మూడేళ్లలో కోటి ఉద్యోగాలు
- రూ. 6 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ
- జౌళి, వస్త్ర రంగానికి కేంద్రం ఊతం
న్యూఢిల్లీ: భారీగా ఉద్యోగాలను సృష్టించేందుకు, ఎగుమతులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం జౌళి, వస్త్ర రంగానికి రూ. 6 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఆమోదించింది. ఈ రంగంలో వచ్చే మూడేళ్లలో కోటి ఉద్యోగాలు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే రూ.74 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని, రూ.2 లక్షల కోట్ల ఎగుమతులను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఉత్పాదకతను పెంచేందుకు అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వడంతోపాటు కార్మిక చట్టాలనూ సరళీకరించే విధానానికి పచ్చజెండా ఊపింది. ఈమేరకు బుధవారం ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ సమావేశమై నిర్ణయాలు తీసుకుంది. ఈ భేటీ వివరాలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియాకు వెల్లడించారు. ‘గత కొన్నేళ్లుగా దేశీయ వస్త్ర ఉత్పత్తిరంగం వ్యయ సౌలభ్యంతో చైనాలాంటి దేశాలకు వలసవెళ్లింది. అయితే అక్కడ లేబర్ చార్జీలు పెరగడంతో వ్యయ సౌలభ్యం తటస్థమైంది. మన ఆర్థిక విధాన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ రంగానికి ఊతమివ్వాలని నిర్ణయించాం’ అని పేర్కొన్నారు.
కార్మిక చట్టాల సరళీకరణ.. ప్రస్తుతం ఐఎల్‌ఓ నిబంధనల మేరకు కార్మికుల ఓవర్‌టైమ్ వారానికి 8 గంటలకు మించకూడదు. కేంద్రం తాజా నిర్ణయంతో దీన్ని పెంచేందుకు వీలవుతుంది. తద్వారా ఉత్పత్తి గణనీయంగా పెరిగే అవకాశముంది. అలాగే ఫిక్స్‌డ్ టర్మ్ కార్మిక విధానాన్ని ప్రవేశపెట్టేందుకు అనుమతించింది. దీనివల్ల నిర్దేశిత కాల కార్మికులకు పర్మినెంట్ కార్మికులతో సమానంగా పనిగంటలు, వేతనం వర్తిస్తాయి. నిర్దేశిత ఉద్యోగాలను కల్పించిన తర్వాతే సబ్సిడీలను అందించడం ఈ విధాన ప్రత్యేకత. .
కేబినెట్ ఇతర నిర్ణయాలు
యూపీఏ హయాంలో పార్లమెంటులో ప్రవేశపెట్టిన డ్రగ్స్, కాస్మెటిక్స్ (సవరణ) బిల్లు-2013ను వెనక్కితీసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. మూలకణ పరిశోధన, ఔషధ పరీక్షల్లో ప్రగతి నేపథ్యంలో వాటినీ బిల్లులో చేర్చనున్నారు. కర్ణాటకలో రూ.2,272 కోట్ల వ్యయంతో 144 కి.మీ. పొడవున్న హుబ్లీ-హొస్పేట (ఎన్‌హెచ్ 63) మార్గాన్ని నాలుగులేన్లుగా అభివృద్ధి చేసే ప్రాజెక్టును ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించింది. బిహార్‌లో గంగా నదిపై 5.5 కి.మీ. పొడవున్న మహాత్మాగాంధీ సేతు (వంతెన) ప్రాజెక్టు పునరుద్ధరణకు రూ.1,742 కోట్లు కేటాయించడానికి సీసీఈఏ ఆమోదం తెలిపింది.