
మూడు వారాలు అసెంబ్లీ నిర్వహించే యోచన
తొలిరోజు గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభలు ప్రారంభం
28న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి
భద్రత పేరుతో ఆంక్షలు పెంచిన ప్రభుత్వం
కూటమి నేతలు మినహా ఇతరులకు పరిమితంగా పాసులు
సాక్షి, అమరావతి: శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 10 గంటలకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. అనంతరం సభ వాయిదా పడనుంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన జరిగే బీఏసీ సమావేశంలో సభను ఎన్ని రోజులు నిర్వహించాలి? ప్రవేశ పెట్టాల్సిన బిల్లులు, చర్చించాల్సిన అంశాలు, తీర్మానాలను నిర్ణయిస్తారు.
ప్రాథమికంగా మూడు వారాలపాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. 25వ తేదీన గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టి చర్చిస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 26, 27వ తేదీల్లో సభకు సెలవు ఇవ్వనున్నారు. 28వ తేదీన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శాసన సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దానికి ముందు మంత్రివర్గం సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత సభను వాయిదా వేసే అవకాశం ఉంది. మార్చి 1, 2వ తేదీలు సెలవు రోజులు కావడంతో తిరిగి 3వ తేదీన సభ ప్రారంభం కానుంది.
⇒ ఈ సమావేశాలకు ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ కాంగ్రెస్ పార్టీ సభ్యులు హాజరవుతారనే సమాచారంతో ఆంక్షలు పెంచారు. భద్రత పేరుతో మంత్రులు, ఎమ్మెల్యేల ప్రవేశాలు, రాకపోకలకు సంబంధించి నిబంధనలను పెంచారు. అసెంబ్లీ, శాసన మండలికి వెళ్లేందుకు వేర్వేరు రంగులతో పాస్‌లు ఇచ్చారు. అధికారులు, మీడియా, విజిటర్లు, పోలీసులకు ప్రత్యేక పాస్‌లు జారీ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమికి చెందిన పార్టీలకు ఎన్ని కావాలంటే అన్ని పాసులు జారీ చేసి వైఎస్సార్‌సీపీకి మాత్రం చాలా పరిమితంగా పాసులు ఇచ్చారు.