సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మొదటిసారిగా శాస్త్రీయ పద్ధతుల్లో జరుగుతున్న జగనన్న భూహక్కు భూరక్ష పథకం కోసం పెద్ద ఎత్తున సర్వే రాళ్లను గనులశాఖ సమకూరుస్తోందని ఏపీఎండీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వి.జి.వెంకటరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని రెండువేల గ్రానైట్ పరిశ్రమల్లో సర్వేరాళ్లు తయారుచేస్తున్నారని వెల్లడించారు. గతంలో ఆర్డర్లు లేక, ఆర్థికంగా చితికిపోయి మూతపడిన వేలాది గ్రానైట్ పరిశ్రమలకు ప్రభుత్వం సర్వేరాళ్ల తయారీ ఆర్డర్ ఇవ్వడంతో ఆ పరిశ్రమలకు తిరిగి జీవం వచ్చిందని తెలిపారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గ్రానైట్ పరిశ్రమకు మంచి రోజులు రావాలని ప్రభుత్వపరంగా అనేక రాయితీలు ప్రకటించారని, స్లాబ్ విధానాన్ని కూడా అమల్లోకి తీసుకొచ్చారని గుర్తుచేశారు. దానికి అదనంగా సర్వేరాళ్ల తయారీని కూడా పరిశ్రమ నిర్వాహకులకు అప్పగించడం ద్వారా వారికి మరింత పనికల్పించారని పేర్కొన్నారు.
సర్వేరాళ్లు గమ్యానికి చేరుకున్న వెంటనే బిల్లుల చెల్లింపు
ముడిసరుకును గ్రానైట్ పరిశ్రమలకు అందించి, వారినుంచి నిర్దేశిత నమూనాలో సర్వేరాళ్లను తయారు చేయిస్తున్నామని తెలిపారు. సిద్ధమైన రాళ్ల నాణ్యతాప్రమాణాలను పరీక్షించి, వాటిని సూచించిన గమ్యస్థానానికి చేర్చిన వెంటనే గ్రానైట్ పరిశ్రమలకు బిల్లులు చెల్లిస్తున్నామని వెల్లడించారు.
ఇందుకు సంబంధించి ఇప్పటివరకు ఒక్క పరిశ్రమకు కూడా బిల్లుల బకాయిలు లేవని స్పష్టం చేశారు. బిల్లులు చెల్లించకపోవడం వల్ల గ్రానైట్ పరిశ్రమల నిర్వాహకుల్లో ఆందోళన అంటూ పత్రికల్లో వచ్చిన వార్త పూర్తిగా అసత్యమని, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన తెలిపారు.
ఒక్కో సర్వేరాయికి రూ.300
గతంలో సిద్ధం చేసిన ఒక్కో సర్వేరాయికి ప్రభుత్వం రూ.270 చెల్లించేదని, దాన్ని ఇప్పుడు రూ.300కు పెంచామని అధికారులు తెలిపారు. దీంతో మరింత ఎక్కువమంది ఆర్డర్లు కా వాలని ఉత్సాహంగా ముందుకొస్తున్నారన్నారు. సర్వేరాళ్ల తయారీ, విక్రయాలు, రవాణా అంశాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా యాప్ రూపొందించినట్లు పేర్కొన్నా రు.
ఈ యాప్‌లో అన్ని వివరాలు ఉంటాయని, గ్రానైట్ పరిశ్రమల నిర్వాహకులు కూడా దీన్లో లాగిన్ అయి తాము విక్రయించిన సర్వేరాళ్లకు బిల్లుల చెల్లింపులు ఎలా జరుగుతున్నాయో ఎప్పటికప్పుడు చూసుకునే అవకాశం కల్పించామని వివరించారు.
సర్వేరాళ్ల తయారీలో గ్రానైట్ యజమానులపై ఆర్థికంగా భారం పడకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం సర్వేరాళ్లకు అవసరమైన బ్లాక్‌లను స్వయంగా గ్రానైట్ పరిశ్రమ యజమానులకు ఉచితంగా అందిస్తోందని తెలిపారు. కేవలం ఆ రాయిని సర్వేరాళ్లుగా తీర్చిదిద్దడం వరకే గ్రానైట్ పరిశ్రమ నిర్వాహకుల బాధ్యత అని తెలిపారు. ఇది పూర్తిచేసిన వెంటనే వారికి బిల్లులు చెల్లిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment