విజయవాడలోని హోటల్‌లో ఆశావహులతో మంత్రి బంధువు బేరసారాలు
ఎవరు ఎక్కువ ఇస్తానంటే వారికే డీడీ, ఏడీ, ఇతర పోస్టులు.. గనులు ఎక్కువ ఉన్న జిల్లాలకు విపరీతమైన డిమాండ్
రూ.కోట్లు పలుకుతున్న ఆ జిల్లాల్లోని పోస్టులు
అన్ని పోస్టుల బదిలీ ప్రతిపాదనలు తనకు పంపాలని డైరెక్టర్‌కు నోట్ పంపిన మంత్రి
మంత్రి చెప్పినట్టే చేయాలని డైరెక్టర్, ముఖ్య కార్యదర్శికి చినబాబు సన్నిహితుడి ఆర్డర్
సాక్షి, అమరావతి: రాష్ట్ర గనుల శాఖలో బదిలీల పర్వం కనక వర్షం కురిపించే కామధేనువులా మారింది. నిబంధనలతో పని లేకుండా.. ఎవరు ఎంత ఎక్కువ ముట్టజెపితే వారికే కీలకమైన పోస్టులు కట్టబెట్టేందుకు వేలం నిర్వహిస్తున్న వైనం అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో సాక్షాత్తూ చినబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన వ్యక్తి తెరవెనుక చక్రం తిప్పుతుండగా.. తెరపై సంబంధింత మంత్రి, ఆయన బంధువు వ్యవహారాన్ని నడిపిస్తున్నారు.
సాధారణంగా బదిలీల ప్రక్రియను ముఖ్య కార్యదర్శి ఆమోదంతో ఆ శాఖ డైరెక్టర్ నిర్వహిస్తారు. అందులో కొన్ని ముఖ్యమైన, కీలకమైన వాటికి రాజకీయంగా సిఫారసు చేసి మంచి పోస్టింగ్‌లు ఇప్పించుకోవడం సాధారణంగా జరుగుతుంటుంది. కానీ.. ఇప్పుడు ఏకంగా బదిలీల ప్రతిపాదనలన్నీ తనకు పంపాలని సదరు మంత్రి ఆ శాఖ డైరెక్టర్‌కు నోట్ పంపడం చర్చనీయాంశమైంది. తాను చెప్పినట్టు బదిలీలు చేయాలనే దశ దాటిపోయి బదిలీల ప్రతిపాదనలన్నీ తనకు పంపాలని డైరెక్టర్‌ను ఆదేశించడంతో గనుల శాఖలో సీనియర్లే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నెల 4వ తేదీన మంత్రి పేషీ కమిషనర్ అండ్ డైరెక్టర్‌కు ఈ నోట్‌ను అధికారికంగా పంపింది. ఐదేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న వారితోపాటు వ్యక్తిగత అభ్యర్థనలు, పరిపాలనా పరమైన అవసరాల కోసం చేసే బదిలీల జాబితాను తనకు పంపాలని అందులో స్పష్టం చేశారు. డిప్యూటీ డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, అసిస్టెంట్ జియాలజిస్టులు, రాయల్టీ ఇన్‌స్పెక్టర్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, మినరల్ రెవెన్యూ ఆఫీసర్లు, ఆఫీసు సూపరింటెండెంట్లు సహా అన్ని బదిలీ ప్రతిపాదనలను ఈ నెల 10వ తేదీలోపు తనకు పంపాలని ఆదేశించారు. వాటిని పరిశీలించి బదిలీలను తాను ఖరారు చేస్తానని మంత్రి అందులో పేర్కొన్నారు.
మంత్రి చెప్పినట్టే చేయాలని డైరెక్టర్‌కు ఆదేశాలు
మంత్రి నుంచి బదిలీల కోసం నేరుగా ఇలాంటి నోట్ రావడంతో ఆశ్చర్యపోయిన డైరెక్టర్ అలా చేస్తే ఇబ్బందుల్లో పడతానని భావించినట్టు తెలిసింది. అందుకే.. బదిలీలపై తనకున్న అధికారాలు, మంత్రి సూచనలు ఎంతవరకూ పాటించవచ్చనే అంశంపై న్యాయ సలహా తీసుకున్నట్టు సమాచారం. ఆ తర్వాత బదిలీల ప్రతిపాదనలు పంపాలని మంత్రి నుంచి నోట్ వచ్చిందని, దీనిపై ఏం చేయాలో తెలపాలని ఆయన ఆ శాఖ ముఖ్య కార్యదర్శిని క్లారిఫికేషన్ అడిగారు.
దీనిపై ఏం చేయాలోనని డైరెక్టర్, ముఖ్య కార్యదర్శి మల్లగుల్లాలు పడుతుండగానే.. చినబాబు సన్నిహితుడు రంగప్రవేశం చేసి ఏమీ ఆలోచించకుండా మంత్రి నోట్‌కి అనుగుణంగా పని చేయాలని ఆర్డర్ వేశారు. ఆయన ఆర్డర్ అనధికారిక రాజముద్రతో కావడంతో ముఖ్య కార్యదర్శి మౌనంగా ఉండిపోయారు. దీంతో బదిలీ ప్రతిపాదనల్ని మంత్రికి పంపడం మినహా డైరెక్టర్‌కి మరో మార్గం లేకుండాపోయింది.
విజయవాడ హోటల్‌లో వేలం పాట
మరోవైపు అధికారుల ప్రతిపాదనలతో సంబంధం లేకుండానే మంత్రి బంధువు ఒకరు విజయవాడలోని ఒక హోటల్‌లో గనుల శాఖ అధికారులు, ఉద్యోగులను పిలిపించుకుని బేరసారాలు జరుపుతున్నట్టు తెలిసింది. ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, నెల్లూరు, వైఎస్సార్, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల డీడీ, ఏడీ పోస్టుల కోసం పలువురు తీవ్రంగా పోటీ పడుతుండటంతో వారికి వేలం పాట పెట్టినట్టు చెబుతున్నారు. ఆ జిల్లాల విజిలెన్స్ విభాగాల్లోని పోస్టులకు మంచి గిరాకీ ఉండటంతో వాటినీ బేరం పెట్టారు. ప్రకాశం, అన్నమయ్య, పల్నాడు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల డీడీ పోస్టుల కోసం రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకూ ఇచ్చేందుకు కొందరు అంగీకరించినట్టు సమాచారం.
ఆ జిల్లాల ఏడీ పోస్టులు కూడా రూ.కోటి నుంచి కోటిన్నర పలుకుతున్నా ఇచ్చేందుకు పలువురు వెనుకాడటంలేదు. మిగిలిన పోస్టులకు సైతం రూ.15 లక్షల నుంచి రూ.కోటి వరకూ ధర నిర్ణయించి.. ఎవరు ఎక్కువ ఇస్తానంటే వారిని అక్కడకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదంతా పేరుకు మంత్రి బంధువు చేస్తున్నా తెరవెనుక మాత్రం చినబాబు సన్నిహితుడే అంతా తానై నడుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ వేలం పాటలో ఎక్కువ ముట్టజెప్పుకున్న వారిని బదిలీ చేసేందుకు వీలుగా సంబంధిత ప్రతిపాదనల ఫైలు తనకు పంపాలని మంత్రి డైరెక్టర్‌కు నోట్ పంపినట్టు స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment