
న్యూఢిల్లీ: లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోవడమే కాకుండా. స్వస్థలాలకు చేరేందుకు నానా అవస్థలు పడ్డ వలస కూలీలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గ్రామీణ ఉపాధి హామీ పథకంతోపాటు, ప్రధాని∙మోదీ ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ పథకంలోని పలు పనుల కోసం వలస కూలీలకు ఆయా రాష్ట్రాల్లోనే ఉపాధి కల్పించడం ఈ ప్రణాళికలోని ముఖ్యాంశంగా తెలుస్తోంది. జన్‌ధన్ యోజన, కిసాన్ కళ్యాణ్ యోజన, ఆహార భద్రత పథకం, ప్రధాని ఆవాస్ యోజన కార్యక్రమాలను వలసకూలీలను లక్ష్యంగా చేసుకుని రూపొందిస్తారు. ఇందుకోసం దేశంలో వలస కూలీలు ఎక్కువగా ఉన్న 116 జిల్లాలను ఎంపిక చేశారు. బిహార్‌లో 32, ఉత్తర ప్రదేశ్‌లో 31, మధ్యప్రదేశ్‌లో 24, రాజస్థాన్‌లో 22, జార్ఖండ్‌లో 3, ఒడిశాలోని 4 జిల్లాల్లోనూ అమలు చేయనున్నారు. ఈ జిల్లాల్లో వలస కూలీలను గుర్తించే కార్యక్రమం కొనసాగుతోంది.