
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకం కింద చేసిన పనులకు సంబంధించి పిటిషనర్లకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించామని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. ఈ మేరకు మెమో దాఖలు చేశామని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద తాము చేసిన పనులకు సంబంధించిన బిల్లులను ప్రభుత్వం చెల్లించడం లేదంటూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ వ్యాజ్యాలపై సోమవారం జస్టిస్ దేవానంద్ మరోసారి విచారణ జరిపారు. ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ, 32 వ్యాజ్యాల్లోని పిటిషనర్లకు బకాయిలు చెల్లించామని చెప్పారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కొందరు తమకు బకాయిలు పూర్తిగా చెల్లించారని, మరికొందరు పాక్షికంగా చెల్లించారని, మరికొందరు తమ డబ్బు అందలేదని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఎవరెవరికి బకాయిలు అందలేదో తెలుసుకుని చెప్పాలని న్యాయమూర్తి వారిని ఆదేశించారు.