Online cash
-
జీపేలో నిమిషానికి రూ.1.. నెలకు రూ.40 వేలు!
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మోసాలు, వేధింపులు అధికమవుతున్నాయి. ఇటీవల ఓ యువతి తన ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుని విభిన్న ప్లాట్ఫామ్ల్లో తనను బ్లాక్ చేసింది. అయినా అతడు ఇటీవల గూగుల్‌పే ద్వారా తనను వేధిస్తున్నట్లు యువతి పోస్ట్ చేసింది. గూగుల్‌పే యాప్‌లో ప్రతి నిమిషానికి రూ.1 పంపిస్తూ తనను వేధిస్తున్నట్లు చెప్పింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అదికాస్తా వైరల్‌గా మారింది.ఆయుషి అనే యువతి చేసిన ఈ పోస్ట్‌పై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘జీపే ద్వారా నిమిషానికి రూ.1 చొప్పన 30 రోజుల్లో 43,800 నిమిషాల్లో రూ.40,000 కంటే ఎక్కువే సంపాదించవచ్చు. మీ ఇద్దరి మధ్య గతంలో ఎలాంటి రిలేషన్షిప్ ఉన్నా దాన్ని మీరు వదిలించుకోవాలనుకున్నారు. సింపల్‌గా ఇగ్నోర్ చేయండి. కానీ మీ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌ను గూగుల్‌పేలో బ్లాక్ చేయవద్దు. ఎందుకంటే మీరు దాని ద్వారా నెలకు రూ.40 వేలు సంపాదిస్తారు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘మీరు కొంత డబ్బు సమకూర్చుకోండి. తర్వాత గూగుల్‌పేలో కూడా తనను బ్లాక్ చేయండి’ అంటూ మరో వ్యక్తి కామెంట్ చేశాడు.ఇదీ చదవండి: నకిలీ షాపింగ్ వెబ్సైట్లు.. తస్మాత్ జాగ్రత్త!ఏదేమైనా ప్రతి రిలేషన్‌షిప్‌కు ఇద్దరి అంగీకారం అవసరం. అందుకు ఏ కారణంతోనైనా ఒకరికి ఇష్టం లేదంటే వేరొకరు దాన్ని గౌరవించి అందుకు అనుగుణంగా వ్యవహరించాలి. కానీ ఏ విధమైన వేధింపులకు పాల్పడకూడదని నిపుణులు సూచిస్తున్నారు. టెక్నాలజీని మంచికే వినియోగించుకోవాలని చెబుతున్నారు. -
ఓటర్లకు ఆన్లైన్లో నగదు పంపిణీ
తాడిపత్రి అర్బన్: పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న చామల వెంకట అనిల్‌కుమార్‌రెడ్డి ఉపాధ్యాయుల ఖాతాల్లోకి నేరుగా డబ్బు జమచేసేందుకు యత్నించి పోలీసులకు దొరికిపోయారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ ఎస్ఐ ధరణీబాబు తెలిపిన వివరాల ప్రకారం.. తాడిపత్రి పట్టణంలోని గన్నెవారిపల్లి కాలనీలో ఉన్న లార్డ్ ఆసుపత్రి అధినేత చామల వెంకట అనిల్‌కుమార్‌రెడ్డి పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే, ఓటమి ఖాయమని భావించిన ఆయన కొత్త పద్ధతుల్లో డబ్బు పంపిణీకి శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్ల మండలం కోడిగుడ్లపాడు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాంబశివారెడ్డి, యల్లనూరుకు చెందిన పోస్టుమన్ నగేష్ ద్వారా తాడిపత్రి పోలీస్‌స్టేషన్ సమీపంలోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ సర్వీస్ పాయింట్ (సీఎస్పీ)లో శుక్రవారం 28 మంది ఉపాధ్యాయ ఓటర్ల ఖాతాల్లోకి నేరుగా రూ.49 వేల నగదు బదిలీ చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పట్టణ, రూరల్ పోలీసులు దాడులు నిర్వహించి కస్టమర్ సర్వీస్ పాయింట్ నిర్వాహకుడు శివశంకర్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించారు. సాంబశివారెడ్డి, నగేష్ ప్రోద్బలంతో నగదు బదిలీ చేసినట్లు అతను అంగీకరించాడు. అతని నుంచి రూ.1,36,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. అతనితో పాటు హెచ్ఎం సాంబశివారెడ్డి, పోస్టుమన్ నగేష్‌పై కేసు నమోదు చేశారు. మరోవైపు.. అనిల్‌కుమార్‌రెడ్డికి మద్దతుగా కొండేపల్లికి చెందిన ఉపాద్యాయులు వజ్రగిరి, వైఎస్సార్ జిల్లా రైల్వే కొండాపురం మండలం బెంజి అనంతపురానికి చెందిన ఉపాధ్యాయుడు బత్తల రాజు, పి. నరసింహులుతో పాటు మరికొందరు కూడా శుక్రవారం తాడిపత్రిలో ఓటర్లకు నగదు పంపిణీ చేపట్టినట్లు పోలీసు విచారణలో తేలింది. -
‘ఉపాధి’ వేతనాలు ఆన్లైన్లో ఎప్పుడు?
శృంగవరపుకోట రూరల్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న జిల్లా వేతనదారులకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి బ్యాంకుల ద్వారా నేరుగా వారి ఖాతాలకు ఆన్లైన్ నగదు చెల్లింపులు చేపడతామని ప్రభుత్వం చేసిన ప్రకటన ఒట్టిమాటేనా? అనే సందేహాన్ని పలువురు వేతనదారులు వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి వేతనదారులకు ప్రస్తుతం పోస్టాఫీసుల ద్వారా జరుగుతున్న నగదు చెల్లింపులను నిలిపివేసి నేరుగా బ్యాంకు ఖాతాల ద్వారా ఆన్లైన్ చెల్లింపులు చేయాలని ప్రభుత్వం తలపెట్టింది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన కింద జిల్లాలోని 34మండలాల్లో చురుగ్గా పనిచేస్తున్న 7,53,082మంది వేతనదారులకు బ్యాంకు ఖాతాలను తెరిచే ప్రక్రియ చేపట్టి ఇప్పటివరకు 3,72,161 పూర్తి చేశారు. ఇంకా జిల్లావ్యాప్తంగా 3,80,921మంది వేతనదారులకు బ్యాంకు ఖాతాలను తెరిపించాల్సి ఉంది. అయితే మండలాల వారీగా ఇప్పటివరకు తెరిచిన 3,72,161వేతనదారుల బ్యాంకు ఖాతాల పరిశీలన ప్రక్రియ చాలా మందకొడిగా జరుగుతోంది. జిల్లాలోని 34మండలాల్లో గణాంకాల ప్రకారం కేవలం 82,693 వేతనదారుల బ్యాంకు ఖాతాల పరిశీలన జరగ్గా ఇంకా 2,89,468మంది ఖాతాలను పరిశీలించాల్సి ఉంది. ఖాతాల సీడింగ్‌లో ‘సీతానగరం’ ముందంజ జిల్లావ్యాప్తంగా ఉపాధి వేతనదారుల బ్యాంకు ఖాతాల సీడింగ్ ప్రక్రియలో సీతానగరం మండలం ముందంజలో ఉండగా రామభద్రపురం మండలం చిట్టచివరన నిలిచింది. సీతానగరం మండలంలో 27,077మంది వేతనదారులకు గాను 18,038మంది బ్యాంకు ఖాతాలు తెరిచారు. శృంగవరపుకోట మండలంలో 23,311మందికి 11,771, బలిజిపేట 25,603మందికి 14,239, భోగాపురం 14,754మందికి 8378, బొబ్బిలిలో 27,675మందికి 15966, బొండపల్లి 23821కి 9928, చీపురుపల్లి 23029మందికి 8525, గజపతినగరం 21,741మందికి 9226, గంట్యాడ 26,739మందికి 11,510, గరివిడి 21,290మందికి 14,338, గుమ్మలక్ష్మీపురం 21,288మందికి 9600, జామి మండలంలో 20,128మందికి 9163, జియ్యమ్మవలస 28,330మందికి 14024, కొత్తవలస 14,169మందికి 7637, లక్కవరపుకోట 18,675మందికి 8021, పార్వతీపురం 27082మందికి 14888, రామభద్రపురం 15,458మందికి 6835, విజయనగరంలో 14042మంది వేతనదారులకు గాను 7229 మంది బ్యాంకు ఖాతాలను తెరిచారు. జూన్ 1 నుంచి చెల్లింపులు : ఏపీఓ ఆదిలక్ష్మి జిల్లాలో ప్రయోగాత్మకంగా 100 గ్రామాల్లో వేతనదారుల బ్యాంకు ఖాతాలను తెరిచి ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆన్లైన్లో నగదు చెల్లింపులు చేయాలని ముందుగా నిర్దేశించారని ఏపీఓ ఎస్.ఆదిలక్ష్మి చెప్పారు. ఇందులో భాగంగా ఎస్.కోట మండలంలో నాలుగు గ్రామాలను ప్రతిపాదించారు. జూన్ 1వ తేదీ నుంచి ఆన్లైన్లో నగదు చెల్లింపులు జరపాలని లక్ష్యంగా పెట్టారు.