granite industries
-
ఉపాధికి గడ్డుకాలం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వ్యవసాయం, మత్స్యకార రంగాల తర్వాత శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా ఉపాధి దొరికేది గ్రానైట్ పరిశ్రమల్లోనే. ఇప్పుడా పరిశ్రమలు మూతబడ్డాయి. నూతన పాలసీ పేరుతో గ్రానైట్ పరిశ్రమలను ప్రభుత్వమే మూసివేయించింది. రెండు నెలలుగా గ్రానైట్ ఫ్యాక్టరీల్లో పనులు జరగడం లేదు. ఉపాధి లేక కార్మికులు పస్తులుండాల్సిన పరిస్థితి. వారి ఆకలికేకలను జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు.ఇప్పట్లో పరిశ్రమలు తెరుచుకునే పరిస్థితి లేదని భావిస్తున్న కార్మికులు.. మళ్లీ వలస బాట పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో సుమారు 150 క్వారీలు ఉన్నాయి. వాటికి అనుసంధానంగా మరో 150 పాలిíÙంగ్ యూనిట్లు, 30 క్రషర్లు ఉన్నాయి. వీటి ద్వారా ప్రత్యక్షంగా సుమారు 25 వేల మంది, పరోక్షంగా 45 వేల మంది ఉపాధి పొందుతున్నారు. వీరిలో జిల్లాకు చెందిన వారే కాకుండా ఒడిశా, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, పశి్చమ బెంగాల్‌కు చెందిన వారు కూడా ఉన్నారు. కూటమి నేతల పెత్తనం.. టీడీపీ అధికారంలోకి వచి్చన వెంటనే గ్రానైట్ పరిశ్రమలపై కూటమి నేతల పెత్తనం మొదలైంది. మళ్లీ తాము చెప్పేవరకు గ్రానైట్ పరిశ్రమల్లో ఎటువంటి కార్యకలాపాలు చేపట్టకూడదని అధికారవర్గాల ద్వారా ఆదేశించారు. దీనికి నూతన గ్రానైట్ పాలసీ అనే ముసుగు తొడిగారు. పర్మిట్లను ఇవ్వకుండా నిలిపేశారు. దీంతో గ్రానైట్ క్వారీలతో పాటు వాటి అనుబంధ యూనిట్లు అన్నీ రెండు నెలల క్రితమే మూతపడ్డాయి. దీంతో వాటిపై ఆధారపడ్డ కార్మికులంతా గగ్గోలు పెడుతున్నారు.ఈ సంక్షోభం ఒక్క కార్మికులపైనే కాదు యాజమాన్యాలపైనా ప్రభావం చూపింది.. ఇక్కడ గ్రానైట్ బ్లాకులు ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్లేవి. ప్రస్తుతం విక్రయాలు నిలిచిపోయాయి. ఈ ప్రభుత్వం ఏర్పడక ముందు తీసిన బ్లాక్‌లు ఆరు బయటే ఉండిపోవటంతో కలర్ మారి మార్కెట్లో విలువ తగ్గిపోయేలా ఉంది. ఫలితంగా గ్రానైట్ పరిశ్రమ తీవ్ర నష్టాల్లో కూరుకుపోనుంది. అటు కార్మికుల ఆకలికేకలు, ఇటు యాజమాన్యాల నష్టాలను క్షేత్రస్థాయిలో ‘సాక్షి’ పరిశీలించింది. కార్మికుల వేదన వర్ణనాతీతం గ్రానైట్ పరిశ్రమలు ఎక్కువగా ఉన్న టెక్కలి మండలంలో కార్మికుల వేదన వర్ణనాతీతంగా ఉంది. బొరిగిపేట సమీపంలోని ఓ క్వారీ సూపర్వైజర్ మాట్లాడుతూ.. తాను టీడీపీ అభిమానినని, కూటమి ప్రభుత్వం వచ్చాక తమకు మంచి జరుగుతుందని భావిస్తే చివరకు కడుపుకొట్టారని చెప్పారు.పరిశ్రమలు తెరిపించండి అని కోరడానికి ఇక్కడి మంత్రి వద్దకు వెళితే.. పరిశ్రమ తెరవకపోతే తినడం మానేస్తావా అంటూ వ్యంగ్యంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. జీడిపేట, మెలియాపుట్టి, దీనబంధుపురం, సవర, జాడుపల్లి, నిమ్మాడ తదితర గ్రామాల్లో నివసించే కార్మికుల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. ఫ్యాక్టరీలు ఆపేసి తమ ఉపాధిపై దెబ్బకొట్టి పస్తులు పెట్టడం ఏంటని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కాసుల కక్కుర్తి కోసమే.. గ్రానైట్ పరిశ్రమల నుంచి కాసులు ఆశించే ఇలా చేస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. వాస్తవంగా 2014–19లో గ్రానైట్ కార్యకలాపాలన్నీ మంత్రి సోదరుడు కనుసన్నల్లోనే జరిగేవి. వారి కుటుంబానికి కూడా గ్రానైట్ అనుబంధ పరిశ్రమలు ఉండటంతో వాటి ముసుగులో చక్రం తిప్పేవారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక వారి పప్పులు ఉడకలేదు. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి రావడంతో గ్రానైట్ కంపెనీలపై పెత్తనం కోసం ప్రయతి్నస్తున్నారు. దానికి నూతన పాలసీ అంటూ బూచిగా చూపిస్తున్నారు అని కార్మిక వర్గాలు చెబుతున్నాయి. ఉపాధి పోయింది మా ఊరికి దగ్గరలో మేలిసతివాడ వద్ద క్వారీలో జాకీ లేబర్‌గా పనిచేస్తుండేవాడిని. క్వారీలు నడవక ఉపాధి పోయింది. ఈ ప్రభుత్వం వచ్చాక మా లాంటి పేదలకు పెద్ద ఇబ్బందులు వచ్చాయి. గత ప్రభుత్వంలో బాగానే క్వారీలు నడచి జీతాలు వచ్చాయి. –కొర్రాయి నారాయణ, జీడిపేట, వీకేజీ క్వారీ మేలిసతివాడగ్రానైట్ కార్మికులను రోడ్డున పడేశారు కూటమి ప్రభుత్వం గ్రానైట్ క్వారీల నిర్వాహణపై ఆంక్షలు పెట్టింది. దీని వలన జిల్లాలోని క్వారీలు, వాటికి అనుసంధానంగా ఉన్న పాలిషింగ్ యూనిట్లు, క్రషర్లు ఆగిపోయాయి. దీంతో వేలాది మంది కార్మికులు నడిరోడ్డున పడ్డారు. జిల్లాలో ఇటువంటి పరిస్థితి ఇంతకు ముందెన్నడూ లేదు. దీని వలన జిల్లాలో వలసలు ఆరంభమయ్యాయి. జిల్లాలో వ్యవసాయ కార్మికులు, నిరుద్యోగ యువతకు ఉపాధికి ఆసరాగా ఉన్న గ్రానైట్ రంగాన్ని కుదేలు చేస్తున్నారు. –షణ్ముఖరావు, గ్రానైట్ కార్మికుల యూనియన్ జిల్లా నాయకుడుపని లేదు.. బత్తాలు లేవు ఈ ప్రభుత్వం వచ్చాక క్వారీలన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. దీని వలన పని లేదు. బత్తాలు లేక ఇబ్బందులు పడుతున్నాం. ఈ రోజు రేపు అని చెబుతున్నారు కానీ క్వారీలు తెరవడం లేదు. పని లేక పస్తులుంటున్నాం. –ముఖలింగాపురం అప్పారావు, జాకీ లేబర్, ప్రియాంక గ్రానైట్, జీడిపేట -
శాశ్వత భూసర్వే కోసం పెద్ద ఎత్తున సర్వేరాళ్ల తయారీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మొదటిసారిగా శాస్త్రీయ పద్ధతుల్లో జరుగుతున్న జగనన్న భూహక్కు భూరక్ష పథకం కోసం పెద్ద ఎత్తున సర్వే రాళ్లను గనులశాఖ సమకూరుస్తోందని ఏపీఎండీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వి.జి.వెంకటరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని రెండువేల గ్రానైట్ పరిశ్రమల్లో సర్వేరాళ్లు తయారుచేస్తున్నారని వెల్లడించారు. గతంలో ఆర్డర్లు లేక, ఆర్థికంగా చితికిపోయి మూతపడిన వేలాది గ్రానైట్ పరిశ్రమలకు ప్రభుత్వం సర్వేరాళ్ల తయారీ ఆర్డర్ ఇవ్వడంతో ఆ పరిశ్రమలకు తిరిగి జీవం వచ్చిందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గ్రానైట్ పరిశ్రమకు మంచి రోజులు రావాలని ప్రభుత్వపరంగా అనేక రాయితీలు ప్రకటించారని, స్లాబ్ విధానాన్ని కూడా అమల్లోకి తీసుకొచ్చారని గుర్తుచేశారు. దానికి అదనంగా సర్వేరాళ్ల తయారీని కూడా పరిశ్రమ నిర్వాహకులకు అప్పగించడం ద్వారా వారికి మరింత పనికల్పించారని పేర్కొన్నారు. సర్వేరాళ్లు గమ్యానికి చేరుకున్న వెంటనే బిల్లుల చెల్లింపు ముడిసరుకును గ్రానైట్ పరిశ్రమలకు అందించి, వారినుంచి నిర్దేశిత నమూనాలో సర్వేరాళ్లను తయారు చేయిస్తున్నామని తెలిపారు. సిద్ధమైన రాళ్ల నాణ్యతాప్రమాణాలను పరీక్షించి, వాటిని సూచించిన గమ్యస్థానానికి చేర్చిన వెంటనే గ్రానైట్ పరిశ్రమలకు బిల్లులు చెల్లిస్తున్నామని వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఇప్పటివరకు ఒక్క పరిశ్రమకు కూడా బిల్లుల బకాయిలు లేవని స్పష్టం చేశారు. బిల్లులు చెల్లించకపోవడం వల్ల గ్రానైట్ పరిశ్రమల నిర్వాహకుల్లో ఆందోళన అంటూ పత్రికల్లో వచ్చిన వార్త పూర్తిగా అసత్యమని, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన తెలిపారు. ఒక్కో సర్వేరాయికి రూ.300 గతంలో సిద్ధం చేసిన ఒక్కో సర్వేరాయికి ప్రభుత్వం రూ.270 చెల్లించేదని, దాన్ని ఇప్పుడు రూ.300కు పెంచామని అధికారులు తెలిపారు. దీంతో మరింత ఎక్కువమంది ఆర్డర్లు కా వాలని ఉత్సాహంగా ముందుకొస్తున్నారన్నారు. సర్వేరాళ్ల తయారీ, విక్రయాలు, రవాణా అంశాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా యాప్ రూపొందించినట్లు పేర్కొన్నా రు. ఈ యాప్‌లో అన్ని వివరాలు ఉంటాయని, గ్రానైట్ పరిశ్రమల నిర్వాహకులు కూడా దీన్లో లాగిన్ అయి తాము విక్రయించిన సర్వేరాళ్లకు బిల్లుల చెల్లింపులు ఎలా జరుగుతున్నాయో ఎప్పటికప్పుడు చూసుకునే అవకాశం కల్పించామని వివరించారు. సర్వేరాళ్ల తయారీలో గ్రానైట్ యజమానులపై ఆర్థికంగా భారం పడకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం సర్వేరాళ్లకు అవసరమైన బ్లాక్‌లను స్వయంగా గ్రానైట్ పరిశ్రమ యజమానులకు ఉచితంగా అందిస్తోందని తెలిపారు. కేవలం ఆ రాయిని సర్వేరాళ్లుగా తీర్చిదిద్దడం వరకే గ్రానైట్ పరిశ్రమ నిర్వాహకుల బాధ్యత అని తెలిపారు. ఇది పూర్తిచేసిన వెంటనే వారికి బిల్లులు చెల్లిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. -
గ్రానైట్ పరిశ్రమను ఆదుకునేందుకు శ్లాబ్ విధానం
-
చిన్నతరహా పరిశ్రమలను ఆదుకోవాలి
పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీ పొంగులేటి ఖమ్మం: పర్యావరణం అనుమతుల పేరుతో గ్రానైట్ పరిశ్రమలపై ఆంక్షలు విధించడంతో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని వైఎస్ఆర్సీపీ రాష్ర్ట అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఐదు హెక్టార్ల లోపు విస్తీర్ణం ఉన్న గ్రానైట్ పరిశ్రమలను పర్యావరణ అనుమతుల నుండి మినహాయింపు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం పార్లమెంట్లో ఎంపీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 80 శాతం పరిశ్రమలు తక్కువ విస్తీర్ణంలోనే ఉన్నాయన్నారు. ఈ పరిశ్రమల ఆధారంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాధి మంది కార్మికులు ఆధారపడి బతుకుతున్నారని అన్నారు. ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలతో చిన్నతరహా పరిశ్రమల యాజమాన్యాలు ఇబ్బందులు పడుతున్నాయని, పరిశ్రమలు సక్రమంగా నడవడం లేదన్నారు. మేజర్ ఖనిజా లు, మైనింగ్ ప్రాజెక్టుల లీజు ప్రాంతం 5 హెక్టార్లలోపు ఉంటే సుప్రీం కోర్టు పరిధిలో సడలించే అవకాశం ఉందన్నారు. అందువల్ల నిబంధనలు సడలించి గ్రానైట్ పరిశ్రమలను ఆదుకోవాలని కోరారు. ప్రశ్నలు సంధించిన ఎంపీ మందులు, వ్యాక్సిన్ తయారీ కేంద్రాల పర్యవేక్షణకు ఎన్ని కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయని ఆ వివరాలను వెల్లడించాలని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ పలు ప్రశ్నలను లిఖితపూర్వకంగా సంధిం చారు. దేశంలో నకిలీ మందుల ప్రభావం ఎక్కువ గా ఉండటం వల్ల వాటి తయారీ కేంద్రాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని అడిగారు. వాటిని పర్యవేక్షించడానికి ఎన్ని కంపెనీలు దరఖాస్తులు చేసుకున్నాయన్నారు. వాటిలో ఎన్నింటికి అనుమతులిచ్చారో వివరించాలని కోరారు. అలాగే పై పరిణామం వల్ల పరిశ్రమల నుంచి ఉత్పత్తి ఏమైనా తగ్గిందా..? తగ్గితే వాటి వివరాలు వెల్లడించాలని అడిగారు. కంపెనీలు దరఖాస్తు చేసుకునే ముందు డ్రగ్ రెగ్యులారిటీ అథారిటీ- వినియోగదారులకు మధ్య ఏమైనా చర్చలు జరుపుతుందా... అని ప్రశ్నించారు. దరఖాస్తులను పరిశీలించి త్వరతగతిన ఆమోదించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని కోరారు. సంబంధిత శాఖామంత్రి జగత్ ప్రకాశ్ అడ్డా సమాధానమిస్తూ 2012లో 480 దరఖాస్తులకు ప్రభుత్వం 253 ఆమోదించిందని, 2013లో 207 దరఖాస్తులకు 73కి ఆమోదం తెలిపిందని, 2014లో 230 దరఖాస్తులకు గాను 198కి అనుమతిచ్చిందని, ప్రస్తుత ఏడాదికి సంబంధించి 17 దరఖాస్తులు రాగా గత ఏడాది పెండింగ్‌లో ఉన్న వాటితో సహా మొత్తం 27 దరఖాస్తులను ఆమోదించిందని తెలిపారు. సెంట్రల్ డ్రగ్స్ అథారిటీ అసోసియేషన్ ద్వారా ఒక వెబ్‌సైట్‌ను నడుపుతున్నామని, అందులో దరఖాస్తు దారులకు పూర్తి సమాచారం లభ్యమవుతుందని వివరించారు. అలాగే మందుల తయారీ పరిశీలకులుగా చాలామంది అనుభవజ్ఞులను ప్రభుత్వం సెంట్రల్ డ్రగ్స్ అథారిటీలోకి చేర్చుకుందన్నారు. ఇన్సూరెన్స్ కంపెనీల విధానాలేంటి.? ఇన్సూరెన్స్ రెగ్యులారిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో కంపెనీల విధి విధానాల గురించి వివరించాలని ఎంపీ పొంగులేటి కోరారు. కంపెనీల విధి విధానాల పర్యవేక్షణలో భాగంగా ఏమైనా రివ్యూలు నిర్వహించడానికి ప్రతిపాదనలు చేశారా..? చేస్తే వాటి వివరాలను వెల్లడించాలని అడిగారు. కంపెనీల పనివిధానం మెరుగుపడటానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వివరించాలని కోరారు. సంబంధిత శాఖామంత్రి జయంత్ సిన్హా సమాధానమిస్తూ ఇన్సూరెన్స్ రెగ్యులారిటీ అథారిటీ యాక్ట్ సెక్షన్ 14 ప్రకారం విధివిధానాలను పొందుపరిచిందన్నారు. అందులో సెక్షన్ 20 ఐఆర్డీఏ యాక్ట్ ప్రకారం లైఫ్, జనరల్, రెన్యువల్ ఇన్సూరెన్స్ వివరాలను సంవత్సరాల వారీగా పొందుపరుస్తున్నామన్నారు. అప్రైజల్ ఆఫ్ ఇన్సూరెన్స్ మార్కెట్‌పైన, అథారిటీ ఇన్సూరెన్స్, అనాథరిటీ ఇన్సూరెన్స్‌లతోపాటు మార్కెట్ డెవలప్మెంట్ విధివిధానాలు పొందుపరచడం జరిగిందన్నారు. ఐఆర్డీఏ ఆధ్వర్యంలో అవగాహన పెంపొందించి వినియోగదారులను పెంచడానికి వివిధ రకాల విధివిధానాలను ప్రతిపాదించినట్లు వెల్లడించారు. వాణిజ్య పరంగా ఏయే దేశాలతో సంబంధాలున్నాయి..? వాణిజ్యపరంగా ఏయే దేశాలతో భారతదేశం సత్సంబంధాలను కొనసాగిస్తుందో తెలపాలని ఎంపీ శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. స్వేచ్ఛా వాణిజ్యం, ప్రాధాన్యత వాణిజ్యాలకు సంబంధించి ఏఏ దేశాలతో ఎలాంటి సంబంధాలు కొనసాగిస్తున్నారో... ప్రస్తుత సంవత్సరంతోపాటు గత మూడేళ్ల సమాచారం అందించాలని కోరారు. అలాగే ఇజ్రాయల్‌తోపాటు మరే దేశాల్లో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తుందా..? అలాగే దేశానికి మరిన్ని పెట్టుబడులు తెచ్చేలా ఏమైనా చర్యలు తీసుకుంటుందా..? అని ప్రశ్నించారు. ఒకవేళ చర్యలు తీసుకుంటే వాటి వివరాలను వెల్లడించాలని, చర్చలు జరిపేటప్పుడు స్థానిక వ్యాపారవేత్తల ప్రమేయం ఎంతవరకు ఉంటుందన్నారు. సంబంధిత శాఖ మంత్రి నిర్మల సీతారామన్ సమాధానమిస్తూ గత మూడేళ్లలో భారతదేశంలో ఎలాంటి వ్యాపారాలకు అగ్రిమెంట్లు కాలేదన్నారు. ఏషియన్ దేశాలతో మాత్రం 2014 సెప్టెంబర్ 9న ఒక అగ్రిమెంట్ జరిగిందని, దాన్ని 2015 జూలై 1న అమలు చేస్తామని స్పష్టంచేశారు. ఇజ్రాయల్‌తో పాటు మరిన్ని దేశాలతో వ్యాపార కార్యకలాపాలు కొనసాగించేందుకు చర్చలు జరుపుతున్నామన్నారు. స్వేచ్ఛా వాణిజ్యం నిరంతర ప్రక్రియ కాబట్టి దానికి అగ్రిమెంట్ ఉండదన్నారు. అలాగే చర్చలు జరిపే ముందు స్థానిక వ్యాపారవేత్తలను సంప్రదిస్తున్నామన్నారు. ఏదైనా నష్టం వాటిల్లే పరిస్థితి ఉంటే ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఏం చర్యలు ? రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని, దేశ వ్యాప్తంగా వాహనాల ఫిట్నెస్ తనిఖీ కేంద్రాల వివరాలు వెల్లడించాలని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి లేవనెత్తారు. కొత్తగా వాహనాల ఫిట్నెస్ తనిఖీ కేం ద్రాలకోసం ఏమైనా ప్రతిపాదనలు వచ్చాయా..? అని ప్రశ్నించారు. ఈ అంశంపై సంబంధిత కేంద్ర మంత్రి రాధాకృష్ణ సమాధానమిస్తూ ఫిట్నెస్ తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతూ దేశంలోని అన్ని రాష్ట్రాలకు లేఖ రాశామని వివరించారు. అందులో ఆంధ్రప్రదేశ్, బీహార్, చంఢీఘర్, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, మ హారాష్ట్ర, మిజోరాం ఒ డిస్సా, పంజాబ్, తమిళనాడు, పశ్చిబెంగాల్ రాష్ట్రాల నుంచి సమాధానం వచ్చిందన్నారు. కానీ తెలంగాణ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాధానమూ రాలేదన్నారు. సెంట్రల్ మానిటరింగ్ వెహికిల్ రూల్62 ప్రకారం ఫిట్నెస్ తనిఖీ కేంద్రాల ద్వారా రహదారుల ఫిట్నెస్ కూడా పరిశీలిస్తామని చెప్పారు. -
గ్రానైట్ పరిశ్రమలపై ఆర్థిక మాంద్యం ప్రభావం..
మార్టూరు, న్యూస్‌లైన్: ఏటా వేసవిలో విద్యుత్ సరఫరా సక్రమంగా లేక గ్రానైట్ ఎగుమతులు తగ్గి పరిశ్రమల యజమానులు నష్టాలను చవిచూసేవారు. కానీ ఈ ఏడాది వేసవి రాకముందే గ్రానైట్ కటింగ్ యూనిట్ల యజమానులకు ఆర్థిక సంక్షోభం మొదలైంది. దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం ప్రభావం, రూపాయి విలువ పడిపోవడం, భవన నిర్మాణాలు నిలిచిపోవడం, ముడి సరుకు ధరలు పెరగడంతో పరిశ్రమలు మాంద్యం దెబ్బ నష్టాల ఊబిలోకి వెళ్లాయి. మార్టూరు గ్రామం గ్రానైట్ కటింగ్ యూనిట్లకు రాష్ట్రంలోనే పేరెన్నికగంది. చిన్న, పెద్దవి కలిపి 250 వరకు గ్రానైట్ రాయి కటింగ్ యూనిట్లున్నాయి. ఒక్కో యూనిట్ పెట్టడానికి కోటిన్నర వరకు ఖర్చవుతుంది. 10 వేల మంది కూలీలు కర్ణాటక, ఒరిస్సా, రాజస్థాన్, బెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడి పరిశ్రమల్లో ఉపాధి పొందుతున్నారు. అన్ని పరిశ్రమల్లో కలిపి రోజువారీ రాయి ఉత్పత్తి సుమారు 20 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు ఉంటుంది. మార్టూరు ప్రాంతంలోని గ్రానైట్ పరిశ్రమల నుంచి గతంలో నెలకు సుమారు రూ. 25 కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిగేవి. అయితే ఈ ఏడాది పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. నెలకు రూ. 10 కోట్ల మేర కూడా వ్యాపారాలు జరగడం లేదు. గ్రానైట్ ముడిరాయి ధరలను క్యూబిక్ మీటరుకు రూ. 14 వేల నుంచి రూ. 15 వేలకు క్వారీ యజమానులు పెంచారు. దానికితోడు విద్యుత్ బిల్లుల బాదుడు పెరిగిపోయింది. కేటగిరీ 3 కింద ఉండే విద్యుత్ బిల్లులను ప్రభుత్వం హెచ్ టీ కేటగిరీ కింద మార్చింది. దీంతో గతంలో ఒక్కొక్క పరిశ్రమకు సుమారు లక్ష వరకు వచ్చే బిల్లు లక్షా నలభైవేల వరకు వస్తోంది. గతంలో 1 కేవీ రూ. 150 ఉండే విద్యుత్ బిల్లు రూ. 350 వరకు పడుతోంది. కనీస చార్జీలు కూడా పెరగడంతో గ్రానైట్ పరిశ్రమల యజమానుల్లో ఆందోళన నెలకొంది. భవన నిర్మాణాల తగ్గుదలా మాంద్యానికి కారణమే.. మన రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో భవన నిర్మాణాలు నిలిచిపోయాయి. మార్టూరు నుంచి మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాలకు గ్రానైట్ ఎగుమతులు అవుతుంటాయి. అక్కడ కూడా ఇసుక సమస్య, ఆర్థికమాంద్యం ప్రభావంతో బిల్డర్లు నిర్మాణాలు చేపట్టడానికి ముందుకు రావడం లేదు. దీంతో పరిశ్రమ సంక్షోభంలో పడింది. ఏ ఫ్యాక్టరీలో చూసినా కోసిన గ్రానైట్ రాయి నిల్వలు పేరుకుపోయాయి. మార్టూరు సమీప మండలాల్లో బల్లికురవ, గురిజేపల్లి ప్రాంతాల్లో క్వారీలు ఉండటంతో ముడిరాయి కొరత లేకపోయినా, ఎగుమతులు లేక గ్రానైట్ పరిశ్రమల యజమానులు ఆందోళన చెందుతున్నారు. పరిశ్రమలు నడపటం ఆపితే కూలీల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని, నడిపితే బ్యాంకులో తెచ్చిన రుణాలు కూడా కట్టలేమని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రానైట్ పరిశ్రమను సంక్షోభం నుంచి బయట పడేసేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని, ఇదే పరిస్థితి కొనసాగితే పరిశ్రమలు మూసేయక తప్పదని ఆవేదన చెందుతున్నారు. పరిశ్రమపై డీజిల్ ధరల ప్రభావం డీజిల్ ధరలు పెరగడంతో ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే గ్రానైట్ రవాణా చార్జీలు పెరిగాయి. దీనికితోడు క్వారీల్లో మిషనరీలు నడవటానికి కూడా డీజిల్ ఎక్కువ మొత్తంలో వాడాల్సి ఉండటంతో ఆ భారం కూడా ఫ్యాక్టరీల యజమానులపై పడుతోంది. డీజిల్ ధరలు పెరిగినప్పుడల్లా క్వారీ యజమానులు ముడిరాయి ధరలు పెంచుతున్నారని కంపెనీల యజమానులు చెబుతున్నారు. ఇప్పుడు వచ్చిన సంక్షోభం నుంచి తేరుకోవాలంటే సుమారు రెండేళ్లు పడుతుంది వారు వాపోతున్నారు. గ్రానైట్ పరిశ్రమలపై ఆర్థిక మాంద్యం ప్రభావం కంభంపాటి వెంకట్రావు, గ్రానైట్ పరిశ్రమ యజమాని ఆర్థిక మాంద్యం ప్రభావం గ్రానైట్ పరిశ్రమలపై పడింది. ముడిరాయి ధరలు పెరిగాయి. ఇతర రాష్ట్రాలకు గ్రానైట్ ఉత్పత్తుల ఎగుమతులు తగ్గాయి. విద్యుత్ బిల్లులు కూడా గతంలో కన్నా రెండు రెట్లు పెరిగాయి. అయినా ఎగుమతులు నిలిచిపోవడంతో పరిశ్రమలు మూసివేసే పరిస్థితి ఏర్పడింది. గ్రానైట్ ఎగుమతులు పూర్తిగా మందగించాయి వేములపల్లి శ్రీనివాసరావు, మార్టూరు గ్రానైట్ ఫ్యాక్టరీస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఈ ఏడాది ఎగుమతులు మందగించడంతో పరిశ్రమలు పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. బ్యాంకుల్లో తెచ్చిన కిస్తీలు చెల్లించలేకపోతున్నారు. గతంలో ఎన్నడూ ఇంత తక్కువ ఎగుమతులు చూడలేదు. ప్రభుత్వం పరిశ్రమల గురించి పట్టించుకోవడం లేదు. దానికి తోడు విద్యుత్ చార్జీలను పెంచారు. పరిశ్రమలు ఆపితే కార్మికులు వెళ్లిపోతారని నడుపుతున్నాం. ఎక్కడి సరుకు అక్కడే నిలిచిపోతోంది. ఈ మాంద్యం నుంచి కోలుకోవాలంటే సుమారు రెండేళ్లు పడుతుంది.