'రైతులు చెరువుల్లోని మట్టి వాడుకోవచ్చు'
హైదరాబాద్: ఉపాధి హామీ పథకం కింద 2014-15 ఏడాదికి రూ.4 వేల కోట్లు ఖర్చుచేయనున్నామని ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు. పేదలకు నిర్మించే ఇళ్లకు కూలీల ఖర్చు నిమిత్తం 25 శాతం రుణం ఇంటి యజమానికి ఇస్తామన్నారు. గ్రామాల్లో ప్రతి ఇంటి మరుగుదొడ్ల నిర్మాణానికి ఉపాధి హామీ వర్తింపచేస్తామన్నారు.
2014-15 ఏడాదికి 90 వేల ఎకరాల్లో ఉద్యానవన పంటలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. దీనికోసం ఎంపిక చేసిన ఆదర్శ రైతులకు మొక్కలు, ఖర్చులు, నీరు మూడేళ్ల వరకూ ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొన్నారు. మాగాని, వర్షధారంతో సాగు చేసే రైతులకు ఉపాధిహామీ పథకాన్ని అనుసంధానం చేస్తామన్నారు.
వ్యవసాయం తెలియనివారిని ఆదర్శ రైతులుగా గత ప్రభుత్వం నియమించిందని వారిని తొలగిస్తామని తెలిపారు. గ్రామాల్లో ఉన్న ప్రతి చెరువును అభివృద్ధి చేస్తామన్నారు. రైతులు కూడా ఆ చెరువుల్లోని మట్టి వాడుకోవచ్చని అయ్యన్నపాత్రుడు చెప్పారు.