ఇక.. బ్యాంకు చెల్లింపులు | Payment by post offices stoped | Sakshi
Sakshi News home page

ఇక.. బ్యాంకు చెల్లింపులు

Published Mon, Aug 7 2017 11:06 PM | Last Updated on Sun, Sep 17 2017 5:16 PM

ఇక.. బ్యాంకు చెల్లింపులు

ఇక.. బ్యాంకు చెల్లింపులు

ఉపాధికూలీల వేతనాల పంపిణీ
త్వరలో ఈ ప్రక్రియ ప్రారంభానికి కసరత్తు
ఖాతాలు లేనివారికి తెరిపించాలని ప్రభుత్వం ఆదేశాలు
ఉన్నవారికి ఆధార్‌ అనుసంధానించాలని సూచన
అవకతవకలు తగ్గుతాయని సర్కార్‌ ఉద్దేశం
జిల్లాలో 1,84,934 జాబ్‌కార్డులు
18 మండలాల్లో 4,29,951 మంది కూలీలు

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకు ఇకపై బ్యాంకుల ద్వారానే కూలి డబ్బులు చెల్లించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇప్పటివరకు కొన్ని చోట్ల పోస్టాఫీసుల ద్వారా డబ్బులు చెల్లిస్తున్నారు. ఈ ప్రక్రియకు త్వరలో స్వస్తి చెప్పనున్నారు. కూలీలందరికీ బ్యాంకుల్లో ఖాతాలు తప్పనిసరిగా ఉండాలని డీఆర్‌డీఓకు గ్రామీణాభివృద్ధి శాఖ సూచించింది. అదే విధంగా ఖాతాలకు ఆధార్‌ నంబర్‌ను అనుసంధానించాలని పేర్కొంది. దీంతో దాదాపు పదిహేనేళ్ల నుంచి పోస్టాఫీసుల ద్వారా డబ్బులు చెల్లించే ప్రక్రియకు త్వరలో రాంరాం చెప్పనుంది. బ్యాంకుల ద్వారా చెల్లింపులు జరిపితే ఎలాంటి అక్రమాలు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే డబ్బులు జమ అవుతాయని భావించి ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.

సాక్షి, వికారాబాద్‌: ఒకప్పుడు డబ్బుల చెల్లింపునకు ప్రభుత్వం పోస్టాఫీసులపైనే ఆధారపడేది. కోర్‌ బ్యాంకింగ్‌ సిస్టమ్, ఆన్‌లైన్‌ విధానం, ఏటీఎం కార్డుల జారీ ప్రక్రియ వంటివి బ్యాంకింగ్‌ వ్యవస్థలో ప్రవేశపెట్టినప్పటినుంచి సర్కార్‌ అన్ని శాఖల చెల్లింపులన్నీ దాదాపుగా బ్యాంకుల ద్వారానే జరుపుతున్నాయి. పోస్టాఫీసుల ద్వారా ఉపాధి డబ్బులు చెల్లిస్తే లబ్ధిదారు స్వయంగా వెళ్లి తీసుకోవాల్సి వచ్చేది. అదే బ్యాంకుల్లో అయితే ఏటీఎం కార్డుల ద్వారా ఎక్కడంటే అక్కడ ఎప్పుడంటే అప్పుడు తీసుకునే వీలుంది. పోస్టాఫీసుల ద్వారా చెల్లింపులు జరిపినప్పుడు కొన్నిసార్లు అవకతవకలు, అక్రమాలు జరిగినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం పోస్టాఫీసుల ద్వారా చెల్లింపునకు  పూర్తిగా స్వస్థి పలకాలని నిర్ణయం తీసుకుంది.

జిల్లాలోని 26 గ్రామ పంచాయతీల్లో
వికారాబాద్‌ జిల్లా 18 మండలాలలో ఏర్పడింది. లక్షా 84వేల 934 జాబ్‌కార్డులు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా మొత్తం 4లక్షల 29వేల 951 మంది ఉపాధి కూలీలు ఉన్నారు. అయితే, వీరిలో రెగ్యులర్‌గా ఉపాధి పనులకు వచ్చేవారు 3 లక్షల 5వేల మంది మాత్రమే. జిల్లా ఏర్పాటు సమయంలో మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కొడంగల్‌ నియోజకవర్గం నుంచి కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్‌పేట్‌ మండలాలను విలీనం చేశారు. దీంతో ఈ మండలాల పరిధిలోని 26 గ్రామ పంచాయతీల్లో నేటికీ పోస్టాఫీసుల ద్వారానే ఉపాధి కూలీలకు వేతనాలు చెల్లిస్తున్నారు. కొడంగల్‌ మండలంలో 10,764 జాబ్‌కార్డులు.. 27,950 మంది కూలీలు, దౌల్తాబాద్‌ మండలంలో 12,470 జాబ్‌కార్డులుండగా, 33 569 మంది పనిచేస్తున్నారు. బొంరాస్‌పేట మండలంలో 13,839 జాబ్‌కార్డులకు 31,230 మంది ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ మూడు మండలాల్లో పనిచేసే ఉపాధికూలీలకు బ్యాంకు ఖాతాలు తెరిపించాలని ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ గ్రామీణాభివృద్ధి అధికారులను ఆదేశించారు. దీంతోపాటు జిల్లాలోని అన్ని మండలాల్లో ఉపాధికూలీల బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ను అనుసంధానించాలని సూచించారు. కూలీల బ్యాంకు ఖాతాలు, ఉపాధిజాబ్‌కార్డులు, సెల్‌ఫోన్‌నెంబర్లను తీసుకొని వాటికి ఆధార్‌కార్డును అనుసంధానించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో కూలీ డబ్బులు నేరుగా కూలీల ఖాతాల్లో జమ చేసేందుకు వీలు కలుగుతుంది. అదేవిధంగా డబ్బుల పంపిణీలో అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా ఉండే విధంగా గ్రామీణాభివృద్ధి అదికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఫీల్డ్‌ అసిస్టెంట్లకు ఈ పనిని అప్పగించి సెప్టెంబరు నెలాఖరులోగా బ్యాంకు ఖాతాలు తెరిపించడానికి అధికారులు కసరత్తు వేగిరం చేశారు.

వచ్చే నెలాఖరులోపు పూర్తిచేస్తాం
బ్యాంకుల ద్వారానే ఉపాధి కూలీలకు కూలీ డబ్బులు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రతి కూలీకి బ్యాంకు ఖాతా, ఆధార్‌ కార్డు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటివరకు జిల్లాలోని కొడంగల్, బొంరాస్‌పేట్, దౌల్తాబాద్‌ మండలాల్లో పనిచేసే 92,749 మంది ఉపాధి కూలీలు పోస్టాఫీసుల ద్వారానే కూలీ డబ్బులు తీసుకుంటున్నారు. వీరికి వచ్చేనెలలోపు బ్యాంకు ఖాతాలు తెరిపించడానికి చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలోని 4,29,951 మంది కూలీలందరికీ బ్యాంకు ఖాతాలు ఉండి ఆధార్‌ అనుసంధానం చేయించేందుకు నిర్ణయించాం. మరో రెండుమూడు నెలల్లో పోస్టాఫీసుల ద్వారా ఉపాధిహామీ పథకం కూలీలకు డబ్బులు పంపిణీ చేసే ప్రక్రియకు ప్రభుత్వం పూర్తిగా ముగింపు పలకాలని భావిస్తుంది. ఈక్రమంలోనే కూలీలందరికీ బ్యాంకు ఖాతాలు తెరిపించాలనే ఆదేశాలు ఉన్నాయి.
– జాన్సన్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, వికారాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement