక ప్రకటనలో వివరించింది. గురువారం ఈ ఇద్దరు నేతలు దాదాపు మూడు గంటలపాటు సుదీర్ఘంగా ఫోన్ సంభాషణ జరిపిన విషయం తెలిసిందే. మరోవైపు అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ స్పీకర్ నాన్సీ పెలోసీ త్వరలో తైవాన్ సందర్శిస్తారంటూ వస్తున్న వార్తలపై చైనాలింకా స్పందించలేదు. అయితే, బైడెన్, జిన్‌పింగ్ నవంబర్‌లో ఇండొనేసియాలో జరిగే జి–20 భేటీలో ముఖాముఖి సమావేశమయ్యే అవకాశాలున్నాయని అమెరికా అధికారి ఒకరు తెలిపారు. -
గ్రానైట్ పరిశ్రమలపై ఆర్థిక మాంద్యం ప్రభావం..
మార్టూరు, న్యూస్‌లైన్: ఏటా వేసవిలో విద్యుత్ సరఫరా సక్రమంగా లేక గ్రానైట్ ఎగుమతులు తగ్గి పరిశ్రమల యజమానులు నష్టాలను చవిచూసేవారు. కానీ ఈ ఏడాది వేసవి రాకముందే గ్రానైట్ కటింగ్ యూనిట్ల యజమానులకు ఆర్థిక సంక్షోభం మొదలైంది. దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం ప్రభావం, రూపాయి విలువ పడిపోవడం, భవన నిర్మాణాలు నిలిచిపోవడం, ముడి సరుకు ధరలు పెరగడంతో పరిశ్రమలు మాంద్యం దెబ్బ నష్టాల ఊబిలోకి వెళ్లాయి. మార్టూరు గ్రామం గ్రానైట్ కటింగ్ యూనిట్లకు రాష్ట్రంలోనే పేరెన్నికగంది. చిన్న, పెద్దవి కలిపి 250 వరకు గ్రానైట్ రాయి కటింగ్ యూనిట్లున్నాయి. ఒక్కో యూనిట్ పెట్టడానికి కోటిన్నర వరకు ఖర్చవుతుంది. 10 వేల మంది కూలీలు కర్ణాటక, ఒరిస్సా, రాజస్థాన్, బెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడి పరిశ్రమల్లో ఉపాధి పొందుతున్నారు. అన్ని పరిశ్రమల్లో కలిపి రోజువారీ రాయి ఉత్పత్తి సుమారు 20 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు ఉంటుంది. మార్టూరు ప్రాంతంలోని గ్రానైట్ పరిశ్రమల నుంచి గతంలో నెలకు సుమారు రూ. 25 కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిగేవి. అయితే ఈ ఏడాది పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. నెలకు రూ. 10 కోట్ల మేర కూడా వ్యాపారాలు జరగడం లేదు. గ్రానైట్ ముడిరాయి ధరలను క్యూబిక్ మీటరుకు రూ. 14 వేల నుంచి రూ. 15 వేలకు క్వారీ యజమానులు పెంచారు. దానికితోడు విద్యుత్ బిల్లుల బాదుడు పెరిగిపోయింది. కేటగిరీ 3 కింద ఉండే విద్యుత్ బిల్లులను ప్రభుత్వం హెచ్ టీ కేటగిరీ కింద మార్చింది. దీంతో గతంలో ఒక్కొక్క పరిశ్రమకు సుమారు లక్ష వరకు వచ్చే బిల్లు లక్షా నలభైవేల వరకు వస్తోంది. గతంలో 1 కేవీ రూ. 150 ఉండే విద్యుత్ బిల్లు రూ. 350 వరకు పడుతోంది. కనీస చార్జీలు కూడా పెరగడంతో గ్రానైట్ పరిశ్రమల యజమానుల్లో ఆందోళన నెలకొంది. భవన నిర్మాణాల తగ్గుదలా మాంద్యానికి కారణమే.. మన రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో భవన నిర్మాణాలు నిలిచిపోయాయి. మార్టూరు నుంచి మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాలకు గ్రానైట్ ఎగుమతులు అవుతుంటాయి. అక్కడ కూడా ఇసుక సమస్య, ఆర్థికమాంద్యం ప్రభావంతో బిల్డర్లు నిర్మాణాలు చేపట్టడానికి ముందుకు రావడం లేదు. దీంతో పరిశ్రమ సంక్షోభంలో పడింది. ఏ ఫ్యాక్టరీలో చూసినా కోసిన గ్రానైట్ రాయి నిల్వలు పేరుకుపోయాయి. మార్టూరు సమీప మండలాల్లో బల్లికురవ, గురిజేపల్లి ప్రాంతాల్లో క్వారీలు ఉండటంతో ముడిరాయి కొరత లేకపోయినా, ఎగుమతులు లేక గ్రానైట్ పరిశ్రమల యజమానులు ఆందోళన చెందుతున్నారు. పరిశ్రమలు నడపటం ఆపితే కూలీల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని, నడిపితే బ్యాంకులో తెచ్చిన రుణాలు కూడా కట్టలేమని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రానైట్ పరిశ్రమను సంక్షోభం నుంచి బయట పడేసేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని, ఇదే పరిస్థితి కొనసాగితే పరిశ్రమలు మూసేయక తప్పదని ఆవేదన చెందుతున్నారు. పరిశ్రమపై డీజిల్ ధరల ప్రభావం డీజిల్ ధరలు పెరగడంతో ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే గ్రానైట్ రవాణా చార్జీలు పెరిగాయి. దీనికితోడు క్వారీల్లో మిషనరీలు నడవటానికి కూడా డీజిల్ ఎక్కువ మొత్తంలో వాడాల్సి ఉండటంతో ఆ భారం కూడా ఫ్యాక్టరీల యజమానులపై పడుతోంది. డీజిల్ ధరలు పెరిగినప్పుడల్లా క్వారీ యజమానులు ముడిరాయి ధరలు పెంచుతున్నారని కంపెనీల యజమానులు చెబుతున్నారు. ఇప్పుడు వచ్చిన సంక్షోభం నుంచి తేరుకోవాలంటే సుమారు రెండేళ్లు పడుతుంది వారు వాపోతున్నారు. గ్రానైట్ పరిశ్రమలపై ఆర్థిక మాంద్యం ప్రభావం కంభంపాటి వెంకట్రావు, గ్రానైట్ పరిశ్రమ యజమాని ఆర్థిక మాంద్యం ప్రభావం గ్రానైట్ పరిశ్రమలపై పడింది. ముడిరాయి ధరలు పెరిగాయి. ఇతర రాష్ట్రాలకు గ్రానైట్ ఉత్పత్తుల ఎగుమతులు తగ్గాయి. విద్యుత్ బిల్లులు కూడా గతంలో కన్నా రెండు రెట్లు పెరిగాయి. అయినా ఎగుమతులు నిలిచిపోవడంతో పరిశ్రమలు మూసివేసే పరిస్థితి ఏర్పడింది. గ్రానైట్ ఎగుమతులు పూర్తిగా మందగించాయి వేములపల్లి శ్రీనివాసరావు, మార్టూరు గ్రానైట్ ఫ్యాక్టరీస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఈ ఏడాది ఎగుమతులు మందగించడంతో పరిశ్రమలు పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. బ్యాంకుల్లో తెచ్చిన కిస్తీలు చెల్లించలేకపోతున్నారు. గతంలో ఎన్నడూ ఇంత తక్కువ ఎగుమతులు చూడలేదు. ప్రభుత్వం పరిశ్రమల గురించి పట్టించుకోవడం లేదు. దానికి తోడు విద్యుత్ చార్జీలను పెంచారు. పరిశ్రమలు ఆపితే కార్మికులు వెళ్లిపోతారని నడుపుతున్నాం. ఎక్కడి సరుకు అక్కడే నిలిచిపోతోంది. ఈ మాంద్యం నుంచి కోలుకోవాలంటే సుమారు రెండేళ్లు పడుతుంది.