coconut day
-
World Coconut Day: రైతుకు సిరి.. ఉపాధికి ఊపిరి
సాక్షి అమలాపురం/ అంబాజీపేట (పి.గన్నవరం): కొబ్బరి అనగానే కోనసీమ గుర్తుకు వస్తుంది. రాష్ట్రంలో మూడు లక్షల ఎకరాల్లో సాగు జరుగుతుండగా, సుమారు 93 వేల ఎకరాలకు పైగా కోనసీమలోనే ఉంది. 70 వేల మందికిపైగా రైతులు కొబ్బరి సాగుపై ఆధారపడి జీవిస్తున్నారు. దీర్ఘకాలిక ఉద్యాన పంటల్లో ఒకటిగా... నెలనెలా క్రమం తప్పకుండా ఆదాయాన్ని అందించే పంటగా పేరొందింది. అంతేకాదు కొబ్బరి నుంచి సుమారు 160 రకాలకు పైగా ఉత్పత్తులను తయారు చేసే అవకాశముంది. ఇంత విలువైన బంగారు పంటపై రైతులే కాకుండా దింపు, వలుపు, తరుగు కార్మికులుగా, మోత, రవాణా కూలీలుగా వేలాది మంది జీవిస్తున్నారు. జిల్లాలో సుమారు ఐదు వేల మంది వరకు నేరుగా ఉపాధి పొందుతున్నారు. కాయర్ ఉత్పత్తి పరిశ్రమల ద్వారా నిరుద్యోగ యువత ఉపాధి పొందుతుండగా, కూలీలుగానే కాకుండా పీచుతో కళాత్మక ఉత్పత్తుల తయారీతో మహిళలు జీవనం సాగిస్తున్నారు. కొబ్బరి ఎగుమతి, దిగుమతుల చిరు వ్యాపారుల నుంచి బడా వ్యాపారుల వరకు దళారులు, ట్రాన్స్‌పోర్టు యాజమానులు ఇలా వేలాది మంది ఉపాధికి కొబ్బరి ఊపిరిగా నిలుస్తోంది. సెప్టెంబర్ 2వ తేదీ అంతర్జాతీయ కొబ్బరి దినోత్సవం సందర్భంగా నారికేళంతో వివిధ వర్గాల జీవనం పెనవేసుకుపోయిన తీరుపై కథనం... చిన్ననాటి నుంచి అనుబంధం కొబ్బరితో చిన్ననాటి నుంచి అనుబంధం ఉంది. మా కొబ్బరి తోటల్లో ఇంచుమించు ప్రతీ చెట్టు చిన్నప్పుడు నేను సేకరించి విత్తనాల నుంచి మొలక వచ్చినదే. అందుకే వీటితో నాకు సొంత పిల్లలతో ఉన్నంత అనుబంధం ఉంది. బహుశా అందుకేనేమో పెద్దలు కొబ్బరి చెట్టును కన్న కొడుకుతో పోలుస్తారు. 1960ల నుంచి కోనసీమలో కొబ్బరిసాగు బాగా పెరిగింది. మా లంక గ్రామాల్లో ఇది 1980 నుంచి ఆరంభమైంది. – గోదాశి నాగేశ్వరరావు, కొబ్బరి రైతు, లంకాఫ్ ఠాన్నేల్లంక మాది నాలుగవ తరం కురిడీ వ్యాపారంలో మాది నాలుగవ తరం. 60 ఏళ్లకు పైగా మా కుటుంబం ఈ వ్యాపారంలో భాగస్వామిగా ఉంది. ఈ వ్యాపారాన్ని ఇష్టపడి చేయాలని, నిజాయితీగా ఉండాలని మా పెద్దలు చెప్పేవారు. దేశంలో కురిడీ వ్యాపారంలో మాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉందంటే దీని వల్లే. వ్యాపారం కన్నా ముందు రైతులుగా కొబ్బరి చెట్టును ప్రేమిస్తాం. బహుశా దాని వల్లనేమో కొబ్బరి మా జీవితాల్లో ఇంతగా కలిసిపోయింది. మా తరువాత తరం కూడా ఇదే వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. – అప్పన బాలాజీ, కురిడీ కొబ్బరి వ్యాపారి, మాచవరం, అంబాజీపేట మండలం మూడున్నర దశాబ్దాలుగా ఆయిల్ వ్యాపారం మాది కొబ్బరి నూనె వ్యాపారం. మూడున్నర దశాబ్దాలుగా ఇదే వ్యాపారం చేస్తున్నాం. అంబాజీపేటలో ఉత్పత్తి అయ్యే స్వచ్ఛమైన కొబ్బరి నూనెలో మాది ఒకటిగా పేరొచ్చింది. గతంలో రైతులు కొబ్బరి ఎండబెట్టి సొంతంగా ఆయిల్ తయారు చేయించుకునేవారు. ఇప్పుడు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే మా పిల్లలు సైతం ఈ వ్యాపారంలో భాగస్వాములుగా ఉన్నారు. – గెల్లి నాగేశ్వరరావు, కొబ్బరి నూనె వ్యాపారి, అంబాజీపేట 60 ఏళ్లుగా ఇక్కడే రాజస్థాన్‌లోని నాగూర్ మాది. మా తండ్రితోపాటు మా కుటుంబ సభ్యులు 60 ఏళ్లకు ముందే ఇక్కడకు వచ్చి స్థిరపడ్డాం. అప్పుడు నా వయస్సు రెండేళ్లు. తొలి నుంచి మాది కొబ్బరి కమీషన్ వ్యాపారం. కోనసీమ కొబ్బరి ఉత్తరాదికి పంపడంలో మా కుటుంబం కీలకంగా ఉండేది. అన్నదమ్ములమంతా ఇక్కడ కమీషన్ వ్యాపారం చేసేవాళ్లం. 1980 నుంచి 1996 వరకు కోనసీమ కొబ్బరి దేశీయ మార్కెట్లో ఉజ్వలంగా ఎదిగింది. తుపాను వచ్చిన తరువాత బాగా దెబ్బతింది. ఇప్పటికీ కమీషన్ వ్యాపారం జరుగుతున్నా అంతగా లేదు. – సంపత్ కుమార్ ఫారిక్, కొబ్బరి కమీషన్ వ్యాపారి, అంబాజీపేట కొబ్బరి వలుపే జీవనాధారం ఇప్పుడు నా వయస్సు 49. నా పదిహేనవ ఏట నుంచి కొబ్బరి వలువులో జీవనోపాధి పొందుతున్నాను. ఈ పని తప్ప మరొకటి రాదు. కుటుంబాన్ని పెంచి పోషించింది కూడా ఈ వృత్తిలోనే. నేనే కాదు చాలామంది మా వలుపు కార్మికులకు మరోపని రాదు. ఇన్నేళ్లుగా కొబ్బరితోనే మా జీవనం సాగిపోతోంది. – విప్పర్తి సత్యనారాయణ (బంగారి), పోతాయిలంక, అంబాజీపేట మండలం పరాయి రాష్ట్రమైనా కొబ్బరే ఆధారం మాకు స్థానికంగా పనులు లేక తమిళనాడులోని కాంగేయం వెళ్లిపోయాం. పరాయి రాష్ట్రానికి వెళ్లినా జీవనోపాధికి కొబ్బరి మీదనే ఆధారపడాల్సి వస్తోంది. నేను గడిచిన ఆరు ఏళ్లుగా తమిళనాడులో ఎండు కొబ్బరి తరిగే పనిచేస్తున్నాను. – దోనిపూడి దుర్గాప్రసాద్, తరుగు కార్మికుడు -
ఉద్దానం పెద్ద కొడుకు
సాక్షి, ఇచ్ఛాపురం: ఒకటా రెండా వందల ఏళ్లుగా ఉద్దానం కడుపు నింపుతోంది. రాకాసి గాలులకు ఎన్నిసార్లు తలలు తెగి పడినా మళ్లీ తన వాళ్ల కోసం నిటారుగా నిలబడింది. కమ్మ నుంచి కాయ వరకు, వేరు నుంచి పువ్వు వరకు అన్నింటినీ రైతు కోసమే ధారబోసింది. రహస్యం తెలుసుకుని మసలుకున్న వాడి పాలిట కల్ప తరువుగా నిలిచింది. అందుకే దేవుడంతటి వాడే దాసోహమైపోయాడు. మానవమాత్రుడేపాటి. కొబ్బరి అందరికీ ఓ పంట. కానీ ఉద్దానానికి మాత్రం ఆత్మబంధువు. ఇక్కడి వారికి అది కేవలం చెట్టు కాదు.. ప్రతి ఇంటికీ పెద్ద కొడుకు. ఉద్దానం పల్లెలు పచ్చగా ఉన్నాయంటే అది కొబ్బరి చలవే. రేపు (సెప్టెంబర్ 2) అంతర్జాతీయ కొబ్బరి దినోత్సవం. ఈ సందర్భంగా నారికేళం చేసే మేలు గురించి తెలుసుకుందాం. దాని మహత్తును గమనించి తరిద్దాం. పల్లె పచ్చగా.. రాష్ట్రంలో రెండో కోనసీమగా ఉద్దానం పేరు పొందింది. విస్తారంగా పరచుకున్న కొబ్బరి తోటలు ఈ ప్రాంతాన్ని పచ్చగా చూస్తున్నాయి. జిల్లాలో కవిటి, కంచిలి, ఇచ్ఛాపురం, సోంపేట మండలాలతో పాటు వజ్రపుకొత్తూరు, మందస, పలాస, రణస్థలం, లావేరు మండలాల్లో 17,540 ఎకరాల్లో కొబ్బరి సాగవుతోంది. జిల్లాలో వేల మంది రైతులు, వ్యాపారులు, కార్మికులకు ప్రత్యక్షంగా, అంతకు రెండు రెట్లు మందికి పరోక్షంగా బతుకునిస్తోంది. కొబ్బరి వల్ల రైతులు ఉత్పత్తుల తయారీ, అంతర పంటల పెంపకానికి కొబ్బరి అభివృద్ధి బోర్డు (సీడీబీ), క్వాయర్ అభివృద్ధి బోర్డు, రాష్ట్ర ఉద్యానవన శాఖ పలు రాయితీలు అందిస్తున్నాయి. 106 రకాలు చేయవచ్చు.. కొబ్బరి నుంచి 106 రకాల విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు, కొబ్బరి అభివృద్ధి బోర్డు ప్రతినిధులు చెబుతున్నారు. రైతులు కనీసం 16 రకాల ఉత్పత్తులను సొంతంగా తయారు చేసుకోవచ్చంటున్నారు. జిల్లాలో సుమారు 50 వేల మంది రైతులు, 50 వేల మంది వ్యాపారులు, కార్మికులు, కూలీలు దీనిపై ఆధారపడి జీవిస్తున్నారు. కొబ్బరిపై ఇంత మంది జీవనోపాధి పొందుతున్న నేపథ్యంలో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై డీసీఎంఎస్ దృష్టి సారించింది. జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ పిరియా సాయిరాజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతో కేంద్ర ఆత్మ నిర్భర్ స్కీమ్ ద్వారా జిల్లాలో కొబ్బరి అనుబంధ పరిశ్రమలతో పాటు ఇతర పరిశ్రమలు ఏర్పాటుకు సుమారు రూ.350 కోట్లు ప్రతిపాదించారు. అందులో కేవలం కొబ్బరి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ కోసం కొబ్బరిని పండించే ఏడు మండలాల్లో కొబ్బరి పరిశ్రమను నెలకొల్పేందుకు సుమారు రూ.200 కోట్లతో ప్రాజెక్ట్ తయారు చేశారు. త్వరలో కార్యరూపం దాల్చనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఎండు కొబ్బరి: వంటలకు ఎక్కువగా వినియోగిస్తారు. ముఖ్యంగా కేకులు, కొబ్బరి నూనె తయారీతో పాటు బయోడీజిల్ తయారీకి సైతం దీన్ని వాడుతుంటారు. కొబ్బరి చిప్స్: అందరూ ఇష్టపడే పొటాటో చిప్స్లానే కొబ్బరి నుంచి చిప్స్ చేసి మార్కెట్లో విక్రయిస్తారు. ఇదింకా కాస్త ఫేమస్ కావాల్సి ఉంది. కొబ్బరి పాలు: వంటలతో పాటు టీ, కాఫీలను కూడా తయారు చేయవచ్చు. కొబ్బరి పాలు శీతలీకరణలో మిల్లింగ్ చేసి వర్జిన్ కోకోనట్ ఆయిల్ తయారు చేస్తారు. కొబ్బరి క్రీమ్: దీన్ని కేకులు, వివిధ రకాల వంట తయారీకి వినియోగిస్తారు. కొబ్బరి తురుము: పంటలతో పాటు కొబ్బరి రకాల పచ్చళ్లలో దీన్ని అధికంగా వాడుతుంటారు. బేకరీల్లో బ్రెడ్లు, బన్స్‌తో తయారు చేసే రకరకాల ఆహారాల్లో వీటిని ఎక్కువగా వినియోగిస్తారు. కేరళలో కొత్తగా కోకోనట్ కురికురీ స్వీట్, హాట్ రకాల్లో తయారీకి కొబ్బరి తరుములు అధికంగా వినియోగిస్తున్నారు. కోకో పికిల్: కొబ్బరితో తయారయ్యే పచ్చళ్లు, ఇవి కాకుండా కోకోనట్ క్రిస్పీ, కొబ్బరి డెసికేటెడ్ పౌడర్, కోకోనట్ క్యాండీ, కోకో మిల్క్ పౌడర్, కోకో సిరప్‌లను తయారు చేసి మార్కెట్ చేసుకునే అవకాశం ఉంది. కొబ్బరి డొక్క: కొబ్బరిలో అత్యంత విలువైనది దీని నుంచి వచ్చే పీచు. పట్టుకు జాతీయ, అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. కొబ్బరి డొక్కల నుంచి పీచు తయారు చేసే పరిశ్రమలు ఉన్నప్పటికీ పీచు నుంచి తాళ్లు, మ్యా ట్లు, ఫైబర్ మ్యాట్లు, కాయర్ జియోటెక్స్, గార్డెన్ ఆర్టికల్స్ (కుండీలు) తయారు చేసే పరిశ్రమలు లేకపోవడం మనకు కాస్త వెలితి. గతంలో కవిటి మండలం బొరివంక, మాణిక్యపురం, రాజపురంలో కంచిలి మండలం తలతంపర, సోంపేట మండలం బారువ గ్రామాల్లో క్వాయర్ ఉత్పత్తులు చేసే పరిశ్రమలు ఉండేవి. అవి ఇప్పుడు మూతపడి శిథిలావస్థకు చేరుకున్నాయి. కంచిలి మండలం కొక్కిలి పుట్టుగ, మజ్జిపుట్టుగ, నాథపుట్టుగ, చంద్రుపుట్టుగ తదితర గ్రామాల్లో బెంతు ఒరియా తెగకు చెందిన కూలీలు చిన్పపాటి చక్రాలతో కొబ్బరి తాళ్లు అల్లుతుంటారు. ప్రస్తుతం కొబ్బరి పొట్టుకు సైతం మంచి డిమాండ్ పెరిగింది. నీటి నిల్వను ఎక్కువ కాలం ఉంచేందుకు వ్యవసాయంలో దీన్ని అధికంగా వినియోగిస్తుంటారు. కొబ్బరి నూనె: ఎండు కొబ్బరిని తరుమును వినియోగించి నూనె తయారు చేస్తారు. ఉద్దానం ప్రాంతాలలో ఎండు కొబ్బరి ముక్కల నుంచి నూనె తయారు చేసే మిల్లులు చాలా ఉన్నాయి. దీనిలో వర్జిన్ కోకోనట్ ఆయిల్ అత్యంత విశిష్టమైంది. దీన్ని ఆహారంగా తీసుకుంటే మనిషిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎయిడ్స్ వంటి వ్యాధి గ్రస్తులకు ఇది చాలా మేలు చేస్తుంది. అంతర్జాతీయంగా దీనికి డిమాండ్ ఉంది. అన్నీ విలువైనవే.. కొబ్బరి కాయ మాత్రమే కాదు చెట్టులో అన్ని భాగాలు విలువైనవే. కొబ్బరిలో బీ6, ఐరన్, మెగ్నీషియం, జింక్ లాంటి శక్తినిచ్చే పోషకాలు ఎన్నో ఉన్నాయి. వందశాతం ఆరోగ్యానికి ఉపయోగకరం. ముఖ్యంగా గుండె పనితీరును ఎంతగానో మెరుగు పరుస్తుంది. ఇక కొబ్బరి కమ్మ పశువుల ఆహారంగానూ, ఇళ్ల పైకప్పుగానూ, శుభకార్యాల సందర్భంలో పచ్చని పందిరిగా ఉపయోగపడుతుంది. ఇక కొబ్బరి ఈనెలలను పరిశీలిస్తే దీన్ని ఒక కుటీర పరిశ్రమగా చెప్పవచ్చు. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలోని కొబ్బరి పంట పండిస్తున్న పల్లెల్లో ఈనెపుల్లల అమ్మకం ఒక ప్రధాన పరిశ్రమ. ఎండు,పచ్చి రకాలుగా వీటిని విక్రయిస్తారు. ఎండు ఈనెలు కమ్మల నుంచి తొలగించి కొంతకాలం ఎండలో ఆరగట్టి వీటిని కట్టలుగా కట్టి ప్రధానంగా ఒడిశా, చత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఈ ఎండు ఈనెలకు ప్రత్యేక డిమాండ్ ఉంది. అదేవిధంగా పచ్చి ఈనెలు ఒడిశా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. వీటిని ప్రధానంగా పైకప్పులకు ఊటబావుల్లో నీటి నిల్వ కోసం, అగ్గిపుల్లల తయారీ, ఐస్‌క్రీమ్ తయారీలో వినియోగిస్తున్నారు. చెట్టులోని భాగం బల్లలుగా ఇంటి కలపగా నిర్మాణాలకు ఉపయోగిస్తున్నారు. ఇలా కొబ్బరిలో ప్రతి భాగమూ ఉపయోగమే. ప్రభుత్వ సాయం ఇలా.. ఉద్దానం కొబ్బరి పంటకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో విధాలుగా సాయపడుతున్నాయి. కొబ్బరి అభివృద్ధి బోర్డు(సీడీబీ), రాష్ట్ర ప్రభు త్వం ఆధ్వర్యంలో నడిచే ఉద్యానవన శాఖల సంయుక్త సహకారంతో ఎన్నో పథకాలు కొబ్బరిరైతులకు అందిస్తున్నాయి. కొబ్బరి రైతులకు వడ్డీ లేని రుణం లక్ష వరకు కాగా పంట రుణంగా(క్రాప్ లోన్) గరిష్టంగా రూ.1.60లక్ష స్వల్పవడ్డీకే అందిస్తున్నారు. దీంతో పాటు కిసాన్ గోల్డ్ కార్డ్ పేరిట కొబ్బరితోటల అభివృద్ధి పథకం కింద పెద్ద రుణాన్ని కూడా అందజేస్తున్నారు. డీసీసీబీ ద్వారా షార్ట్‌టెర్మ్, లాంగ్‌టెర్మ్ రుణాల పేరిట భారీ మొత్తంలో రుణాలు కల్పిస్తున్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక రైతులకు ఉచిత పంటల బీమా పథకం అమలుచేశారు. దీనికింద కేంద్రప్రభుత్వం 50శాతం ప్రీమియం చెల్లిస్తే, రాష్ట్రప్రభుత్వం మిగిలిన 50 శాతం ప్రీమి యం చెల్లించేవిధంగా దీన్ని ఉచిత పంటల బీమా పథకంగా కొబ్బరికి అనువర్తింపజేస్తున్నారు. అలాగే డ్రిప్ ఇరిగేషన్ సౌ కర్యం 90 శాతం రాయితీ కల్పించేందుకు ప్రభుత్వం సింహభాగం నిధులు మంజూరు చేస్తోంది. దీని కోసం రైతులకు వ్యవసాయ విద్యుత్ మోటార్లను ఏర్పాటు చేసుకున్న వారికి ఉచిత విద్యుత్ పథకాన్ని కూడా అందిస్తోంది. కొబ్బరి పునరుద్ధరణ పథకం, విస్తీర్ణ అభివృద్ధి పథకం వంటివి మేలు చేస్తున్నాయి. కొబ్బరి కల్లు (కల్పరసం): కొబ్బరి దశదిశ మార్చేది ఇదే. అతి విలువైన ఉత్పత్తి కొబ్బరి కల్లు (కల్పరసం)ను పూర్తి సాంకేతిక పరిజ్ఞానంతో కొన్ని రకాల పద్ధతులు వినియోగించి ఉత్పత్తి చేస్తారు. ఇలా చేయడం వల్ల కల్లు పులిసిపోకుండా (ఫెర్మంటేషన్ అవకుండా) ఉంటుంది. ఇది పూర్తిగా ఆరోగ్యకరమైన పానీయం. కొబ్బరి పరిశ్రమలు నెలకొల్పుతాం కేవలం కొబ్బరిపైనే ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవించే కుటుంబాలు జిల్లాలో వేలాదిగా ఉన్నా యి. ప్రకృతి వైపరీత్యాలు వస్తే ముందుగా నష్టపోయేది కొబ్బరి రైతులే. స్పీకర్ తమ్మినేని సీతారాం, ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసు, జిల్లా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుల కృషితో ఇక్కడి సమస్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ఉద్దానం ప్రాంతంలో కొబ్బరి క్షేత్రాన్ని నెలకొల్పేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. విలువ ఆధారిత ఉత్పత్తులపై డీసీఎంఎస్ దృష్టి సారించింది. కేంద్ర ఆత్మ నిర్భర్ స్కీమ్ ద్వారా కొబ్బరి రైతుల కలలను సాకారం కానున్నాయి. కొబ్బరి అనుబంధ పరిశ్రమలు నెలకొల్పేందుకు సుమారు రూ.200 కోట్లకు ప్రతిపాదనలు పంపించడం జరిగింది. ఉద్దానం ప్రాంతంలో కొబ్బరి పరిశ్రమను నెలకొల్పుతాం. – పిరియా సాయిరాజు, జిల్లా డీసీఎంఎస్ చైర్మన్, శ్రీకాకుళం -
రైతులు ఉత్పత్తిదారుల సొసైటీలుగా ఏర్పడాలి
ప్రపంచ కొబ్బరి దినోత్సవ సభలో కలెక్టర్ అరుణ్‌కుమార్ అమలాపురం/ అంబాజీపేట : కొబ్బరి రైతులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభం నుంచి బయటపడాలన్నా.. కొబ్బరి అభివృద్ధి బోర్డు, ప్రభుత్వాల నుంచి రాయితీలు, ప్రోత్సాహకాలు పొందాలంటే వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘం (ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ – ఎఫ్‌పీవో) ఏర్పడాలని జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ అన్నారు. మాచవరం పంచాయతీ కార్యాలయం వద్ద భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో సర్పంచ్ సుంకర సత్యవేణి అధ్యక్షతన శుక్రవారంSప్రపంచ కొబ్బరి దినోత్సవాన్ని నిర్వహించారు. తొలుత కొబ్బరి రైతులు మాట్లాడుతూ కొబ్బరి గొడౌన్లు ఏర్పాటు చేయాలని, కొబ్బరి ధర కల్పించాలని, ధాన్యం మాదిరిగానే కొబ్బరి కాయలను కొనుగోలు చేయాలని, ప్రభుత్వం రైతులు సమస్యలను గుర్తించి విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని, సంక్షోభంలో ఉన్న రైతులను కాపాడాలని కోరారు. పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు మాట్లాడుతూ సంక్షోంభంలో ఉన్న కొబ్బరి రైతులను ఆదుకునేలా వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామన్నారు. రిలయన్స్ ఫౌండేషన్ కొబ్బరి రైతులకు ఉచితంగా ఇచ్చిన వర్మీకంపోస్టు బెడ్లను కలెక్టర్, జెడ్పీ చైర్మన్లు పంపిణీ చేశారు. ఎంపీపీ దాసరి వీరవెంకట సత్యనారాయణ, జెడ్పీటీసీ సభ్యుడు బొంతు పెదబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ అరిగెల బలరామమూర్తి, సొసైటీ అధ్యక్షుడు గణపతి వీరరాఘవులు, అమలాపురం ఆర్డీవో జి.గణేష్‌కుమార్, ఎంపీడీఓ తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్, తహసీల్దారు బి.శ్రీనివాస్, బీకేఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు. బాధిత మహిళల కోసం ప్రత్యేక కేంద్రం కాకినాడ సిటీ : జిల్లాలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బాధిత మహిళల కోసం ప్రత్యేక కేంద్రం (ఒన్‌స్టాప్ సెంటర్) ఏర్పాటు పరిశీలనలో ఉందని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లాలో జరుగుతున్న అంగన్వాడీ భవన నిర్మాణ ప్రగతిని అధికారులతో సమీక్షించారు. ఈ కేంద్రం ద్వారా వివిధ సంఘటనల్లో బాధితులైన మహిళలకు వైద్య, న్యాయం సహాయం, కౌన్సెలింగ్ వంటి సౌకర్యాలు కల్పిస్తారన్నారు. ఈ కేంద్రం తాత్కాలికంగా కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో ఏర్పాటుకు అనువైన ప్రదేశాన్ని పరిశీలించాలని ఇన్చార్జి ప్రాజెక్ట్ ఆఫీసర్ టి.ప్రవీణకు కలెక్టర్ సూచించారు. జిల్లాలో 450 అంగన్వాడీ కేంద్రాలలో ఎల్పీజీ గ్యాస్ సదుపాయం లేదని, 1,132 కేంద్రాలకు స్టౌలు కావాలని, ఈ మేరకు రూ.2లక్షల విడుదల చేయాలని, మహిళా అభివృద్ది, శిశు సంక్షేమశాఖ కమిషనర్ చక్రవర్తిని ఫోన్ ద్వారా కలెక్టర్ కోరారు. జిల్లాలో సీసీ రోడ్ల నిర్మాణ ప్రగతిని కూడా కలెక్టర్ సమీక్షించారు. -
ఔషధ జలనిధి కొబ్బరి బోండాం
నేడు కోకోనట్ డే కడప కల్చరల్: ఇద్దరు వ్యక్తులు ఎడారిలో వెళుతున్నారు. వారికి రెండు రోజులుగా ఆహారం లేదు. దాహంతో అలమటిస్తున్నారు. అందులో ఒకడు నడవలేక నీరసంగా ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత సొమ్మసిల్లి పడిపోయాడు. రెండో వ్యక్తికి ఏం చేయాలో పాలుపోలేదు. కాసేపు ఆలోచించాడు. అటు, ఇటు చూశాడు. సమీపంలోని గట్టుపై గల కొబ్బరి చెట్టు ఎక్కి కాయలు కోశాడు. ఒక కొబ్బరికాయను తన సహచరునికి సెలైన్ లాగా ఎక్కించాడు. పడిపోయిన వ్యక్తి కొద్దిసేపటికి మెల్లగా లేచికూర్చున్నాడు. ఆ తర్వాత కొబ్బరి బోండాం తాగాడు. కాసేపటికి మళ్లీ నడవడం మొదలుపెట్టాడు. ఎప్పుడో పాతికేళ్ల నాటి హాలివుడ్ సినిమాలోని దృశ్యం ఇది. సాధ్యాసాధ్యాలు, ఔచిత్యం గురించి పక్కన పెడితే కొబ్బరిలోని ఔషధ గుణాలను గురించి ఆ సినిమా దర్శకుడు తనదైన శైలిలో చెప్పాడు. కొబ్బరి నీటిలోగల సుగుణాలను ప్రపంచానికి తెలియజెప్పి అందరిలోనూ అవగాహన పెంచేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబరు 2న ప్రపంచ కోకోనట్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. రోజూ కోట్లాది రూపాయలు విలువజేసే పలు రకాల కంపెనీల శీతల పానీయాలు అమ్ముడవుతున్నా తరతరాలుగా కొబ్బరి నీటికిగల విశిష్టత తగ్గలేదు. నేటికీ కొబ్బరి నీళ్లంటే ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. అందుకే మన దేశంలో దేవుళ్లకు ఎన్ని రకాల పండ్లను నైవేద్యంగా సమర్పించినా పూజార్హత మాత్రం కొబ్బరి కాయకే. కొబ్బరికాయ అనగానే మనకందరికీ కేరళ గుర్తుకొస్తుంది. అక్కడ చిన్న గుమ్మడికాయ సైజు కొబ్బరికాయలు ఉంటాయని, అందులో పెద్ద చెంబుడు నీళ్లుంటాయని చెప్పుకుంటారు. అక్కడి నుంచి సమీపంలోని రాష్ట్రాలకు రోజూ టన్నుల కొద్ది కొబ్బరిబోండాలు, కొబ్బరికాయలు ఎగుమతి అవుతుంటాయి. ఆ రాష్ట్రం ప్రధాన ఆర్థిక వనరుల్లో కొబ్బరి కూడా కావడం విశేషం. మన రాష్ట్రంలో ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలు కొబ్బరి బోండాల ఉత్పత్తికి పేరుగాంచాయి. బెంగుళూరు నుంచి కూడా కొబ్బరిబోండాలు దిగుమతి చేసుకుంటున్నాం. మన జిల్లాలో కూడా కొబ్బరిబోండాలకు మంచి డిమాండ్ ఉంది. అందుబాటులో ఉన్నవి చిన్నసైజు కాయలే ఉన్నా ఖరీదు మాత్రం రూ. 15-25 వరకు ఉంటుంది. కంపెనీల శీతల పానీయాల్లో పురుగుల మందు ఉంటుందని చెబుతారు. కానీ కొబ్బరి నీళ్లు మాత్రం పూర్తి స్వచ్ఛమైనవి, ఆరోగ్యానికి మంచివని, పో షకాహార విలువలు ఉంటాయని నిపుణు లు తెలుపుతున్నా రు. నర్సింగ్ హో మ్ల వద్ద మిగతా ఇతర దుకాణాల కంటే కొబ్బరికాయలు విక్రయించే దుకాణాలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. పోషక విలువలు కొబ్బరి నీళ్లు ఆరోగ్యాన్ని అందిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. వంద గ్రాముల కొబ్బరి నీటినుంచి 17.4 క్యాలరీల శక్తి లభిస్తుంది. ఈ నీరు శరీరాన్ని చల్ల బరచడమే కాకుండా జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను ప్రతిభావంతంగా నివారిస్తుంది. ముఖ్యంగా అతిసార వ్యాధి బాధితులు ఆ సమస్యనుంచి బయటపడేందుకు కొబ్బరి నీటిని తీసుకుంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు. మూత్రపిండాలు, మూత్ర నాళాలలో ఏర్పడే రాళ్లను కరిగించే గుణం కొబ్బరి నీటిలో ఉంది. లేత కొబ్బరి నీళ్లలో పొటాషియం, సోడియం, కాల్షియం, భాస్వరం, ఇనుము, రాగి, గంధకం, ఫ్లోరైడ్ తదితర ఖనిజాలు కూడా ఉంటాయి.వీర్య వృద్ధికి, మూత్ర విసర్జన సులభంగా అయ్యేందుకు కొబ్బరినీరు ఎంతో ఉపయోగకరం.