
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకంలో రూ.5 లక్షలకు పైగా విలువైన పనులకు సంబంధించిన బకాయిల్లో రూ.756 కోట్లను వారం రోజుల్లో చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు మంగళవారం నివేదించింది. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిల్లో రూ.571 కోట్లు అందాయని, ఈ మొత్తానికి రాష్ట్ర వాటా కింద చెల్లించాల్సిన రూ.185 కోట్లు కలిపి వారం రోజుల్లో ఆయా గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపింది. బకాయిల కింద చెల్లించాల్సిన మొత్తం రూ.1,117 కోట్లలో ఈ రూ.756 కోట్లు పోను మిగిలిన రూ.361 కోట్లను కేంద్రం నిధులు విడుదల చేయగానే చెల్లిస్తామంది.
ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు బకాయిల చెల్లింపునకు తీసుకున్న చర్యలను వివరిస్తూ అఫిడవిట్‌ను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పనులు చేసిన కాంట్రాక్టర్లకు డబ్బు అందిందా? లేదా? కూడా ఆ అఫిడవిట్‌లో చెప్పాలంది. రాష్ట్రానికి అదనపు నిధుల విడుదలకు ఎంత సమయం పడుతుందో చెప్పాలని కేంద్రాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలంది. విచారణను సెప్టెంబర్ 22కి వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులిచ్చింది.
తమకు బిల్లులు చెల్లించడం లేదంటూ కొందరు కాంట్రాక్టర్లు హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటిపై కొద్ది వారాలుగా విచారణ జరుపుతూ వస్తున్న ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ నిర్వహించింది. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యారు. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ మెమో దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్, కేంద్రం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) ఎన్.హరినాథ్ వాదనలు వినిపించారు.
Comments
Please login to add a commentAdd a comment