న్యూఢిల్లీ: గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కల్పించే పనిదినాలను ఎస్టీలకు 100 నుంచి 150కి పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రూపొందించిన ప్రతిపాదనలను శుక్రవారం సమావేశమవుతున్న కేంద్ర కేబినెట్ పరిశీలించే అవకాశం ఉందని అధికారవర్గాలు వెల్లడించారుు. అటవీ హక్కుల చట్టం 2006 కింద భూమి హక్కులు పొందిన గిరిజనులు ఈ అదనపు 50 పనిదినాలు వినియోగించుకునేందుకు అర్హులు. ఎలాంటి ప్రైవేటు భూమీ లేకుండా నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో 100 పనిదినాలు పూర్తిచేసినవారు దీనికింద లబ్ధి పొందుతారు. గిరిజనుల వలసల నివారణే పని దినాల పెంపులోని ప్రధానోద్దేశమని అధికారులు చె ప్పారు. సాధారణ ఉపాధి కార్మికులకు భిన్నంగా వీరికి మరో రంగు జాబ్ కార్డు అందజేస్తారు. 2012-13లో 4.8 కోట్ల కుటుంబాలు దీనికింద ఉపాధి పొందారు.