World Coconut Day: రైతుకు సిరి.. ఉపాధికి ఊపిరి | World Coconut Day 2022: Konaseema Coconut Farmers, Businessmen, Workers Views | Sakshi
Sakshi News home page

World Coconut Day: రైతుకు సిరి.. ఉపాధికి ఊపిరి

Sep 2 2022 5:05 PM | Updated on Sep 2 2022 5:05 PM

World Coconut Day 2022: Konaseema Coconut Farmers, Businessmen, Workers Views - Sakshi

సాక్షి అమలాపురం/ అంబాజీపేట (పి.గన్నవరం): కొబ్బరి అనగానే కోనసీమ గుర్తుకు వస్తుంది. రాష్ట్రంలో మూడు లక్షల ఎకరాల్లో సాగు జరుగుతుండగా, సుమారు 93 వేల ఎకరాలకు పైగా కోనసీమలోనే ఉంది. 70 వేల మందికిపైగా రైతులు కొబ్బరి సాగుపై ఆధారపడి జీవిస్తున్నారు. దీర్ఘకాలిక ఉద్యాన పంటల్లో ఒకటిగా... నెలనెలా క్రమం తప్పకుండా ఆదాయాన్ని అందించే పంటగా పేరొందింది. అంతేకాదు కొబ్బరి నుంచి సుమారు 160 రకాలకు పైగా ఉత్పత్తులను తయారు చేసే అవకాశముంది. ఇంత విలువైన బంగారు పంటపై రైతులే కాకుండా దింపు, వలుపు, తరుగు కార్మికులుగా, మోత, రవాణా కూలీలుగా వేలాది మంది జీవిస్తున్నారు. 


జిల్లాలో సుమారు ఐదు వేల మంది వరకు నేరుగా ఉపాధి పొందుతున్నారు. కాయర్‌ ఉత్పత్తి పరిశ్రమల ద్వారా నిరుద్యోగ యువత ఉపాధి పొందుతుండగా, కూలీలుగానే కాకుండా పీచుతో కళాత్మక ఉత్పత్తుల తయారీతో మహిళలు జీవనం సాగిస్తున్నారు. కొబ్బరి ఎగుమతి, దిగుమతుల చిరు వ్యాపారుల నుంచి బడా వ్యాపారుల వరకు దళారులు, ట్రాన్స్‌పోర్టు యాజమానులు ఇలా వేలాది మంది ఉపాధికి కొబ్బరి ఊపిరిగా నిలుస్తోంది. సెప్టెంబర్‌ 2వ తేదీ అంతర్జాతీయ కొబ్బరి దినోత్సవం సందర్భంగా నారికేళంతో వివిధ వర్గాల జీవనం పెనవేసుకుపోయిన తీరుపై కథనం... 

చిన్ననాటి నుంచి అనుబంధం 
కొబ్బరితో చిన్ననాటి నుంచి అనుబంధం ఉంది. మా కొబ్బరి తోటల్లో ఇంచుమించు ప్రతీ చెట్టు చిన్నప్పుడు నేను సేకరించి విత్తనాల నుంచి మొలక వచ్చినదే. అందుకే వీటితో నాకు సొంత పిల్లలతో ఉన్నంత అనుబంధం ఉంది. బహుశా అందుకేనేమో పెద్దలు కొబ్బరి చెట్టును కన్న కొడుకుతో పోలుస్తారు. 1960ల నుంచి కోనసీమలో కొబ్బరిసాగు బాగా పెరిగింది. మా లంక గ్రామాల్లో ఇది 1980 నుంచి ఆరంభమైంది.  
– గోదాశి నాగేశ్వరరావు, కొబ్బరి రైతు, లంకాఫ్‌ ఠాన్నేల్లంక

మాది నాలుగవ తరం 
కురిడీ వ్యాపారంలో మాది నాలుగవ తరం. 60 ఏళ్లకు పైగా మా కుటుంబం ఈ వ్యాపారంలో భాగస్వామిగా ఉంది. ఈ వ్యాపారాన్ని ఇష్టపడి చేయాలని, నిజాయితీగా ఉండాలని మా పెద్దలు చెప్పేవారు. దేశంలో కురిడీ వ్యాపారంలో మాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉందంటే దీని వల్లే. వ్యాపారం కన్నా ముందు రైతులుగా కొబ్బరి చెట్టును ప్రేమిస్తాం. బహుశా దాని వల్లనేమో కొబ్బరి మా జీవితాల్లో ఇంతగా కలిసిపోయింది. మా తరువాత తరం కూడా ఇదే వ్యాపారాన్ని కొనసాగిస్తోంది.  
– అప్పన బాలాజీ, కురిడీ కొబ్బరి వ్యాపారి, మాచవరం, అంబాజీపేట మండలం 

మూడున్నర దశాబ్దాలుగా ఆయిల్‌ వ్యాపారం 
మాది కొబ్బరి నూనె వ్యాపారం. మూడున్నర దశాబ్దాలుగా ఇదే వ్యాపారం చేస్తున్నాం. అంబాజీపేటలో ఉత్పత్తి అయ్యే స్వచ్ఛమైన కొబ్బరి నూనెలో మాది ఒకటిగా పేరొచ్చింది. గతంలో రైతులు కొబ్బరి ఎండబెట్టి సొంతంగా ఆయిల్‌ తయారు చేయించుకునేవారు. ఇప్పుడు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే మా పిల్లలు సైతం ఈ వ్యాపారంలో భాగస్వాములుగా ఉన్నారు.  
– గెల్లి నాగేశ్వరరావు, కొబ్బరి నూనె వ్యాపారి, అంబాజీపేట 

60 ఏళ్లుగా ఇక్కడే 
రాజస్థాన్‌లోని నాగూర్‌ మాది. మా తండ్రితోపాటు మా కుటుంబ సభ్యులు 60 ఏళ్లకు ముందే ఇక్కడకు వచ్చి స్థిరపడ్డాం. అప్పుడు నా వయస్సు రెండేళ్లు. తొలి నుంచి మాది కొబ్బరి కమీషన్‌ వ్యాపారం. కోనసీమ కొబ్బరి ఉత్తరాదికి పంపడంలో మా కుటుంబం కీలకంగా ఉండేది. అన్నదమ్ములమంతా ఇక్కడ కమీషన్‌ వ్యాపారం చేసేవాళ్లం. 1980 నుంచి 1996 వరకు కోనసీమ కొబ్బరి దేశీయ మార్కెట్‌లో ఉజ్వలంగా ఎదిగింది. తుపాను వచ్చిన తరువాత బాగా దెబ్బతింది. ఇప్పటికీ కమీషన్‌ వ్యాపారం జరుగుతున్నా అంతగా లేదు.  
– సంపత్‌ కుమార్‌ ఫారిక్, కొబ్బరి కమీషన్‌ వ్యాపారి, అంబాజీపేట

కొబ్బరి వలుపే జీవనాధారం 
ఇప్పుడు నా వయస్సు 49. నా పదిహేనవ ఏట నుంచి కొబ్బరి వలువులో జీవనోపాధి పొందుతున్నాను. ఈ పని తప్ప మరొకటి రాదు. కుటుంబాన్ని పెంచి పోషించింది కూడా ఈ వృత్తిలోనే. నేనే కాదు చాలామంది మా వలుపు కార్మికులకు మరోపని రాదు. ఇన్నేళ్లుగా కొబ్బరితోనే మా జీవనం సాగిపోతోంది.  
– విప్పర్తి సత్యనారాయణ (బంగారి), పోతాయిలంక, అంబాజీపేట మండలం

పరాయి రాష్ట్రమైనా కొబ్బరే ఆధారం 
మాకు స్థానికంగా పనులు లేక తమిళనాడులోని కాంగేయం వెళ్లిపోయాం. పరాయి రాష్ట్రానికి వెళ్లినా జీవనోపాధికి కొబ్బరి మీదనే ఆధారపడాల్సి వస్తోంది. నేను గడిచిన ఆరు ఏళ్లుగా తమిళనాడులో ఎండు కొబ్బరి తరిగే పనిచేస్తున్నాను.  
– దోనిపూడి దుర్గాప్రసాద్, తరుగు కార్మికుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement