శృంగవరపుకోట రూరల్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న జిల్లా వేతనదారులకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి బ్యాంకుల ద్వారా నేరుగా వారి ఖాతాలకు ఆన్‌లైన్ నగదు చెల్లింపులు చేపడతామని ప్రభుత్వం చేసిన ప్రకటన ఒట్టిమాటేనా? అనే సందేహాన్ని పలువురు వేతనదారులు వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి వేతనదారులకు ప్రస్తుతం పోస్టాఫీసుల ద్వారా జరుగుతున్న నగదు చెల్లింపులను నిలిపివేసి నేరుగా బ్యాంకు ఖాతాల ద్వారా ఆన్‌లైన్ చెల్లింపులు చేయాలని ప్రభుత్వం తలపెట్టింది.
ఇందులో భాగంగా ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన కింద జిల్లాలోని 34మండలాల్లో చురుగ్గా పనిచేస్తున్న 7,53,082మంది వేతనదారులకు బ్యాంకు ఖాతాలను తెరిచే ప్రక్రియ చేపట్టి ఇప్పటివరకు 3,72,161 పూర్తి చేశారు. ఇంకా జిల్లావ్యాప్తంగా 3,80,921మంది వేతనదారులకు బ్యాంకు ఖాతాలను తెరిపించాల్సి ఉంది. అయితే మండలాల వారీగా ఇప్పటివరకు తెరిచిన 3,72,161వేతనదారుల బ్యాంకు ఖాతాల పరిశీలన ప్రక్రియ చాలా మందకొడిగా జరుగుతోంది. జిల్లాలోని 34మండలాల్లో గణాంకాల ప్రకారం కేవలం 82,693 వేతనదారుల బ్యాంకు ఖాతాల పరిశీలన జరగ్గా ఇంకా 2,89,468మంది ఖాతాలను పరిశీలించాల్సి ఉంది.
ఖాతాల సీడింగ్‌లో ‘సీతానగరం’ ముందంజ
జిల్లావ్యాప్తంగా ఉపాధి వేతనదారుల బ్యాంకు ఖాతాల సీడింగ్ ప్రక్రియలో సీతానగరం మండలం ముందంజలో ఉండగా రామభద్రపురం మండలం చిట్టచివరన నిలిచింది. సీతానగరం మండలంలో 27,077మంది వేతనదారులకు గాను 18,038మంది బ్యాంకు ఖాతాలు తెరిచారు. శృంగవరపుకోట మండలంలో 23,311మందికి 11,771, బలిజిపేట 25,603మందికి 14,239, భోగాపురం 14,754మందికి 8378, బొబ్బిలిలో 27,675మందికి 15966, బొండపల్లి 23821కి 9928, చీపురుపల్లి 23029మందికి 8525, గజపతినగరం 21,741మందికి 9226, గంట్యాడ 26,739మందికి 11,510, గరివిడి 21,290మందికి 14,338, గుమ్మలక్ష్మీపురం 21,288మందికి 9600, జామి మండలంలో 20,128మందికి 9163, జియ్యమ్మవలస 28,330మందికి 14024, కొత్తవలస 14,169మందికి 7637, లక్కవరపుకోట 18,675మందికి 8021, పార్వతీపురం 27082మందికి 14888, రామభద్రపురం 15,458మందికి 6835, విజయనగరంలో 14042మంది వేతనదారులకు గాను 7229 మంది బ్యాంకు ఖాతాలను తెరిచారు.
జూన్ 1 నుంచి చెల్లింపులు : ఏపీఓ ఆదిలక్ష్మి
జిల్లాలో ప్రయోగాత్మకంగా 100 గ్రామాల్లో వేతనదారుల బ్యాంకు ఖాతాలను తెరిచి ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో నగదు చెల్లింపులు చేయాలని ముందుగా నిర్దేశించారని ఏపీఓ ఎస్.ఆదిలక్ష్మి చెప్పారు. ఇందులో భాగంగా ఎస్.కోట మండలంలో నాలుగు గ్రామాలను ప్రతిపాదించారు. జూన్ 1వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో నగదు చెల్లింపులు జరపాలని లక్ష్యంగా పెట్టారు.
‘ఉపాధి’ వేతనాలు ఆన్‌లైన్‌లో ఎప్పుడు?
Published Sun, May 15 2016 12:50 AM | Last Updated on Mon, Sep 4 2017 12:06 AM
Advertisement
Advertisement