కొబ్బరి రైతుల కష్టాలు తీరడం లేదు. కొబ్బరి డొక్కల నుంచి పీచు తీసిన వారికి కాయిర్ బోర్డు మొండిచేయే చూపిస్తోంది. ఏటా శిక్షణల పేరుతో నిధులు ఖర్చు చేస్తున్నా ప్రయోజనం శూన్యంగానే ఉంది. రైతులకు పైసా రుణం కూడా మంజూరు కావడం లేదు. రైతులు మురికి కూపాల్లోనే కొబ్బరి డొక్కలను నానబెట్టి బాగా కుళ్లిన అనంతరం డొక్క పైన ఉన్న పొరను తీసేసి పీచుతయారు చేస్తున్నారు. దీంతో రోగాలు, చర్మవ్యాధుల భారిన పడుతున్నారు.
-వజ్రపుకొత్తూరు
పీచు పరిశ్రమ కలేనా..?
పలాస నియోజక వర్గంలో వజ్రపుకొత్తూరు, మందస, పలాస మండలాల్లో సుమారు 25,000 హెక్టార్లలో కొబ్బరి తోటలు సాగులో ఉన్నాయి. వీటి నుంచి 15 రోజులకోసారి సుమారు 70 టన్నుల కొబ్బరి డొక్కలు లభ్యమవుతున్నాయి. అత్యధికంగా 30 టన్నుల పైబడి కొబ్బరి డొక్కలు ఉత్పత్తి అవుతున్న వజ్రపుకొత్తూరు మండలంలో పీచు పరిశ్రమ ఏర్పాటు చేస్తే 70 టన్నుల కొబ్బరి డొక్కల నుంచి పీచుతీసి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసే అవకాశం ఉంటుంది.
పీచు ఉత్తత్తులు తయారు చేసే పరిశ్రమలు కూడా వెలసే అవకాశం ఉంది. ఇప్పటికే నూకలవానిపేట, దున్నవాని పేట, అమలపాడు, పూడిజగన్నాథపురం, పల్లివూరు, హుకుంపేట, శెగిడిపేట గ్రామాల్లో పీచుతో వివిధ రకాల ఉత్పత్తులు తయారుచేసి పూండి, పలాస మార్కెట్‌లలో విక్రయిస్తున్నారు. పీచుపరిశ్రమ ఏర్పాటుచేస్తే యంత్రాలతో సులభంగా పీచు తయారు చేయవచ్చని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఈ ప్రాంతీ యులు మొత్తుకుంటున్నా ప్రభుత్వం ఆ మేరకు చర్యలు తీసుకోవడం లేదు. పరిశ్రమ ఏర్పాటు కలగానే మిగిలిందంటూ రైతులు వాపోతున్నారు. కాయిర్ బోర్డు అధికారులు స్పందించి పీచు పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆర్థిక సహకారం లేదు...
వజ్రపుకొత్తూరు మండలంలో పీచు పరిశ్రమ ఏర్పాటుచేసి పీచు తీసేందుకు యంత్రాలు అందజేస్తామని వెలుగు, గ్రామీణాభివృద్ధి సంస్థలు చెప్పినా ఇంతవరకు యంత్రాలు అందించలేదు. కనీసం ఆర్థిక సహకారం కూడా చేయలేదు. తాము ఉప్పుటేరులో డొక్కలు నానబెట్టి పీచు వడుకుతూ వస్తువులు తయారు చేస్తున్నాం. బ్యాంకులు కూడా రుణాలు అందించడం లేదు. నాబార్డు సహా యం ఇస్తుందని సమావేశాలు పెట్టారు. తరువాత వాళ్లు కనిపించడమే మానేశారు.
- కె.ఢిల్లేశ్వరరావు, కొబ్బరి రైతు, పూడిలంక
ప్రతిపాదించాం...
వజ్రపుకొత్తూరు మండలంలోని అమలపాడు గ్రామంలో పీచు పరి శ్రమ ఏర్పాటుకు ప్రతిపాదించాం. సహకార సంఘం ఏర్పాటు చేసి అందులో 20 మంది వరకు సభ్యులను చేర్చి నాబార్డు సహకరాంతో 60 శాతం సబ్సిడీ ద్వారా కాయిర్ బోర్డు స్మాల్‌స్కేల్ ఇండస్ట్రీలు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాం. రైతులు సహకరించి ఫీజుబిలిటీ లభిస్తే పరిశ్రమ ఏర్పాటు అవుతుంది.
- ఎం.లావణ్య, ఉద్యానవనశాఖ అధికారి, వజ్రపుకొత్తూరు
కష్టాల్లో కొబ్బరి రైతు..!
Published Sat, Jul 11 2015 4:20 AM | Last Updated on Sun, Sep 3 2017 5:15 AM
Advertisement