డోకులపాడు(వజ్రపుకొత్తూరు): కడలి కల్లోలమైంది. మత్స్యకారుని గుండె చెరువైంది. వేట సాగక అలల ఉధృతికి పూడగడవని పరిస్థితి నెలకొంది. పైగా గత 20 ఏళ్లుగా లేని పరిస్థితులు నేడు ఉత్పన్నమవుతుండడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం వజ్రపుకొత్తూరు మండలంలోని డోకులపాడు నుంచి బైపల్లి వరకు తీరం కోతకు గురవ్వడమే గాకుండా తీరం వెంబడి ఉన్న సరుగుడు వనాలు ధ్వంసమయ్యాయి. జీడి, కొబ్బరి రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. అల్పపీడ ప్రభావంతో తీరం వెంబడి అలలు 20 మీటర్లు ఎత్తున ఎగసిపడి కల్లోలం సృష్టించిందని, 70మీటర్ల ముందుకు సముద్రం వచ్చేసిందని మత్స్యకారులు తెలిపారు. ఇప్పటివరకూ లోతట్టు ప్రాంతాలైన మంచినీళ్లపేట, దేవునల్తాడ, బైపల్లి తీరాల్లో మాత్రమే గతంలో సముద్రకోత ఉండేది. ఈసారి ఇక్కడ సముద్రం ముందుకు రావడం ఆందోళన కలిగిస్తోందని చెబుతున్నారు.
సరుగుడు వనాలకు నష్టం
మండలంలో గ్రీన్ బెల్టు ప్రాంతం ఉంది. తీరం వెంబడి అప్పట్లో అటవీశాఖ, రైతులు సంయుక్తంగా సరుగుడు వనాలు పెంచారు. ఇంకా రైతులు తమ జీడి, కొబ్బరి తోటలకు ఆనుకుని అలల ఉధృతినుంచి రక్షణగా ఇసుక దిబ్బలపై సరుగుడు వనాలు పెంచారు. ఉవ్వెత్తున ఎగసిన అలలు 20 అడుగులు ఎత్తులో ఉన్న ఇసుక దిబ్బలను, సరుగుడు వనాలను తాకడంతో ఏడుకిలో మీటర్లు మేర తీరం కోతకు గురైంది. సుమారు 20 మంది రైతులకు చెందిన సరుగుడు తోటల్లోని 40 వరకు చెట్లు సముద్రంపాలై నీటిలో కొట్టుకుపోయి వివిధ తీరాలకు చేరాయని రైతులు చెబుతున్నారు. ఉప్పు నీటి ప్రభావం వల్ల తమ జీడి, కొబ్బరి చెట్లు పాడవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రక్షణ చర్యలు శూన్యం
వజ్రపుకొత్తూరు తీర ప్రాంతంలో ఐదే ళ్లుగా సముద్రం ముందుకు వచ్చి నష్టం కలిగిస్తున్న విషయం అధికారులకు తెలిసినా చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు. ప్రస్తుతం తీరం వెంబడి పరిశ్రమల స్థాపనకు సర్వేలు చేస్తున్నారు తప్ప తీర ప్రాంతంలో ప్రజలకు ఎదురవుతున్న ముప్పుపై ఎలాంటి పరిశోధనలు జరగడం లేదని వాపోతున్నారు.
ఎన్నడూ చూడలేదు
నాకు 36 ఏళ్లు. 15 ఏళ్లుగా సంద్రంలో చేపల వేట చేస్తున్నాను. ఎప్పుడూ ఈ స్థాయిలో అలల ఉధృతి చూడలేదు. పైగా ఈ స్థాయిలో తీరం కోతకు గురవడం చూస్తే భయమేస్తోంది. ప్రస్తుతం తీరం కల్లోలంగా ఉంది. దీని వల్ల వేట సాగడం లేదు. -వై. పాపారావు, మత్స్యకారుడు, డోకులపాడు.
కల్లోల కడలి
Published Sat, Jul 18 2015 12:30 AM | Last Updated on Sun, Sep 3 2017 5:41 AM
Advertisement
Advertisement