మాట్లాడుతున్న ప్రకాశ్ జవడేకర్
సాక్షి, న్యూఢిల్లీ: ఓటీటీ(ఓవర్ ద టాప్) పేరిట అశ్లీలం నేరుగా ప్రజల నట్టింట్లోకి చేరుతోందన్న ఆందోళనలు పెరిగిపోతుండడంతో కేంద్ర ప్రభుత్వం దానికి అడ్డుకట్ట వేసే చర్యలు ప్రారంభించింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ తదితర ఓటీటీ వేదికలను, ఇతర డిజిటల్ న్యూస్ వెబ్‌సైట్లు, కరెంట్ అఫైర్స్ కంటెంట్‌ను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోకి తీసుకొచ్చింది. ఇంటర్నెట్ ద్వారా ప్రసారమయ్యే డిజిటల్ కంటెంట్‌పై ప్రస్తుతం దేశంలో ఎలాంటి నిఘా లేదు. నియంత్రణకు విధానాలు, నిబంధనలు లేవు. నెట్‌లో ప్రసారమయ్యే అశ్లీల, అనుచిత అంశాలపై కన్నేసి ఉంచేందుకు, బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు చట్టం గానీ, స్వతంత్ర సంస్థ గానీ లేవు. అందుకే కేంద్ర సర్కారు ఇలాంటి వ్యవహారాలపై నిఘా పెట్టే అధికారాన్ని సమాచార, ప్రసార శాఖకు కట్టబెట్టింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ మంగళవారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌పై రాష్ట్రపతి కోవింద్ సంతకం చేశారు.
కోర్టు వివరణ కోరిన నెల రోజుల్లోపే...
ఓటీటీలపై నిఘా కోసం కేంద్ర ప్రభుత్వం ‘గవర్నమెంట్ ఆఫ్ ఇండియా(అలోకేషన్ ఆఫ్ బిజినెస్) రూల్స్–1961’లో సవరణలు చేసింది. దీన్ని ఇకపై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా(అలోకేషన్ ఆఫ్ బిజినెస్) 357వ అమెండ్‌మెంట్ రూల్స్–2020గా వ్యవహరిస్తారు. ఇది వెంటనే అమల్లోకి వస్తుంది. అశ్లీలంపై చర్యలు తీసుకొనే అధికారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 77 క్లాజ్(3) ప్రకారం కేంద్రానికి సంక్రమించింది. ఆన్‌లైన్ వేదికలపై లభ్యమయ్యే న్యూస్, ఆడియో, విజువల్ కంటెంట్, సినిమాలకు సంబంధించిన నియంత్రణ విధానాలను రూపొందించే అధికారం సమాచార, ప్రసార శాఖకు దక్కింది. ఓటీటీలు, డిజిటల్ మీడియా వేదికలపై నియంత్రణ కోసం ఒక స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ న్యాయవాదులు శశాంక్ శంకర్ జా, అపూర్వ అర్హతియా ఇటీవలే సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం వివరణ కోరిన నెల రోజుల్లోనే కేంద్రం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment