జాతీయ స్థాయికి కొబ్బరి సమస్యలు..పరిష్కారాలకు పలు సూచనలు
అమలాపురంలో అఖిల భారత కొబ్బరి రైతుల సదస్సు తొలిరోజు పలు తీర్మానాలు
సహకార సంఘాల ద్వారా కొబ్బరి కొనుగోలు చేయాలి..
కొబ్బరి బోడ కాయలను కిలో రూ.45కి కొనాలి..
ఉత్పత్తి వ్యయం కాయకు రూ.15 అయితే వచ్చే ధర రూ.9 నుంచి రూ.10 మాత్రమే
సాక్షి, అమలాపురం: ప్రపంచంలోనే లాంగెస్ట్ అండ్ టాలెస్ట్ క్రాప్‌గా గుర్తింపు పొందిన కొబ్బరి సాగులో రైతులు వివిధ రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని, వాటి పరిష్కారానికి రైతులు, రైతు సంఘాల నాయకులు చేస్తున్న సూచనలను కేంద్రానికి, ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు నివేదిస్తామని జాతీయ కొబ్బరి సదస్సులో వక్తలు తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని జనహిత భవనంలో భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్) ఆధ్వర్యంలో రెండ్రోజుల పాటు జరిగే అఖిల భారత కొబ్బరి రైతుల సదస్సు మంగళవారం ప్రారంభమైంది.
ఈ సందర్భంగా భారతీయ కిసాన్ సంఘ్ ఆలిండియా కోకోనట్ కన్వినర్ సుందరరాజన్ అధ్యక్షతన దక్షిణాది రాష్ట్రాల కొబ్బరి రైతుల సమస్యలు, పరిష్కార సూచనలపై చర్చాగోíÙ్ఠ జరిగింది. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. కొబ్బరి సాగు, యాజమాన్య పద్ధతులు, కొబ్బరికాయ సేకరణ, రవాణా, ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ అవకాశాల్లో ఎదురవుతున్న సమస్యలను, వాటికి పరిష్కారాలను సూచించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కొబ్బరి అభివృద్ధి బోర్డు (సీడీబీ), కాయర్ బోర్డు, పరిశ్రమల సంస్థలు, ఏజెన్సీల సహాయ నిరాకరణపై సుదీర్ఘ చర్చ జరిగింది. సమావేశానంతరం పలు తీర్మానాలు రూపొందించారు. వీటిని బుధవారం అమలాపురం కిమ్స్ ఆస్పత్రిలో జరిగే రెండోరోజు సదస్సులో మరోసారి చర్చించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదించనున్నట్లు బీకేఎస్ ప్రతినిధులు తెలిపారు.
తీర్మానాలు ఇలా..
» ఎండు కొబ్బరితోపాటు కొబ్బరి బోడకాయ (వలిచిన కాయ)ను కిలో రూ.45 ధర నిర్ణయించి ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేయాలి..
» ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్)ల ద్వారా కూడా కొబ్బరి కొనుగోలు చేయాలనే ప్రధాన తీర్మానాలతోపాటు దింపు యంత్రాలను రాయితీలపై అందించాలి..
» రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్‌పీఓ)ల ఏర్పాటుకు సహకారం, మార్కెటింగ్ సౌకర్యాలు పెంచాలి..
» వాతావరణ, దిగుబడి ఆధారిత బీమా సౌకర్యం, అధిక దిగుబడి ఇచ్చే వంగడాలను తక్కువ ధరకు అందించాలి..
» కొబ్బరి చెట్టును ఔషధ గుణమైన చెట్టుగా గుర్తించాలి..
» కొబ్బరిని పరిశ్రమగా గుర్తించడంతోపాటు రాయితీల కల్పన, పాతచెట్ల తొలగింపు పథకం ఆర్‌అండ్‌ఆర్‌కు అందించే ప్రోత్సాహాన్ని చెట్టుకు రూ.వెయ్యి నుంచి రూ.2,500కు పెంచారు.
Comments
Please login to add a commentAdd a comment