నేడు కోకోనట్ డే
కడప కల్చరల్: ఇద్దరు వ్యక్తులు ఎడారిలో వెళుతున్నారు. వారికి రెండు రోజులుగా ఆహారం లేదు. దాహంతో అలమటిస్తున్నారు. అందులో ఒకడు నడవలేక నీరసంగా ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత సొమ్మసిల్లి పడిపోయాడు. రెండో వ్యక్తికి ఏం చేయాలో పాలుపోలేదు. కాసేపు ఆలోచించాడు. అటు, ఇటు చూశాడు. సమీపంలోని గట్టుపై గల కొబ్బరి చెట్టు ఎక్కి కాయలు కోశాడు. ఒక కొబ్బరికాయను తన సహచరునికి సెలైన్ లాగా ఎక్కించాడు. పడిపోయిన వ్యక్తి కొద్దిసేపటికి మెల్లగా లేచికూర్చున్నాడు. ఆ తర్వాత కొబ్బరి బోండాం తాగాడు. కాసేపటికి మళ్లీ నడవడం మొదలుపెట్టాడు.
ఎప్పుడో పాతికేళ్ల నాటి హాలివుడ్ సినిమాలోని దృశ్యం ఇది. సాధ్యాసాధ్యాలు, ఔచిత్యం గురించి పక్కన పెడితే కొబ్బరిలోని ఔషధ గుణాలను గురించి ఆ సినిమా దర్శకుడు తనదైన శైలిలో చెప్పాడు. కొబ్బరి నీటిలోగల సుగుణాలను ప్రపంచానికి తెలియజెప్పి అందరిలోనూ అవగాహన పెంచేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబరు 2న ప్రపంచ కోకోనట్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
రోజూ కోట్లాది రూపాయలు విలువజేసే పలు రకాల కంపెనీల శీతల పానీయాలు అమ్ముడవుతున్నా తరతరాలుగా కొబ్బరి నీటికిగల విశిష్టత తగ్గలేదు. నేటికీ కొబ్బరి నీళ్లంటే ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. అందుకే మన దేశంలో దేవుళ్లకు ఎన్ని రకాల పండ్లను నైవేద్యంగా సమర్పించినా పూజార్హత మాత్రం కొబ్బరి కాయకే. కొబ్బరికాయ అనగానే మనకందరికీ కేరళ గుర్తుకొస్తుంది. అక్కడ చిన్న గుమ్మడికాయ సైజు కొబ్బరికాయలు ఉంటాయని, అందులో పెద్ద చెంబుడు నీళ్లుంటాయని చెప్పుకుంటారు.
అక్కడి నుంచి సమీపంలోని రాష్ట్రాలకు రోజూ టన్నుల కొద్ది కొబ్బరిబోండాలు, కొబ్బరికాయలు ఎగుమతి అవుతుంటాయి. ఆ రాష్ట్రం ప్రధాన ఆర్థిక వనరుల్లో కొబ్బరి కూడా కావడం విశేషం. మన రాష్ట్రంలో ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలు కొబ్బరి బోండాల ఉత్పత్తికి పేరుగాంచాయి. బెంగుళూరు నుంచి కూడా కొబ్బరిబోండాలు దిగుమతి చేసుకుంటున్నాం. మన జిల్లాలో కూడా కొబ్బరిబోండాలకు మంచి డిమాండ్ ఉంది. అందుబాటులో ఉన్నవి చిన్నసైజు కాయలే ఉన్నా ఖరీదు మాత్రం రూ. 15-25 వరకు ఉంటుంది. కంపెనీల శీతల పానీయాల్లో పురుగుల మందు ఉంటుందని చెబుతారు. కానీ కొబ్బరి నీళ్లు మాత్రం పూర్తి స్వచ్ఛమైనవి, ఆరోగ్యానికి మంచివని, పో షకాహార విలువలు ఉంటాయని నిపుణు లు తెలుపుతున్నా రు. నర్సింగ్ హో మ్‌ల వద్ద మిగతా ఇతర దుకాణాల కంటే కొబ్బరికాయలు విక్రయించే దుకాణాలే ఎక్కువగా కనిపిస్తుంటాయి.
పోషక విలువలు
కొబ్బరి నీళ్లు ఆరోగ్యాన్ని అందిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. వంద గ్రాముల కొబ్బరి నీటినుంచి 17.4 క్యాలరీల శక్తి లభిస్తుంది. ఈ నీరు శరీరాన్ని చల్ల బరచడమే కాకుండా జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను ప్రతిభావంతంగా నివారిస్తుంది. ముఖ్యంగా అతిసార వ్యాధి బాధితులు ఆ సమస్యనుంచి బయటపడేందుకు కొబ్బరి నీటిని తీసుకుంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు.
మూత్రపిండాలు, మూత్ర నాళాలలో ఏర్పడే రాళ్లను కరిగించే గుణం కొబ్బరి నీటిలో ఉంది.
లేత కొబ్బరి నీళ్లలో పొటాషియం, సోడియం, కాల్షియం, భాస్వరం, ఇనుము, రాగి, గంధకం, ఫ్లోరైడ్ తదితర ఖనిజాలు కూడా ఉంటాయి.వీర్య వృద్ధికి, మూత్ర విసర్జన సులభంగా అయ్యేందుకు కొబ్బరినీరు ఎంతో ఉపయోగకరం.
ఔషధ జలనిధి కొబ్బరి బోండాం
Published Tue, Sep 2 2014 1:27 AM | Last Updated on Sat, Sep 2 2017 12:43 PM
Advertisement
Advertisement