అఖిల భారత కొబ్బరి రైతుల సదస్సులో నిర్ణయం
సాక్షి, అమలాపురం: ‘కొబ్బరి మార్కెటింగ్‌లో మాకు ఎదురవుతున్న సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరిస్తే సాగుబాట పడతాం. కాదని వాటిని విస్మరిస్తే ఉద్యమ బాట పడతాం’ అని అఖిల భారత కొబ్బరి రైతుల సదస్సులో రైతులు తేలి్చచెప్పారు. భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్) ఆధ్వర్యంలో అమలాపురంలో రెండు రోజుల అఖిల భారత కొబ్బరి రైతుల సదస్సు రెండవ రోజైన బుధవారం పలు తీర్మానాలు ఆమోదించారు. సమస్యల పరిష్కారం కోసం కొబ్బరి సాగు చేసే రాష్ట్రాల్లోని ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కలుస్తామని సభలో వక్తలు ప్రకటించారు.
సదస్సు అధ్యక్షుడు, బీకేఎస్ ఆలిండియా కోకోనట్ కనీ్వనర్ సుందరరాజన్ మాట్లాడుతూ.. కొబ్బరి సాగులో సమస్యలను తెలుసుకునేందుకు.. వాటి పరిష్కారాల కోసం జాతీయ స్థాయిలో కొబ్బరి రైతుల ఫోరం ఏర్పాటు చేశామని, దీనిలో భాగంగా ఇప్పటివరకు మూడు రాష్ట్రాల్లో సదస్సులు పూర్తి చేశామని తెలిపారు. బీకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి మోహన్ మిశ్రా మాట్లాడుతూ.. దేశంలో కొబ్బరి సాగు చేసే ఎనిమిది రాష్ట్రాల్లో ఇలాంటి సదస్సులు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని, ఆ రాష్ట్రాల రైతు ప్రతినిధులతో చర్చించాక అజెండా రూపొందించి ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తామని చెప్పారు.
బీకేఎస్ జాతీయ కార్యవర్గ సభ్యుడు జలగం కుమారస్వామి మాట్లాడుతూ.. మన సమస్యలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పరిష్కరిస్తే సరే, లేకుంటే మనమంతా సంఘటితమై ఉద్యమం చేయాల్సి ఉంటుందన్నారు. కోనసీమ రైతులు 2011లో చేసిన సాగుసమ్మె ఉద్యమం వల్ల రూ. లక్ష వరకు వడ్డీ లేని రుణం, రూ. మూడు లక్షల వరకు పావలా వడ్డీ రుణం, సమీకృత వ్యవసాయానికి నిధులు పొందిన విషయాన్ని రైతులు గుర్తించుకోవాలని తెలిపారు. దక్షిణ భారత రైతులు ఒక్కతాటిపైకి వచ్చి పోరాటం చేయాల్సి ఉందని ఆయన చెప్పారు.
కొబ్బరి సమస్యలకు ఏఐ పరిష్కారం..
కొబ్బరి బోడకాయను కేజీ రూ. 45 చేసి కొనుగోలు చేయాలని, ఎఫ్‌పీవోలు, సహకార సంఘాల ద్వారా కొబ్బరి కొనుగోలు చేయించాలని, యాంత్రీకరణకు రాయితీలు ఇవ్వడంతో పాటు కొబ్బరి దింపు సమస్య పరిష్కారానికి ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్సీ (ఏఐ)లో ప్రయోగాలకు ఐఐటీ, ఇస్రో వంటి సంస్థల సహకారం తీసుకోవడం వంటి తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.
ఐక్యరాజ్య సమితి 2026ను కొబ్బరి సంవత్సరంగా గుర్తించాలని, ఇందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేయాలనే తీర్మానాన్ని సైతం రైతులు ఆమోదించారు. సదస్సుకు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, విశాఖపట్నం జిల్లాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా కొబ్బరి ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాల్స్ పలువురిని ఆకట్టుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment