
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల పేదలకు ఆదరువుగా నిలుస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో కేవలం కొన్ని పనులకే పరిమితమైన ఉపాధి హామీని సామాజిక కార్యక్రమాలకు కూడా అనుసంధానం చేయడంతో దీన్ని వ్యూహాత్మకంగా వాడుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే గ్రామాల్లో వైకుంఠధామా లు, డం పింగ్ యార్డులు, గ్రామపంచాయతీ భవ నాలు, ప్రకృతి వనాలు, సీసీ రోడ్లకు కూడా ఉపాధి హామీని వర్తింపజేస్తున్న సర్కా రు.. వచ్చే ఏడాది మరిన్ని అభివృద్ధి పనులకు ఈ నిధులను వాడుకోవాలని యోచిస్తోంది.
కూలీలకు పనిదినాలు కల్పిస్తూనే.. మెటీరియల్ కంపొనెంట్ పనులను విరివిగా చేపట్టాలని భావిస్తోంది. లాక్‌డౌన్‌తో పట్టణాలకు వలస వెళ్లిన శ్రమజీవులు కాస్తా గ్రామాలకు తిరిగి వచ్చారు. ఈ క్రమంలో మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పనిదినాలు కల్పించిన గ్రామీణాభివృద్ధి శాఖ వచ్చే ఏడాది కూడా అదేస్థాయిలో పని కల్పించేందుకు ఇప్పట్నుంచే కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తోంది. ఇందులో భాగంగా 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రణాళికలను తయారు చేయాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించింది. గ్రామాలవారీగా గ్రామసభల్లో ఆమోదించి.. ఆ తర్వాత మం డల, జిల్లా స్థాయిలోనూ ఖరారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలని స్పష్టం చేసింది. పనుల గుర్తింపు, పనిదినాల కల్పన, పనుల సామగ్రి కొనుగోలు, లేబర్ బడ్జెట్ అంచనాలు తయారు చేయాలని నిర్దేశించింది.
అక్టోబర్ 2న ప్రత్యేక గ్రామ సభలు
గాంధీ జయంతిని పురస్కరించుకొని అక్టోబర్ 2 నుంచి నవంబర్ 30 వరకు ప్రత్యేక గ్రామసభలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ముసాయిదా వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలను ఈ సభలో స్థానికులకు వివరించాలని, పూర్తికానీ పనులు, చేపట్టాల్సిన పనులు, జాబ్‌కార్డుల సమాచారాన్ని గ్రామస్తుల ముందుంచాలని స్పష్టం చేసింది. అలాగే మహిళా స్వయం సహాయక సంఘాల్లో క్రియాశీలకంగా ఉండే ఇద్దరిని సామాజిక తనిఖీ కోసం ఎంపిక చేయాలని నిర్దేశించింది. కాగా, బడ్జెట్ తయారీలో స్థానిక పంచాయతీ, ఇతర ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రజా ప్రతినిధులు, ఇతర ముఖ్యుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు రూపొందించిన ముసాయిదా బడ్జెట్ ప్రతిపాదనలను ఈ ఏడాది చివరి వరకు పంపాలని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment