మార్టూరు, న్యూస్‌లైన్: ఏటా వేసవిలో విద్యుత్ సరఫరా సక్రమంగా లేక గ్రానైట్ ఎగుమతులు తగ్గి పరిశ్రమల యజమానులు నష్టాలను చవిచూసేవారు. కానీ ఈ ఏడాది వేసవి రాకముందే గ్రానైట్ కటింగ్ యూనిట్ల యజమానులకు ఆర్థిక సంక్షోభం మొదలైంది. దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం ప్రభావం, రూపాయి విలువ పడిపోవడం, భవన నిర్మాణాలు నిలిచిపోవడం, ముడి సరుకు ధరలు పెరగడంతో పరిశ్రమలు మాంద్యం దెబ్బ నష్టాల ఊబిలోకి వెళ్లాయి. మార్టూరు గ్రామం గ్రానైట్ కటింగ్ యూనిట్లకు రాష్ట్రంలోనే పేరెన్నికగంది. చిన్న, పెద్దవి కలిపి 250 వరకు గ్రానైట్ రాయి కటింగ్ యూనిట్లున్నాయి.
ఒక్కో యూనిట్ పెట్టడానికి కోటిన్నర వరకు ఖర్చవుతుంది. 10 వేల మంది కూలీలు కర్ణాటక, ఒరిస్సా, రాజస్థాన్, బెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడి పరిశ్రమల్లో ఉపాధి పొందుతున్నారు. అన్ని పరిశ్రమల్లో కలిపి రోజువారీ రాయి ఉత్పత్తి సుమారు 20 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు ఉంటుంది. మార్టూరు ప్రాంతంలోని గ్రానైట్ పరిశ్రమల నుంచి గతంలో నెలకు సుమారు రూ. 25 కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిగేవి. అయితే ఈ ఏడాది పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. నెలకు రూ. 10 కోట్ల మేర కూడా వ్యాపారాలు జరగడం లేదు. గ్రానైట్ ముడిరాయి ధరలను క్యూబిక్ మీటరుకు రూ. 14 వేల నుంచి రూ. 15 వేలకు క్వారీ యజమానులు పెంచారు. దానికితోడు విద్యుత్ బిల్లుల బాదుడు పెరిగిపోయింది. కేటగిరీ 3 కింద ఉండే విద్యుత్ బిల్లులను ప్రభుత్వం హెచ్ టీ కేటగిరీ కింద మార్చింది. దీంతో గతంలో ఒక్కొక్క పరిశ్రమకు సుమారు లక్ష వరకు వచ్చే బిల్లు లక్షా నలభైవేల వరకు వస్తోంది. గతంలో 1 కేవీ రూ. 150 ఉండే విద్యుత్ బిల్లు రూ. 350 వరకు పడుతోంది. కనీస చార్జీలు కూడా పెరగడంతో గ్రానైట్ పరిశ్రమల యజమానుల్లో ఆందోళన నెలకొంది.
భవన నిర్మాణాల తగ్గుదలా మాంద్యానికి కారణమే..
మన రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో భవన నిర్మాణాలు నిలిచిపోయాయి. మార్టూరు నుంచి మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాలకు గ్రానైట్ ఎగుమతులు అవుతుంటాయి. అక్కడ కూడా ఇసుక సమస్య, ఆర్థికమాంద్యం ప్రభావంతో బిల్డర్లు నిర్మాణాలు చేపట్టడానికి ముందుకు రావడం లేదు. దీంతో పరిశ్రమ సంక్షోభంలో పడింది. ఏ ఫ్యాక్టరీలో చూసినా కోసిన గ్రానైట్ రాయి నిల్వలు పేరుకుపోయాయి. మార్టూరు సమీప మండలాల్లో బల్లికురవ, గురిజేపల్లి ప్రాంతాల్లో క్వారీలు ఉండటంతో ముడిరాయి కొరత లేకపోయినా, ఎగుమతులు లేక గ్రానైట్ పరిశ్రమల యజమానులు ఆందోళన చెందుతున్నారు. పరిశ్రమలు నడపటం ఆపితే కూలీల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని, నడిపితే బ్యాంకులో తెచ్చిన రుణాలు కూడా కట్టలేమని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రానైట్ పరిశ్రమను సంక్షోభం నుంచి బయట పడేసేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని, ఇదే పరిస్థితి కొనసాగితే పరిశ్రమలు మూసేయక తప్పదని ఆవేదన చెందుతున్నారు.
పరిశ్రమపై డీజిల్ ధరల ప్రభావం
డీజిల్ ధరలు పెరగడంతో ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే గ్రానైట్ రవాణా చార్జీలు పెరిగాయి. దీనికితోడు క్వారీల్లో మిషనరీలు నడవటానికి కూడా డీజిల్ ఎక్కువ మొత్తంలో వాడాల్సి ఉండటంతో ఆ భారం కూడా ఫ్యాక్టరీల యజమానులపై పడుతోంది. డీజిల్ ధరలు పెరిగినప్పుడల్లా క్వారీ యజమానులు ముడిరాయి ధరలు పెంచుతున్నారని కంపెనీల యజమానులు చెబుతున్నారు. ఇప్పుడు వచ్చిన సంక్షోభం నుంచి తేరుకోవాలంటే సుమారు రెండేళ్లు పడుతుంది వారు వాపోతున్నారు.
గ్రానైట్ పరిశ్రమలపై ఆర్థిక మాంద్యం ప్రభావం
కంభంపాటి వెంకట్రావు, గ్రానైట్ పరిశ్రమ యజమాని
ఆర్థిక మాంద్యం ప్రభావం గ్రానైట్ పరిశ్రమలపై పడింది. ముడిరాయి ధరలు పెరిగాయి. ఇతర రాష్ట్రాలకు గ్రానైట్ ఉత్పత్తుల ఎగుమతులు తగ్గాయి. విద్యుత్ బిల్లులు కూడా గతంలో కన్నా రెండు రెట్లు పెరిగాయి. అయినా ఎగుమతులు నిలిచిపోవడంతో పరిశ్రమలు మూసివేసే పరిస్థితి ఏర్పడింది.
గ్రానైట్ ఎగుమతులు పూర్తిగా మందగించాయి
వేములపల్లి శ్రీనివాసరావు, మార్టూరు గ్రానైట్ ఫ్యాక్టరీస్ అసోసియేషన్ అధ్యక్షుడు
ఈ ఏడాది ఎగుమతులు మందగించడంతో పరిశ్రమలు పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. బ్యాంకుల్లో తెచ్చిన కిస్తీలు చెల్లించలేకపోతున్నారు. గతంలో ఎన్నడూ ఇంత తక్కువ ఎగుమతులు చూడలేదు. ప్రభుత్వం పరిశ్రమల గురించి పట్టించుకోవడం లేదు. దానికి తోడు విద్యుత్ చార్జీలను పెంచారు. పరిశ్రమలు ఆపితే కార్మికులు వెళ్లిపోతారని నడుపుతున్నాం. ఎక్కడి సరుకు అక్కడే నిలిచిపోతోంది. ఈ మాంద్యం నుంచి కోలుకోవాలంటే సుమారు రెండేళ్లు పడుతుంది.
గ్రానైట్ పరిశ్రమలపై ఆర్థిక మాంద్యం ప్రభావం..
Published Sun, Sep 29 2013 3:45 AM | Last Updated on Fri, Sep 1 2017 11:08 PM
Advertisement
Advertisement