Ideal farmers
-
కాంగ్రెస్‌కు కడుపు మంట ఎందుకు?
టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ సాక్షి, హైదరాబాద్: రైతు సమన్వయ సమితుల ఏర్పాటుపై కాంగ్రెస్‌కు కడుపుమంట ఎందుకో అర్థం కావడం లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. సమన్వయ సమితులను అడ్డుకుంటే రైతులే వారిని తరిమి కొడతారని హెచ్చరించారు. కాంగ్రెస్‌కు తమ పాలనలో గుర్తుకురాని రైతులు, అధికారం పోగానే గుర్తుకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతు సమన్వయ సమితులు ఎందుకంటున్న కాంగ్రెస్ నేతలు తమ హయాంలో ఆదర్శ రైతులను ఎలా నియమించారని శుక్రవారమిక్కడ ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళుతున్నారని, కొత్త సచివాలయం నిర్మాణానికి సీఎం సంకల్పిస్తే విపక్షాలు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. ప్రజాకోర్టులో పోరాడే దమ్ము లేక న్యాయస్థానాలకు పోతున్నారన్నారు. రేవంత్‌రెడ్డి అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. -
రైతులకు పిల్లర్ మెషీన్లు పంపిణీ
చోడవరం (విశాఖ) : విశాఖ జిల్లా చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు సోమవారం ఆదర్శ రైతులకు పిల్లర్ మెషీన్లు పంపిణీ చేశారు. వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం ఆరుగురు రైతులు మెషీన్లను అందుకున్నారు. నాట్లు వేసే సమయంలో ఇవి రైతులకు ఉపయోగపడనున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజు మాట్లాడుతూ... గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో చెరకు సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు వీలుగా డ్రిప్ ఇరిగేషన్ విధానంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహిస్తామని చెప్పారు. -
ఆదర్శ రైతులకు మంగళం!
ఆంధ్రా బాటలో తెలంగాణ ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆదర్శ రైతుల వ్యవస్థకు మంగళం పాడాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వ్యవస్థ వల్ల పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో పాటు ప్రభుత్వ పథకాలు నిజమైన లబ్ధిదారులకు అందకపోవడానికి ఆదర్శ రైతులు కారణమవుతున్నారని అధికారుల భావన మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. తెలంగాణలో ప్రస్తుతం దాదాపు 16 వేల మంది ఆదర్శ రైతులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వారికి ప్రతినెలా రూ. వెయ్యి గౌరవ వేతనం ఇస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో వ్యవసాయంలో విశేష అనుభవం ఉన్నవారిని గుర్తించి ప్రతీ గ్రామానికి ఒకరు, పెద్ద గ్రామాలైతే ఇద్దరిని ఆదర్శ రైతులుగా నియమించారు. వ్యవసాయంలో అధునాతన పద్ధతులు, వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులను గ్రామాల్లోని రైతులకు వివరించి, అధిక దిగుబడి సాధించేలా సలహాలు ఇవ్వడం వంటి పనులు వీరు చేస్తున్నారు. కాగా కాంగ్రెస్ కార్యకర్తలనే ఆదర్శ రైతులుగా నియమించుకున్నారని టీఆర్ఎస్ కిందిస్థాయి నేతల నుంచి వస్తున్న ఫిర్యాదులతోపాటు, ఆంధ్రప్రదేశ్‌లో ఈ వ్యవస్థను రద్దు చేసిన నేపథ్యంలో తెలంగాణలోనూ వారిని తొలగించాలని నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు... వ్యవసాయ రంగంలో విస్తరణ కార్యక్రమాలు పూర్తిగా లేకుండా పోయాయని, రైతులకు ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పించే వారు లేకుండా పోయారని తెలంగాణ సీఎం కొద్దిరోజులుగా పేర్కొంటూ వస్తున్నారు. అలాంటిది ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేయకుండా ఉన్న వ్యవస్థను తొలగించడం వల్ల రైతులు మరింత ఇబ్బందులు పడే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసలు ఆదర్శ రైతుల వ్యవస్థతో పెద్దగా ప్రయోజనం లేదని అధికారవర్గాలు వ్యాఖ్యానించడం గమనార్హం. -
‘ఆదర్శ’కు అండగా ఉండండి
సమస్యలపై వైఎస్సార్ సీపీ అధ్యక్షులు జగన్‌కు వినతి హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదర్శ రైతులను తొలగించడాన్ని నిరసిస్తూ ఈ నెల 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల, నియోజకవర్గ కేంద్రాలలో నిరసనలు చేపట్టాలని ఏపీ ఆదర్శ రైతుల సంఘం అధ్యక్షులు ఎన్. శేఖర్ తెలిపారు. ఆదర్శ రైతులకు మద్దతుగా వైఎస్సార్సీపీ అండగా ఉండాలని కోరుతూ సోమవారం ఆదర్శ రైతుల ప్రతినిధి బృందం వైఎస్సార్ సీపీ శాసన సభా పక్ష నేత, ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వినతి పత్రం అందించారు. ఆదర్శ రైతులకు అండగా నిలుస్తానని ఆయన హామీ ఇచ్చారన్నారు. -
'రైతులు చెరువుల్లోని మట్టి వాడుకోవచ్చు'
హైదరాబాద్: ఉపాధి హామీ పథకం కింద 2014-15 ఏడాదికి రూ.4 వేల కోట్లు ఖర్చుచేయనున్నామని ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు. పేదలకు నిర్మించే ఇళ్లకు కూలీల ఖర్చు నిమిత్తం 25 శాతం రుణం ఇంటి యజమానికి ఇస్తామన్నారు. గ్రామాల్లో ప్రతి ఇంటి మరుగుదొడ్ల నిర్మాణానికి ఉపాధి హామీ వర్తింపచేస్తామన్నారు. 2014-15 ఏడాదికి 90 వేల ఎకరాల్లో ఉద్యానవన పంటలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. దీనికోసం ఎంపిక చేసిన ఆదర్శ రైతులకు మొక్కలు, ఖర్చులు, నీరు మూడేళ్ల వరకూ ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొన్నారు. మాగాని, వర్షధారంతో సాగు చేసే రైతులకు ఉపాధిహామీ పథకాన్ని అనుసంధానం చేస్తామన్నారు. వ్యవసాయం తెలియనివారిని ఆదర్శ రైతులుగా గత ప్రభుత్వం నియమించిందని వారిని తొలగిస్తామని తెలిపారు. గ్రామాల్లో ఉన్న ప్రతి చెరువును అభివృద్ధి చేస్తామన్నారు. రైతులు కూడా ఆ చెరువుల్లోని మట్టి వాడుకోవచ్చని అయ్యన్నపాత్రుడు చెప్పారు. -
అడ్రస్‌లేని ఆదర్శ రైతులు
టేక్మాల్, న్యూస్‌లైన్: రైతులకు అందుబాటులో ఉండి సలహాలు సూచనలు ఇవ్వాల్సిన ఆదర్శ రైతులు అడ్రస్ లేకుండా పోయారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, పంటల సాగులో మెలకులు రైతుల దరి చేరడం లేదు. ప్రతి నెలా వెయ్యి రూపాయల గౌరవ వేతనం అందుకుంటున్న ఆదర్శ రైతులు ఏ ఒక్కరికి కూడా ఉపయోగపడడం లేదు. ప్రజాప్రతినిధుల ఆశీస్సులతో ఎంపికైన సదరు వ్యక్తులు వ్యవసాయ శాఖ అధికారులను సైతం లెక్కచేయడం లేదన్న ఆరోపణలున్నాయి. రైతులకు, అధికారులకు మధ్య వారధిగా ఉండేందుకు వీలుగా ఆదర్శ రైతుల వ్యవస్థను 2005లో ప్రవేశపెట్టారు. వీరికి నెలకు వెయ్యి రూపాయల గౌరవ వేతనం చెల్లిస్తున్నారు. వ్యవసాయ శాఖ అమలు చేస్తున్న పథకాలు, సబ్సిడీ, ఎరువులు, విత్తనాల సమాచారాన్ని రైతులకు చేరవేయడం, పంటల సాగులో సలహాలు, సూచనలు ఇవ్వడం వీరి విధి. భూసార పరీక్షలు, ఏయే సీజన్లో ఎలాంటి పంటలు వేయాలో రైతులకు వివరించాలి. ఎరువుల మోతాదును తెలియ జేయాలి. మండలంలో 18 మంది ఆదర్శ రైతులు ఉన్నా ఇందులో ఏ ఒక్కరు కూడా తమ విధులను సక్రమంగా నిర్వర్తించడం లేదని సమాచారం. వీరంతా సొంత పనులు చేసుకుంటూ ప్రభుత్వం నుంచి వచ్చే గౌరవ వేతనం తీసుకోవడానికే సరిపోతున్నారన్న ఆరోపణలున్నాయి. సబ్సిడీ పథకాలను సైతం కొందరు ఆదర్శ రైతులు స్వాహా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆదర్శ రైతులు అందుబాటులో లేకపోవడంతో రైతులు వ్యవసాయ శాఖ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఏ చిన్న పనిపడినా వీరు అధికారులనే సంప్రదించాల్సి వస్తుంది. ఆదర్శ రైతుల కారణంగా పైసా ప్రయోజనం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదర్శ రైతులకు రాజకీయ నేతల పలుకుబడి ఉండడంతో అధికారులు సైతం గట్టిగా చెప్పలేక పోతున్నారు. వీరి పనితీరుపై ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించి ఊరుకుంటున్నారు. కాగా ఎట్టకేలకు ఇద్దరు ఆదర్శ రైతులకు హెచ్చరిక నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది.