టేక్మాల్, న్యూస్‌లైన్: రైతులకు అందుబాటులో ఉండి సలహాలు సూచనలు ఇవ్వాల్సిన ఆదర్శ రైతులు అడ్రస్ లేకుండా పోయారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, పంటల సాగులో మెలకులు రైతుల దరి చేరడం లేదు. ప్రతి నెలా వెయ్యి రూపాయల గౌరవ వేతనం అందుకుంటున్న ఆదర్శ రైతులు ఏ ఒక్కరికి కూడా ఉపయోగపడడం లేదు. ప్రజాప్రతినిధుల ఆశీస్సులతో ఎంపికైన సదరు వ్యక్తులు వ్యవసాయ శాఖ అధికారులను సైతం లెక్కచేయడం లేదన్న ఆరోపణలున్నాయి.
రైతులకు, అధికారులకు మధ్య వారధిగా ఉండేందుకు వీలుగా ఆదర్శ రైతుల వ్యవస్థను 2005లో ప్రవేశపెట్టారు. వీరికి నెలకు వెయ్యి రూపాయల గౌరవ వేతనం చెల్లిస్తున్నారు. వ్యవసాయ శాఖ అమలు చేస్తున్న పథకాలు, సబ్సిడీ, ఎరువులు, విత్తనాల సమాచారాన్ని రైతులకు చేరవేయడం, పంటల సాగులో సలహాలు, సూచనలు ఇవ్వడం వీరి విధి. భూసార పరీక్షలు, ఏయే సీజన్‌లో ఎలాంటి పంటలు వేయాలో రైతులకు వివరించాలి. ఎరువుల మోతాదును తెలియ జేయాలి. మండలంలో 18 మంది ఆదర్శ రైతులు ఉన్నా ఇందులో ఏ ఒక్కరు కూడా తమ విధులను సక్రమంగా నిర్వర్తించడం లేదని సమాచారం.
వీరంతా సొంత పనులు చేసుకుంటూ ప్రభుత్వం నుంచి వచ్చే గౌరవ వేతనం తీసుకోవడానికే సరిపోతున్నారన్న ఆరోపణలున్నాయి. సబ్సిడీ పథకాలను సైతం కొందరు ఆదర్శ రైతులు స్వాహా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆదర్శ రైతులు అందుబాటులో లేకపోవడంతో రైతులు వ్యవసాయ శాఖ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఏ చిన్న పనిపడినా వీరు అధికారులనే సంప్రదించాల్సి వస్తుంది.
ఆదర్శ రైతుల కారణంగా పైసా ప్రయోజనం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదర్శ రైతులకు రాజకీయ నేతల పలుకుబడి ఉండడంతో అధికారులు సైతం గట్టిగా చెప్పలేక పోతున్నారు. వీరి పనితీరుపై ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించి ఊరుకుంటున్నారు. కాగా ఎట్టకేలకు ఇద్దరు ఆదర్శ రైతులకు హెచ్చరిక నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది.
అడ్రస్‌లేని ఆదర్శ రైతులు
Published Fri, Feb 7 2014 11:46 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement