చిన్నతరహా పరిశ్రమలను ఆదుకోవాలి | save the Small Industries | Sakshi
Sakshi News home page

చిన్నతరహా పరిశ్రమలను ఆదుకోవాలి

Published Sat, Feb 28 2015 5:15 AM | Last Updated on Tue, Aug 21 2018 5:36 PM

చిన్నతరహా పరిశ్రమలను ఆదుకోవాలి - Sakshi

చిన్నతరహా పరిశ్రమలను ఆదుకోవాలి

పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీ పొంగులేటి
ఖమ్మం: పర్యావరణం అనుమతుల పేరుతో గ్రానైట్ పరిశ్రమలపై ఆంక్షలు విధించడంతో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ర్ట అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఐదు హెక్టార్ల లోపు విస్తీర్ణం ఉన్న గ్రానైట్ పరిశ్రమలను పర్యావరణ అనుమతుల నుండి మినహాయింపు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం పార్లమెంట్‌లో ఎంపీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 80 శాతం పరిశ్రమలు తక్కువ విస్తీర్ణంలోనే ఉన్నాయన్నారు.

ఈ పరిశ్రమల ఆధారంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాధి మంది కార్మికులు ఆధారపడి బతుకుతున్నారని అన్నారు. ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలతో చిన్నతరహా పరిశ్రమల యాజమాన్యాలు ఇబ్బందులు పడుతున్నాయని, పరిశ్రమలు సక్రమంగా నడవడం లేదన్నారు. మేజర్ ఖనిజా లు, మైనింగ్ ప్రాజెక్టుల లీజు ప్రాంతం 5 హెక్టార్లలోపు ఉంటే సుప్రీం కోర్టు పరిధిలో సడలించే అవకాశం ఉందన్నారు. అందువల్ల నిబంధనలు సడలించి గ్రానైట్ పరిశ్రమలను ఆదుకోవాలని కోరారు.
 
ప్రశ్నలు సంధించిన ఎంపీ
మందులు, వ్యాక్సిన్ తయారీ కేంద్రాల పర్యవేక్షణకు ఎన్ని కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయని ఆ వివరాలను వెల్లడించాలని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ పలు ప్రశ్నలను లిఖితపూర్వకంగా సంధిం చారు. దేశంలో నకిలీ మందుల ప్రభావం ఎక్కువ గా ఉండటం వల్ల వాటి తయారీ కేంద్రాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని అడిగారు. వాటిని పర్యవేక్షించడానికి ఎన్ని కంపెనీలు దరఖాస్తులు చేసుకున్నాయన్నారు.  వాటిలో ఎన్నింటికి అనుమతులిచ్చారో వివరించాలని కోరారు.

అలాగే పై పరిణామం వల్ల పరిశ్రమల నుంచి ఉత్పత్తి ఏమైనా తగ్గిందా..? తగ్గితే వాటి వివరాలు వెల్లడించాలని అడిగారు. కంపెనీలు దరఖాస్తు చేసుకునే ముందు డ్రగ్ రెగ్యులారిటీ అథారిటీ- వినియోగదారులకు మధ్య ఏమైనా చర్చలు జరుపుతుందా... అని ప్రశ్నించారు. దరఖాస్తులను పరిశీలించి త్వరతగతిన ఆమోదించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని కోరారు.

సంబంధిత శాఖామంత్రి జగత్ ప్రకాశ్ అడ్డా సమాధానమిస్తూ 2012లో 480 దరఖాస్తులకు ప్రభుత్వం 253 ఆమోదించిందని, 2013లో 207 దరఖాస్తులకు 73కి ఆమోదం తెలిపిందని, 2014లో 230 దరఖాస్తులకు గాను 198కి అనుమతిచ్చిందని, ప్రస్తుత ఏడాదికి సంబంధించి 17 దరఖాస్తులు రాగా గత ఏడాది పెండింగ్‌లో ఉన్న వాటితో సహా మొత్తం 27 దరఖాస్తులను ఆమోదించిందని తెలిపారు. సెంట్రల్ డ్రగ్స్ అథారిటీ అసోసియేషన్ ద్వారా ఒక వెబ్‌సైట్‌ను నడుపుతున్నామని, అందులో దరఖాస్తు దారులకు పూర్తి సమాచారం లభ్యమవుతుందని వివరించారు. అలాగే మందుల తయారీ పరిశీలకులుగా చాలామంది అనుభవజ్ఞులను ప్రభుత్వం సెంట్రల్ డ్రగ్స్ అథారిటీలోకి చేర్చుకుందన్నారు.
 
ఇన్సూరెన్స్ కంపెనీల విధానాలేంటి.?
ఇన్సూరెన్స్ రెగ్యులారిటీ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో కంపెనీల విధి విధానాల గురించి వివరించాలని ఎంపీ పొంగులేటి కోరారు. కంపెనీల విధి విధానాల పర్యవేక్షణలో భాగంగా ఏమైనా రివ్యూలు నిర్వహించడానికి ప్రతిపాదనలు చేశారా..? చేస్తే వాటి వివరాలను వెల్లడించాలని అడిగారు. కంపెనీల పనివిధానం మెరుగుపడటానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వివరించాలని కోరారు.

సంబంధిత శాఖామంత్రి జయంత్ సిన్హా సమాధానమిస్తూ ఇన్సూరెన్స్ రెగ్యులారిటీ అథారిటీ యాక్ట్ సెక్షన్ 14 ప్రకారం విధివిధానాలను పొందుపరిచిందన్నారు. అందులో సెక్షన్ 20 ఐఆర్‌డీఏ యాక్ట్ ప్రకారం లైఫ్, జనరల్, రెన్యువల్ ఇన్సూరెన్స్ వివరాలను సంవత్సరాల వారీగా పొందుపరుస్తున్నామన్నారు. అప్రైజల్ ఆఫ్ ఇన్సూరెన్స్ మార్కెట్‌పైన, అథారిటీ ఇన్సూరెన్స్, అనాథరిటీ ఇన్సూరెన్స్‌లతోపాటు మార్కెట్ డెవలప్‌మెంట్ విధివిధానాలు పొందుపరచడం జరిగిందన్నారు. ఐఆర్‌డీఏ ఆధ్వర్యంలో అవగాహన పెంపొందించి వినియోగదారులను పెంచడానికి వివిధ రకాల విధివిధానాలను ప్రతిపాదించినట్లు వెల్లడించారు.
 
వాణిజ్య పరంగా ఏయే దేశాలతో సంబంధాలున్నాయి..?
వాణిజ్యపరంగా ఏయే దేశాలతో భారతదేశం సత్సంబంధాలను కొనసాగిస్తుందో తెలపాలని ఎంపీ శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. స్వేచ్ఛా వాణిజ్యం, ప్రాధాన్యత వాణిజ్యాలకు సంబంధించి ఏఏ దేశాలతో ఎలాంటి సంబంధాలు కొనసాగిస్తున్నారో... ప్రస్తుత సంవత్సరంతోపాటు గత మూడేళ్ల సమాచారం అందించాలని కోరారు. అలాగే ఇజ్రాయల్‌తోపాటు మరే దేశాల్లో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తుందా..? అలాగే దేశానికి మరిన్ని పెట్టుబడులు తెచ్చేలా ఏమైనా చర్యలు తీసుకుంటుందా..? అని ప్రశ్నించారు.

ఒకవేళ చర్యలు తీసుకుంటే వాటి వివరాలను వెల్లడించాలని, చర్చలు జరిపేటప్పుడు స్థానిక వ్యాపారవేత్తల ప్రమేయం ఎంతవరకు ఉంటుందన్నారు. సంబంధిత శాఖ మంత్రి నిర్మల సీతారామన్ సమాధానమిస్తూ గత మూడేళ్లలో భారతదేశంలో ఎలాంటి వ్యాపారాలకు అగ్రిమెంట్‌లు కాలేదన్నారు. ఏషియన్ దేశాలతో మాత్రం 2014 సెప్టెంబర్ 9న ఒక అగ్రిమెంట్ జరిగిందని, దాన్ని 2015 జూలై 1న అమలు చేస్తామని స్పష్టంచేశారు. ఇజ్రాయల్‌తో పాటు మరిన్ని దేశాలతో వ్యాపార కార్యకలాపాలు కొనసాగించేందుకు చర్చలు జరుపుతున్నామన్నారు. స్వేచ్ఛా వాణిజ్యం నిరంతర ప్రక్రియ కాబట్టి దానికి అగ్రిమెంట్ ఉండదన్నారు. అలాగే చర్చలు జరిపే ముందు స్థానిక వ్యాపారవేత్తలను సంప్రదిస్తున్నామన్నారు. ఏదైనా నష్టం వాటిల్లే పరిస్థితి ఉంటే ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందన్నారు.
 
రోడ్డు ప్రమాదాల నివారణకు ఏం చర్యలు ?
రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని, దేశ వ్యాప్తంగా వాహనాల ఫిట్‌నెస్ తనిఖీ కేంద్రాల వివరాలు వెల్లడించాలని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి లేవనెత్తారు. కొత్తగా వాహనాల ఫిట్‌నెస్ తనిఖీ కేం ద్రాలకోసం ఏమైనా ప్రతిపాదనలు వచ్చాయా..? అని ప్రశ్నించారు. ఈ అంశంపై సంబంధిత కేంద్ర మంత్రి రాధాకృష్ణ సమాధానమిస్తూ ఫిట్‌నెస్ తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతూ దేశంలోని అన్ని రాష్ట్రాలకు లేఖ రాశామని వివరించారు. అందులో ఆంధ్రప్రదేశ్, బీహార్, చంఢీఘర్, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, మ హారాష్ట్ర, మిజోరాం ఒ డిస్సా, పంజాబ్, తమిళనాడు, పశ్చిబెంగాల్ రాష్ట్రాల నుంచి సమాధానం వచ్చిందన్నారు. కానీ తెలంగాణ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాధానమూ రాలేదన్నారు. సెంట్రల్ మానిటరింగ్ వెహికిల్ రూల్62 ప్రకారం ఫిట్‌నెస్ తనిఖీ కేంద్రాల ద్వారా రహదారుల ఫిట్‌నెస్ కూడా పరిశీలిస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement